గుండెపోటుతో విరసం నేత చలసాని మృతి : చంద్రబాబు సంతాపం

శనివారం, 25 జులై 2015 (14:46 IST)
ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం నేత, సాహితీ విమర్శకులు చలసాని ప్రసాద్ (83) శనివారం కన్నుమూశారు. చలసాని ప్రసాద్ తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే విశాఖలోని నివాసంలో మరణించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా భట్ల పెనమర్రు గ్రామం. 
 
సాంస్కృతిక, సాహిత్య ఉద్యమంలో చలసాని కీలక పాత్ర పోషించారు. సాహిత్యం, సినిమాల పట్ల లోతైన అవగాహన ఉన్న చలసాని అనేక పుస్తకాలను రచించారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన చలసాని, విరసం వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, వరవరరావు తదితరులతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టైన చలసాని, ఆ తరువాత కూడా పలుమార్లు జైలుకు వెళ్లారు.
 
ఇకపోతే విరసం నేత, ప్రముఖ కవి చలసాని మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చలసాని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఓ వైపు పేదల కోసం పోరాడుతూనే... మరోవైపు సాహితీ రంగానికి చలసాని ఎంతో సేవ చేశారని కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి