వివేకా కూతురుపై రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరెస్ట్
శనివారం, 14 ఆగస్టు 2021 (16:13 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మలుపు ఇది. పెద్దాయన హత్య చేసింది ఎవరు అనేది సీబీఐ విచారణ కొనసాగుతుండగా, కథ పలు మలుపులు తిరుగుతోంది.
తాజాగా వివేకా కుమార్తెను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి డీజీపీ, సీబీఐ, కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ నెల 10న ఆ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీతరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడు మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ నిర్వహించడానికి కారణాలు ఏంటి? ఫోన్లు ఎవరెవరికి చేశారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.
దీనితో ఇపుడు కథ కొత్త మలుపు తిరిగినట్లయింది. అసలు మణి కంఠారెడ్డి ఈ రెక్కీ ఎందుకు చేస్తున్నాడు? ఎవరు ఆయనతో ఈ పనులు చేయిస్తున్నారనే కోణంలో సి.బి.ఐ. విచారణ మలుపు తిరుగుతోంది.