దేవీప్రసాద్ ఓటమికి కారణం... కేసీఆర్‌పై ఉన్న కోపమే : ఎర్రబెల్లి

శుక్రవారం, 27 మార్చి 2015 (15:07 IST)
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమ నేత దేవీ ప్రసాద్ ఓడిపోవడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరే కారణమని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై ఉన్న వైఖరిని గ్యాడ్యుయేట్లు, ప్రజలు ఈ విధంగా తీర్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, నిరంకుశ వైఖరిపై ప్రజలు తమ కోపాన్ని ఉద్యమ నేత దేవీప్రసాద్‌పై చూపించారన్నారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క సమస్యను కూడా ఆయన పరిష్కరించలేదని, ప్రజల్లో కేసీఆర్‌పై కోపమే దేవీప్రసాద్ ఓటమికి కారణమని అన్నారు. అధికార పక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చను మర్చిపోయారని మండిపడ్డారు. 
 
ఇక, తాము క్షమాపణ చెబుతామని చెప్పినా సభాపతి పట్టించుకోలేదని, జాతీయగీతం సందర్భంగా జరిగిన గొడవ వీడియో ఫుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలపై నిలదీస్తామనే భయంతోనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు చేతిలో దేవీప్రసాద్ ఓడిపోయిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి