తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు వపన్ కళ్యాణ్, పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పర్యటించి గ్రామాల్లో పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై ఆరా తీశారు. బాధితుల సూచనలు విన్న అనంతరం తుపాను బాధితులకి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలియచేసారు.
ఈ సందర్భంగా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌గారి పిలుపు మేరకు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఆయన మిత్రులు కూడా కొంతమంది ఇందులో భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చారు. మేము ఒక సిస్టమేటిక్‌గా వర్క్ చేయాలి అనుకుంటున్నాం. జనసేన పార్టీ తరుపున రేపటి నుంచి ఏడు మండలాలకు ఏడు బృందాలు క్షేత్రస్థాయిలో గ్రామాలన్నింటిని పర్యటించనున్నాం.
ముందుగా పాఠశాలల్లోని పిల్లలకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, పెన్సిల్, పెన్స్ వెంటనే సరఫరా చేయడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో మలేరియా ఉంది. డయేరియా ఉందని మా దృష్టికి వచ్చింది. మా డాక్టర్ గారి టీమ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి అవసరమైన వారికి మెడిసిన్ పంపిణి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అలాగే మంచినీటి ప్యాకెట్స్ కూడా సరఫరా చేస్తాం.
చలికాలం వస్తుంది కాబట్టి కొన్ని బ్లాంకెట్స్ కూడా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీపరంగా నగదు రూపంలో తీసుకోదలచుకోలేదు. ఆదుకుంటాం అని హామీ ఇచ్చాం కాబట్టి.. వెంటనే సహాయ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తున్నాం. ఎంత ఖర్చు అయినా సరే.. గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తాం. పార్టీకి సంబంధం లేని వాళ్లు కూడా ముందుకు వచ్చారు. జనసేన పార్టీ తరపున అందరకీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అన్నారు.