మోడీ వల్లనే మహిళలకు దుస్థితి: హఫీస్ కరీముల్లా

సోమవారం, 9 మార్చి 2020 (20:37 IST)
బేటీ బచావో బేటి పడావో అని నినాదాలు చేసే భారత ప్రధాన మంత్రి మోడీ ఈరోజు భారతీయ మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేసే స్థాయికి తీసుకువచ్చారని ముస్లిం సంఘ నాయకులు హఫీస్ కరీముల్లా విజయవాడ పంజా సెంటర్ లోని శాహిబాగ్ లోతెలిపారు.

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబమైనా, దేశమైన అభివృద్ధి చెందాలంటే అందులో మహిళ పాత్ర ఉంటుందని అదేవిధంగా దేశాభివృద్ధిలో కూడా మహిళలు భాగస్వాములుగా ఉన్నారని, మహిళాభివృద్ధి జరిగిన రోజే దేశ అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.

యన్. ఆర్ .సి, సి .ఏ .ఏ, ఎన్. పి. ఆర్ లకు వ్యతిరేకంగా యావత్ భారతదేశం లోని మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న మహిళలకు గౌరవం ఇస్తున్నామని చెప్పుకుంటున్న మోడీకి కనపడకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. సహనానికి మారుపేరైన స్త్రీలు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు.

స్త్రీల శక్తి ఏంటో స్వాతంత్ర్య ఉద్యమంలోనే నిరూపించారు. ఈరోజు భారతదేశంలో అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. అటువంటి మహిళలను కించపరుస్తూ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాలకు సహనంగా, శాంతియుతంగా తమ నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని, రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న మహిళలకు ఎల్లప్పుడూ తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

శాంతి ద్వారానే ఏదైనా సాధించవచ్చని మహమ్మద్ ప్రవక్త తెలిపారని, శాంతి ద్వారానే మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకుందామని జర్నలిస్ట్ అఫ్జల్ అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో శాంతియుతంగా పోరాటం చేసి యన్. ఆర్ .సి, సి .ఏ .ఏ, ఎన్. పి. ఆర్ లను తిప్పికొడతామని స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ముస్లింలు వీరోచితంగా పోరాడారని ఆయన తెలిపారు.

యన్. ఆర్ .సి, సి .ఏ .ఏ, ఎన్. పి. ఆర్ లకు వ్యతిరేకంగా పోరాడే పార్టీలకు రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. యన్. ఆర్ .సి, సి .ఏ .ఏ, ఎన్. పి. ఆర్  లకు మద్దతు తెలిపే పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన హితవు పలికారు.

యావత్ భారతదేశం మహిళలు చేస్తున్న నిరసనలకు సంఘీభావం తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమని,దేశ పాలకులకు ఆ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలన్నారు.

యన్. ఆర్ .సి, సి .ఏ .ఏ, ఎన్. పి. ఆర్ లను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అల్తాఫ్, సయ్యద్ ఇక్బాల్. కరీముల్లా తదితరులు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు