ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ చూస్తే నవ్వొచ్చింది : వైకాపా నేత సజ్జల

వరుణ్

సోమవారం, 3 జూన్ 2024 (10:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే సంస్థ ఆదివారం తాను నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. దీనిపై వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఆశ్చర్యం వేసిందన్నారు. ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చిందన్నారు. ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారని అవి కూడా దయతో ఇచ్చారేమో అర్థం కావడం లేదన్నారు. మరీ ఎక్కువ సీట్లు ఇస్తే బాగోదు అనుకున్నారేమో అంటూ ఇండియా టుడే ఎగ్జిట్ ఫలితాలపై సజ్జల అసహనం వ్యక్తం చేశారు. 
 
అలాగే, పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందిస్తూ, 'పోస్టల్ బ్యాలట్లకు సంబంధించి తన మార్గదర్శకాలకు విరుద్ధంగా తాజాగా ఈసీ జారీచేసిన ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లు ఉన్నాయి. ఈ ఆదేశాలు తికమక పెట్టడానికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు. అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. సీల్, ఇతర వివరాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఇది మరీ అడ్డగోలుగా ఉంది. సంతకం ఎవరిదన్న విషయం ఎవరికి తెలుస్తుంది? ఈసీ నిబంధనలకు వాళ్లే తూట్లు పొడిచారు. ఆ సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు. కానీ అధికారులు మాత్రం సీల్ అవసరం లేదని చెప్పారు. అదీ మన రాష్ట్రంలోనే. అందుకే దీన్ని సవాలు చేశాం. హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలేదు. సుప్రీంకోర్టులో వేశాం. ఏం వస్తుందనేది నేడో, రేపో తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు