తమ పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డిని ఓ మోసగాడంటూ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై, కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే తమ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు.
ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, 'విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుంది? ఆయన చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి' అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డికి ఇంకా మూడున్నర సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉందని, అయినప్పటికీ కేవలం చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని జగన్ ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేనందున, విజయసాయిరెడ్డిని మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసని జగన్ అన్నారు. "తన రాజీనామా వల్ల చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి, తన మూడున్నరేళ్ల పదవీకాలాన్ని ఆ కూటమికి, ప్రలోభాలకులోనై అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే ప్రకటనలకు ఏం విలువ ఉంటుంది?" అని జగన్ ప్రశ్నించారు.