చంద్రబాబు ఓ గజదొంగ.. పచ్చిమోసకారి : జగన్ నిప్పులు

సోమవారం, 6 నవంబరు 2017 (13:02 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఓ గజదొంగ, పచ్చిమోసకారి అంటూ మండిపడ్డారు. తాను చేపట్టిమ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. 
 
ఇడుపులపాయ వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని, ఈ నాలుగేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో రైతులు, అక్కాచెల్లెమ్మలు మోసపోయారని, విద్యార్థులు, నిరుద్యోగులు దగాపడ్డారని, అందుకే రైతుల నుంచి అక్కాచెల్లెమ్మల వరకు అందరిలోనూ చంద్రబాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే ఉండడు అనే మాట వినిపిస్తోందని వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబు పాలనలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని, ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇచ్చేందుకు తాను పాదయాత్ర చేపడుతున్నట్టు జగన్‌ ప్రకటించారు. 
 
ఈరోజు ఇడుపులపాయలో మహానేత రాజశేఖర్‌రెడ్డి మన అందరి కళ్ల ముందే కనిపిస్తున్నారు. ఆ దివంగత నేతకు మరణం లేదు' అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 'జగన్‌ను రాజకీయాల్లో ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక కారణంతో, జగన్‌ను రాజకీయాల నుంచి తప్పించాలనే ఒకే కారణంతో అధికారంలో ఉన్న నేతలు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు వయస్సులో నా వయస్సు సగం కూడా ఉండదు. చంద్రబాబు కొడుకు వయస్సులో నేను ఉంటానేమో. కానీ చంద్రబాబు రాక్షసత్వం చూసి.. నన్ను రాజకీయల్లో తప్పించాలన్న చంద్రబాబు తీరు చూసి బాధ కలుగుతోందన్నారు. 
 
దివంగత నేత వైఎస్‌ఆర్‌ అందించిన ఇంతపెద్ద కుటుంబాన్ని చూసినప్పుడు ఆ బాధ నుంచి ఊరట కలుగుతుందన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వంలోని పెద్దలతో పోరాటం చేస్తున్నానని, రాజకీయాలలో చేయని పోరాటం లేదని గుర్తుచేసుకున్నారు. తాను నడిచిన నా ప్రతి అడుగులోనూ ప్రజలందరూ అండగా నిలబడ్డారు కాబట్టే చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తనకు తోడుగా నిలిచిన రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని మరిచిపోనని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు