చిరుతో రాయబారం సాగేనా...దాసరి?

అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ హంగ్ వచ్చే సూచనలున్నాయని వార్తలు వస్తుండటంతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మిత్రుల కోసం వేట ప్రారంభించింది.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీని యూపీఏ వైపుకు మళ్ళించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్రమాజీ బొగ్గు గనుల శాఖామంత్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ దర్శకుడు, గిన్నిస్‌బుక్ అవార్డు గ్రహీత దాసరి నారాయణరావును ఉపయోగించుకోవాలని చూస్తోంది.

గురువారంనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో దాసరి ఢిల్లీలో సమావేశమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాసరి చిరంజీవి సామాజిక వర్గానికే చెందడంతో చిరుతో రాయబారం నడపాలని ఈ భేటిలో చర్చించినట్లు సమాచారం.

ఇదిలావుండగా గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందునుంచే దాసరి నారాయణరావు చిరంజీవిపై చాలా విమర్శలు చేశారు.

కాగా ఇప్పుడు దాసరి నారాయణరావు జరిపే రాయబారానికి చిరంజీవి ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి