31న భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

మంగళవారం, 26 మే 2009 (10:17 IST)
FileFILE
భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈనెల 31వ తేదీన జరుగనుంది. ఇందులో లోక్‌సభతో పాటు, రాజ్యసభలో పార్టీ తరపున నాయకత్వం వహించే ప్రతిపక్ష నేతలను ఎన్నుకుంటారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అద్వానీని పార్లమెంటరీ పార్టీ ఎన్నుకుంటుందని, ఇందుకోసం ఈనెల 31వ తేదీన జరుగుతుందని చెప్పారు.

కాగా, పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా ఉండేందుకు తొలుత అద్వానీ నిరాకరించారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర పరాజయం ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. దీంతో ప్రతిపక్ష నేతగా కొనసాగలేనని తేల్చి చెప్పారు. అయితే, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు తెచ్చిన ఒత్తిడి, చేసిన విజ్ఞప్తులకు తలొగ్గిన అద్వానీ.. ప్రతిపక్షనేతగా కొనసాగేందుకు అంగీకరించిన విషయం తెల్సిందే.

అంతేకాకుండా, ఉభయ సభలకు ఉప నేతలను కూడా ఈ సమావేశంలోనే ఎన్నుకుంటారు లోక్‌సభలో పార్టీ ఉపనేతగా సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ఎస్.ఎస్.అహ్లువాలియా పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే.. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా సరైన అభ్యర్థిని ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి