చెన్నైలో డీఎంకే అత్యవసర భేటీ వాయిదా

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో శుక్రవారం జరగాల్సిన డీఎంకే ఎగ్జిక్యూటివ్ విభాగ అత్యవసర సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

మరోవైపు సమావేశం కోసమని పార్టీ అధినేత కరుణానిధితో పాటు ఎంపీలందరు చెన్నై చేరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో మంత్రి పదవుల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో దీనిపై చర్చించేందుకు డీఎంకే ఈ భేటీని ఏర్పాటు చేసింది. చివరి నిమిషంలో ఈ భేటీని రద్దు చేసింది.

18 ఎంపీలు కలిగిన డీఎంకేకు కోరినన్ని మంత్రిబెర్తులు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంది. దీంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కరుణానిధి అలిగి చెన్నైకు చేరుకున్నారు. ముఖ్యంగా, గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన టీఆర్.బాలు, ఏ.రాజాలకు మంత్రి పదవులు కేటాయించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ససేమిరా అంటున్నారు. దీనిపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే, తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడి ఉంది. రాష్ట్ర శాసనసభలో అధికార డీఎంకేకు 96 సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు 34 మంది సభ్యులు ఉన్నారు. 234 సీట్లు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు కావాలి. అయితే, డీఎంకేకు 22 సీట్లు తక్కువగా ఉండటంతో కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు ఇస్తోంది.

వెబ్దునియా పై చదవండి