పార్టీ పదవికి అల్లు అరవింద్ రాజీనామా!

FileFILE
ఎన్నికల ఫలితాలపై ప్రజారాజ్యం పార్టీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ మూలకారణమని పలువురు సీనియర్ నేతలు మూకుమ్మడిగా ఆరోపించారు. దీంతో కలత చెందిన అల్లు అరవింద్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసేందుకు పూనుకున్నారు. ఒక దశలో ఆయన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి సమర్పించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు పీఆర్పీ రాజకీయ వ్యవహారాల కమిటీ గురువారం సమావేశమైంది. అరవింద్‌ వైఖరిని ఈ భేటీలో పలువురు సీనియర్లు ఎండగట్టినట్లు తెలిసింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. అంతేకాకుండా, పార్టీ కమిటీలన్నీ రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా పునర్నిర్మించాలని పలువురు సీనియర్లు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరో ప్రధాన కార్యదర్శి తమ్మినేని సీతారాం విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో ఎటువంటి విభేధాలు తలెత్తలేదని, రేపు మరోసారి సమావేశమై భవిష్యత్ రాజకీయాలపై చర్చిస్తామన్నారు. పార్టీ వైఫల్యానికి ఒక్కరినే బాధ్యులు చేయమని దీనికి సమిష్టి బాధ్యత వహిస్తున్నామని ఆయన చెప్పారు.

అంతకుముందు సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి అధినేత చిరంజీవితో పాటు సీనియర్‌ నేతలు ఉపేంద్ర, దేవేందర్‌గౌడ్‌, హరిరామజోగయ్య, తమ్మినేని సీతారాం తదితరులు హాజరయ్యారు.

ఈ ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే గెలిచి పార్టీ ఘోరంగా దెబ్బతింది. అధినేత చిరుతో పాటు ముఖ్య సీనియర్‌ నేతలు ఓటమి పాలవ్వడంపై ఈ భేటీలో చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.

వెబ్దునియా పై చదవండి