పీఆర్పీకి వ్యతిరేకంగా గ్లోబెల్ ప్రచారం: చిరు

FileFILE
ప్రజారాజ్య పార్టీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు, కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకుని గ్లోబెల్ ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారాన్ని చేరవేసే ముందు నిజానిజాలను తెలుసుకోవాలని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ పార్టీ పదవికి రాజీనామా చేశారని చేస్తున్న దుష్ప్రచారం పీఆర్పీ బలోపేతానికి ఆటంకాలు కలిగించడమేనని ఆయన దుయ్యబట్టారు.

టీవీల్లో వచ్చిన వార్తల్లో అణు మాత్రం నిజం లేదని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రచారాన్నే చేశారని, డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇచ్చారని గ్లోబెల్‌ ప్రచారం చేశారని ఆయన వాఖ్యానించారు. అల్లు అరవింద్‌ పాత్రపై కావాలనే దుష్ప్రచారం చేశారని, పార్టీని నిర్వీర్యం చేయడానికి ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చిరు పేర్కొన్నారు.

ఇదంతా టిక్కెట్లు రాని వారి పనేనని చిరు ఆరోపించారు. డబ్బుకోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో సినీ రంగానికి స్వస్తి చెప్పి ఇక్కడకు వచ్చానన్నారు. అభ్యర్థుల దగ్గర డుబ్బులు తీసుకునే దుస్థితి తాను, తన పార్టీ దిగజారలేదన్నారు.

గురువారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తాము ఎన్నికల ఫలితాలపై పార్టీ లోటు పాట్లను సమీక్షించుకున్నామే గానీ, గొడవలు పడలేదని చిరు వివరణ ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో కొన్ని లోపాలున్నాయని, అభ్యర్థుల ఖరారులో జాప్యం, సమన్వయ లోపం వంటివి తమ పార్టీ ఓటమికి కారణమని చిరంజీవి వివరించారు.

వెబ్దునియా పై చదవండి