ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన వైఎస్

FileFILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 22వ ముఖ్యమంత్రిగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం సరిగ్గా 6.32 నిమిషాలకు ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆయన చేత గవర్నర్ నారాయణ్ దత్ తివారీ ప్రమాణం చేయించారు.

"వైఎస్ రాజశేఖరెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడతానని, భయం కాని, పక్షపాతం కాని, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అని ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పరిశీలనలోకి వచ్చిన విషయాలను, అధికార రహస్యాలను వెల్లడించబోనని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అంతకు ముందు అరగంట ముందే ప్రమాణ స్వీకార సభా వేదికకు సతీమణి విజయలక్ష్మి, మనువడితో సహా చేరుకున్నారు. ఆయన నేరుగా వేదికపైకి వచ్చి ఆహూతులందరికీ అభివాదం చేశారు.

కాగా, గవర్నర్ తివారి సరిగ్గా సాయంత్రం 6.28 నిమిషాలకు స్టేడియానికి చేరుకున్నారు. వేదిక దిగి వచ్చిన వైఎస్ గవర్నర్‌ను చేయి పట్టుకొని వేదికి మీదకు నడిపించుకొని తీసుకువెళ్ళారు. వైఎస్ ప్రమాణ స్వీకారం అనంతరం వేదపండితులు వైఎస్‌ను వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు వైఎస్‌కు శాలువ కప్పి సన్మానించారు. అనంతరం క్రిస్టియన్ మత బోధకులు ప్రార్థనలు చేశారు. వైఎస్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఫాస్టర్లు ఆశీర్వచనాలు అందజేశారు. తరువాత ముస్లిం మత గురువులు కూడా ప్రార్థనలు నిర్వహించారు.

ఇదిలావుండగా, వైఎస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ ప్రత్యేక ఆహ్వాన అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.

వెబ్దునియా పై చదవండి