అమరావతీ నగర అపురూప శిల్పాలు....!

FILE
రేఖలలో లావణ్యం, రంగులలో రమణీయత, భావనలో సౌందర్యం, శైలిలో నవ్యత... వీటన్నింటి కలబోతయే అమరావతీ శిల్పసౌందర్యం. కళాక్షేత్రంగా అమరావతి ఆర్జించిన కీర్తి అద్భుతమైంది. వీటిద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ విదేశాలలో వ్యాపించటమేగాక.. అమరావతీ శిల్ప రీతియే ఆంధ్ర రీతిగా మారి పల్లవ, చాళుక్యాది శిల్పులకు ఒరవడిగా నిలిచింది.

ఆనాడు ఆంధ్రభూమిని కళామయం చేసిన అమరావతీ శిల్పాలు ఆంధ్రులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించిపెట్టాయి. ఆధునిక సభ్యతా సంస్కృతులు, సౌందర్య అలంకార విషయాలలో కలిగించిన ప్రతి పరిణామం ఇప్పటికి సుమారు రెండువేల సంవత్సరాల క్రితం విలసిల్లిన అమరావతీ కళలోనే కనిపించటం ఆశ్చర్యకరమైన విషయం.

ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలను స్థాపించి, మహోన్నతమైన చరిత్ర సృష్టించిన ప్రాంతమే అమరావతి. ఇది గుంటూరు జిల్లాకు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాటి బౌద్ధుల వైభవ చిహ్నాలు ఈనాటికీ చరిత్ర సాక్ష్యాలై మన కళ్లముందు నిలుస్తూ స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండే అమరావతీ నగరం.. పావన కృష్ణానదీమతల్లి తీరాన నెలకొని ఉంది.

అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉండే ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. ప్రాచీన బౌద్ధ వాజ్మయంలో విశిష్ఠ స్థానం పొందిన 'ఆంధ్రపురి'యే ఈ ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలం నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది.
స్త్రీలు సౌందర్య, శృంగార పిపాసులే..!
అమరావతీ శిల్పాలలోని స్త్రీ మూర్తులను గమనించినట్లయితే ఆ కాలపు స్త్రీలు సౌందర్య, శృంగార అంశాల మీద ఎంతగా శ్రద్ధ వహించేవారో అట్టే అర్థమవుతుంది. కొన్నిచోట్ల నగ్నంగా స్త్రీలను చెక్కినాగానీ, ధార్మిక భావనకు ఏ మాత్రం భంగం వాటిల్లని రీతిలో.. బుద్ధుడి గాథతో...


మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, అనంద గోత్రీయులు, చాళుక్యులు, చోళులు, కోట వంశీయులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహి నవాబులు వరుసగా అమరావతి/ధరణికోటను పాలించారు. క్రీ.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దం వరకు ధరణికోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకస్థానం వహించింది.

ఆంధ్రదేశమందు, ముఖ్యంగా కృష్ణానదీ లోయలో.. బౌద్ధమతం మౌర్యకాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి (ధరణికోట), భట్టిప్రోలు, జగ్గయ్యపేట (బేతవోలు), ఘంటసాల, శాలిహుండం మొదలైన చోట్ల స్తూప నిర్మాణం జరిగింది. వీటిలో అమరావతి స్తూపం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్తూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కల్నల్ కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు నాంది పలికారు. "దీపాలదిన్నె"గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797వ సంవత్సరంలో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే అప్పటికే మహాచైత్యం (స్తూపం) అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది.

అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. చివరిగా జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్‌కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ మ్యూజియంలలో భద్రపరిచారు.

ఈ మహాస్తూప సమూహంలో బౌద్ధ భిక్షువులకు ఆవాసాలు, విద్యాసంబంధిత కట్టడాలు కూడా అనేకం వున్నాయి. వీటిలో చాలావరకు స్థానికుల, భక్తుల విరాళాలతో కట్టబడ్డాయి. అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి.

FILE
ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడం". అమరావతి శిల్ప, శాసనాలవల్ల ఆ కాలము నాటి వృత్తులు, కులాలు, కుటుంబ వ్యవస్థ, ఐహిక జీవితం, స్త్రీల స్థానం, వస్త్ర సంస్కృతి, మతం, ఇతర సామాజిక స్థితులు విశదంగా వెల్లడవుతాయి.

క్రీస్తు పూర్వం నుంచి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా అలరారుతున్న ఈ అమరావతి పంచారామాలయిన అమరారామం, కొమరారామం, భీమారామం, ద్రాక్షారామం, క్షీరారామంలలో మొదటిది. ఆనాటి కట్టడాలు, ద్వార తోరణాలు, గడ్డితో కప్పిన గుడిసెలు, రాజ భవనాలు, ఇటుకలతో కట్టిన గోడలు, మేడలు, మిద్దెలు... ఇలాంటివన్నీ అమరావతీ శిల్పాలలో చూడవచ్చు.

అమరావతీ శిల్పకళ ప్రధానంగా దేశీయమైనది. గ్రీకు శిల్పకళ గురించి, అమరావతీ శిల్పులకు పరిచయం ఉన్నట్లుగా కూడా పలు శిల్పాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. కానీ బుద్ధ విగ్రహాలను మలచటంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోనూ ఆంధ్రదేశపు శిల్పుల ప్రత్యేకత, నైపుణ్యం స్పష్టంగా గోచరిస్తాయి.

ముఖ్యంగా స్త్రీ ప్రతిమలను చెక్కడంలో అమరావతీ శిల్పి స్వేచ్ఛ, కళానిపుణత అత్యద్భుతమైనవి. కొన్నిచోట్ల నగ్నంగా స్త్రీలను చెక్కినాగానీ, ధార్మిక భావనకు ఏ మాత్రం భంగం వాటిల్లని రీతిలో.. బుద్ధుడి గాథతో వాటిని ఎలాంటి సంబంధమూ లేకుండా చెక్కిన తీరు మనల్ని ఆశ్చర్యానికి గురిచేయకమానదు.

అలాగే ప్రజల జీవనానికి సంబంధించిన అనేకానేక శిల్పాలు అమరావతిలో మనకు దర్శనమిస్తాయి. సైన్యం, రథాలు, గుర్రాలు, ఆయుధాలు, ఆయుధాలు ధరించేవారి వేషధారణ, ధనుస్సు, బాణం, ఈటె, ఖడ్గం, డాలు, చక్రం, బల్లెం లాంటివి.. ఆనాడు ఉపయోగంలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఒంటెలను సైతం ఆనాటి యుద్ధాలలో వాడినట్లు చూపటం మరో విశేషం.

వివిధ రకాల వేషధారణలు, శిరోజాలంకరణ పద్ధతులను సైతం అమరావతీ శిల్పాలలో చూడవచ్చు. సామాన్యులు, ప్రభువులు, భిక్షకులు, ఆడవారు, మగవారు... ఇలా ఒకో రకం ప్రజలు వేసుకునే దుస్తులు, ధరించే ఆభరణాలు, చేసుకునే అలంకారాలు ఈ శిల్పాల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అమరావతీ శిల్పాలలోని స్త్రీ మూర్తులను గమనించినట్లయితే ఆ కాలపు స్త్రీలు సౌందర్య, శృంగార అంశాల మీద ఎంతగా శ్రద్ధ వహించేవారో అట్టే అర్థమవుతుంది.

ఆనాడు ఉద్యానవనాలలో చలువరాతి వేదికలుండేవనీ, వాటిలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించేవారని అమరావతీ శిల్పాల ద్వారా తెలుస్తోంది. పెద్ద భవనాలకు చిత్రవిచిత్రమైన అలంకారాలతో కూడిన పెద్ద పెద్ద ద్వారాలుండేవి. బౌద్ధభిక్షువులుండే కట్టడాల నిర్మాణాలలో వారి జీవనానికి అనుకూలమైన అమరికలను, విభాగాలను సైతం మనం గమనించవచ్చును.

ఎలా వెళ్లాలంటే... అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి ప్రతి అరగంటకూ బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచీల ద్వారా కృష్ణానది పై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉన్న ప్రదేశం, భారతీయ పురాతత్వ శాఖవారి సంగ్రహాలయం మరియు అమరేశ్వర మందిరం ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా చెప్పవచ్చు.

అమరేశ్వరాలయం గురించి చెప్పాలంటే... మహా శివుడు వివిధ పేర్లతో ఇక్కడ కొలువు దీరి ఉన్నాడు. సుమారు 15 అడుగుల ఎత్తులో రాతి శివలింగం ఉంటుంది. ప్రాణేశ్వర, అగస్థేశ్వరా, కోసలేశ్వర, సోమేశ్వర, పార్థీవేశ్వర అనే పలు రకాల పేర్లతో ద్రావిడుల పద్ధతిలో ఇక్కడి ఆలయం నిర్మించబడి ఉంటుంది. ఇక్కడి శివలింగం గూర్చి ఒక వింత కథ కూడా ప్రచారంలో ఉంది.

ఇక్కడి శివలింగము దినదినానికీ పెరుగుతూండటంతో.. ఆలయం ఎంత పెంచినా చాలక పోవటంతో ఆలయ నిర్వాహకులు, ఆ లింగం పెరగకుండా నెత్తిపై ఒక మేకుని కొట్టారని.. దాంతో పెరుగుదల ఆగిందని చెబుతుంటారు. దీన్ని రుజువు చేసేవిధంగా ఈ ఆలయంలోని లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తిపై మేకు, మేకు కొట్టినప్పుడు స్రవించిన రుధిర ధారల చారల గుర్తులుంటాయి. ఈ స్వామివారికి అభిషేకం చేయాల్సి వచ్చినా పైకి వెళ్లి చేయాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి