ఆయుర్వేదం: అన్నం తిన్న తర్వాత చేయి కడిగి..?

సోమవారం, 15 డిశెంబరు 2014 (13:54 IST)
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే కొన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు. భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా నెయ్యిని తీసుకోండి. నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది (అగ్నికి ఆజ్యం పోస్తుంది) అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. 
 
అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే.. కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ.. ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగ తుది వరస. 
 
అన్నం తినేటప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడం మంచిదే. లేకపోతే మనం తీసుకునే అన్నంలో ఘనపదార్థాలు మద్యలో చిక్కుకుపోయి, జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో, కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది. 
 
అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరుతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్టమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసేపని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. 
 
ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం  కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది. భోజనం చివరిన (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శొంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం. 
 
ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి.. ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కంటి రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి