కలబంద గుజ్జు తీసుకుంటే ఏమవుతుంది..?

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (10:35 IST)
శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగించే లక్షణం కలబందలో ఉన్నప్పటికీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు వైద్యులు. డ్రగ్స్ కేసులో సిట్ ముందు హాజరవడానికి ముందు సినీ ప్రముఖులు కలబంద రసాన్ని తీసుకుని కడుపును శుద్ధి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా రక్తంలో కలిసిపోయిన మాదకద్రవ్యాల అవశేషాలను తొలగించే శక్తి కలబందకు ఉందా.. అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలబందలో చాలా వరకు ఉన్నప్పటికీ ఆ రసాన్ని 30-45 రోజుల పాటు తీసుకుంటే గానీ దాని ప్రభావం రక్తం మీద కొంతైనా కనిపించదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
సంవత్సరాల తరబడి డ్రగ్స్ వాడడం వలన రక్తంలో కలిసిపోయే అవశేషాలు నాలుగైదు రోజులపాటు కలబంద గుజ్జు తాగినంత మాత్రాన రక్తపరీక్షల్లో కనిపించకుండా పోవని వారు చెప్తున్నారు. ప్రతి ఇంటి పెరట్లో ఖాళీ ప్రదేశాల్లో విరివిగా లభించేది కలబంద. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఎముకల వైద్యానికి కలబందను ఉపయోగించవచ్చు. శరీరాన్ని కాంతిమంతం చేసేందుకు, చర్మవ్యాధులు నివారించేందుకు కాలిన గాయాలను మాన్పేందుకు కలబంద ఎంతో దోహదపడుతుంది.
 
కలబందకు శరీర మాలిన్యాలను తొలగించే గుణం ఉందని నిర్ధారించారు. రక్తంలో పేరుకుపోయిన అవశేషాలను తొలగించే గుణం ఉన్నట్లు నిర్ధారించలేదు. చర్మకణాలపై చూపిన ప్రభావాన్ని కలబంద రక్తకణాలపైనా చూపిందగలదా లేదా అనేది శాస్త్రీయంగా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు