కరివేపాకును తేలికగా తీసిపారేయకండి..

సోమవారం, 25 మార్చి 2019 (18:05 IST)
కూరల్లో వేసే కరివేపాకును మనం తేలికగా తీసిపారేస్తాం. చాలా మంది దానిలోని పోషక విలువలను గ్రహించక దానిని పారేస్తారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును మన రోజువారీ ఆహారంలో భాగం చేయడానికి గల అంతరార్థం దానిని కూడా మనం తిని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి అని. కరివేపాకులో ఉన్న పోషక విలువల గురించి మరియు దానితో మనం ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. 
 
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జ్వరం, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాలిన గాయాలు, దురదలు, వాపులు, దెబ్బలు తదితర వాటిని నయం చేస్తుంది. కరివేపాకులను మెత్తగా నూరి వాటిపై రాసి కట్టుకట్టాలి. 
 
కరివేపాకులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం వల్ల ఎలాంటి గాయం అయినా, చర్మ సమస్యలు అయినా ఇట్టే తగ్గుతాయి. నిత్యం కరివేపాకును భోజనానికి ముందు నమిలి తింటే, శరీరంలో క్రొవ్వు తగ్గి ఉబకాయం నుండి ఉపశమనం పొందవచ్చు. కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్లోమ గ్రంథిని ఉత్తేజితం చేసి ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. తద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది చాలా మంచిది. 
 
మతిమరుపు ఉన్నవారు నిత్యం కరివేపాకులను తింటుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. కంటిచూపును మెరుగు పరచడంలో, చర్మాన్ని, శిరోజాలను రక్షించడంలో కరివేపాకు పాత్ర గణనీయం. దానిలోని విటమిన్ ఎ కంటి సమస్యలను పోగొడుతుంది. దృష్టి పెరిగేలా చేస్తుంది. కరివేపాకు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. వికారం, వాంతులు వచ్చినట్లు ఉంటే కరివేపాకు తినాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు