కరోనా వైరస్‌కు వాక్సిన్ తయారు చేస్తున్న చైనా

బుధవారం, 29 జనవరి 2020 (14:31 IST)
కరోనా వైరస్‌ కారణంగా చైనా రాజధాని బీజింగ్‌లో ఒక వ్యక్తి చనిపోయారని అధికారులు ధృవీకరించారు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందారు. ఒక్క రోజులోనే ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 4500కు పైనే ఉంది. కొన్ని పట్టణాల్లో రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించారు.

 
ఆయా ప్రాంతాల్లోని ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ భయంకర వైరస్‌కు వాక్సిన్‌ తయారు చేసే పనిలో తలమునకలైంది చైనా ప్రభుత్వం. వుహాన్ నగర ప్రజలంతా విధి లేని పరిస్థితుల్లో తమను తాము ఇళ్లలో బంధీ చేసుకుంటున్నారు. ఒకరికొకరు తోడున్నామంటూ ఇళ్లనుంచి అరుస్తూ ఉత్సాహపరుచుకుంటున్నారు.

 
కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేయడమే చైనా ప్రబుత్వ తక్షణ కర్తవ్యం. చివరికి బీజింగ్ సబ్‌వే ట్రైన్‌లో ప్రయాణించడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. సూట్లు ధరించిన సబ్ వే సిబ్బంది ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరికైనా 37.3 కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లైతే వెంటనే వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.

 
కానీ, వైద్య పరీక్షల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తన తల్లికి వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, కానీ నిర్ధరించేందుకు అవసరమైన కిట్ తమ వద్ద లేదని డాక్టర్లు చెబుతున్నారని ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు. అలాగే టెస్టు కిట్‌లు ఉన్న ఆస్పత్రుల్లో రోగులకు సరిపడ బెడ్స్ లేవని అతను అన్నారు. వైద్యం కోసం నగరమంతా కాళ్లరిగేలా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు.

 
ఉన్నతాధికారులు నిర్ధరించే వరకు వేచిచూడటం వల్లే సరైన సమయానికి ప్రజలకు సమాచారం అందించలేక పోయామని వుహాన్ మేయర్ అధికార మీడియా ద్వారా తెలిపారు. కాగా, వైరస్ తొలి కణాన్ని ఐసోలేట్ చేశామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెబుతోంది. ఇక దానికి వాక్సిన్‌ కనిపెట్టడమే ప్రస్తుతం వారి ముందున్న లక్ష్యం. కానీ వ్యాధి నిర్ధరణ అయిన కేసులు ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. చైనాలోని ఈ అత్యవసర పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు