కరోనావైరస్ దెబ్బకు చైనా కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. కొద్ది రోజులుగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ కార్మికులకు వేతనాలిచ్చేందుకు, ముడి సరుకును సరఫరా చేసేవారికి చెల్లింపులు చేసేందుకు కటకటలాడుతున్నాయి. కరోనావైరస్ దాడి నేపథ్యంలో చైనా అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటోందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం వ్యాఖ్యానించారు.
వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అప్పులు ఇవ్వడంలో మరింత ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులను చైనా సర్కారు విజ్ఞప్తి చేసింది. మరోవైపు దేశ వ్యాప్తంగా లక్షలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయాయి.
అయితే, అదే సమయంలో 60 శాతం కంపెనీలు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయని పారిశ్రామిక వర్గం చెబుతోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా లెక్కల ప్రకారం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు 60 శాతం ఆదాయానికి, 80 శాతం ఉద్యోగాలకు ఈ పరిశ్రమలే కేంద్ర బిందువులు.
రెండో త్రైమాసికానికి చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. అయితే, అంతర్జాతీయంగా కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెంది, దాని ప్రభావం ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని జార్జీవా అన్నారు.