కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వినబడుతున్న మాట లాక్‌డౌన్. చైనాలోని వుహాన్ పట్టణంలో మొదలైన లాక్‌డౌన్ ప్రపంచ దేశాల మీదుగా ఇప్పుడు ఇండియానూ తాకింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వినబడుతోందని సాక్షి దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఇంతకూ లాక్‌డౌన్ అంటే ఏంటి?
లాక్‌డౌన్ అనేది ఓ అత్యవసర నిర్వహణ నియమం (ప్రొటోకాల్). సాధారణ పరిభాషలో దీని అర్థం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం. అధికార యంత్రాంగం మాత్రమే ఈ ప్రొటోకాల్‌ను ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది. తమ పరిధిలోని ప్రజలను రక్షించడానికి పాలకులు ఈ ప్రొటోకాల్‌ను సాధారణంగా ఉపయోగిస్తుంటారు.
బాహ్య ప్రదేశాల నుంచి ఏదైనా ముప్పు ముంచుకువస్తున్నప్పుడు లేదా ఇతర బాహ్య సంఘటన నుంచి రక్షించడానికి లాక్‌డౌన్ ప్రయోగిస్తారు. భవనాలలో లాక్‌డౌన్ అంటే తలుపులకు తాళాలు వేయడం. దీనివల్ల ఏ వ్యక్తి లోపలికి రారు, బయటకు పోరు.
అలాగే, పూర్తిస్థాయి లాక్‌డౌన్ అంటే సాధారణంగా ప్రజలు వారు ఉన్న చోటనే ఉండాలి. చెప్పిన చోటు నుంచి ఎవరూ లోపలికి వెళ్లకూడదు, బయటకు రాకూడదు. లాక్‌డౌన్ రెండు రకాలు. 1) నివారణ లాక్‌డౌన్ (ప్రివెంటివ్ లాక్‌డౌన్). 2) ఎమర్జెన్సీ లాక్‌డౌన్.
ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విధించేది ప్రివెంటివ్ లాక్‌డౌన్. అసాధారణమైన పరిస్థితి లేదా విపత్తును పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య ఇది. నివారణ చర్యల్లో భాగం. ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం.