కరోనావైరస్: లాక్ డౌన్‌లో కొత్త నిబంధనలతో ఎవరికి ప్రయోజనం?

గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:35 IST)
రోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌ను పొడిగించిన తర్వాత వ్యవసాయం, కొన్ని ప్రజా సేవలు, బ్యాంకింగ్ రంగాలకి లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రజా రవాణా సౌకర్యాలు, చాలా రకాల వ్యాపారాలకు లాక్ డౌన్‌ వర్తిస్తుంది.

 
ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల్లో సరఫరా వ్యవస్థకు మినహాయింపు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థకి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చ్ 25న మొదలైన దేశవ్యాప్త లాక్ డౌన్ మే 3 వరకూ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 12వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 382 మంది మరణించారు.

 
తొలి కేసు జనవరి చివరి వారంలోనే నమోదైనా మార్చి నుంచి కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. వీసాల రద్దు, అంతర్జాతీయ విమానాల నిలిపివేత లాంటి చర్యలు అవలంబించి కఠినమైన ప్రయాణ నిషేధ నిబంధనలు అమలు చేసిన దేశాల్లో భారతదేశం ఒకటి. లాక్ డౌన్ మొదలయ్యాక విమాన, రైలు సేవలను కూడా దేశవ్యాప్తంగా నిలిపేసింది.

 
అయితే, పొడిగించిన నిబంధనల్ని అమలు చేయడం ఇప్పుడో పెద్ద సవాలుగా నిలుస్తోంది. లాక్ డౌన్‌ని పొడిగించడంతో ఆగ్రహించిన వేలాది మంది వలస కార్మికులు కొన్ని నగరాల్లో బయటకి వచ్చి, తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 
కొత్త నిబంధనలతో లాక్ డౌన్‌లో వచ్చిన మార్పులు ఏమిటి?
జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు, పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్లు, ఇతర పెద్ద వ్యాపారాలు లాక్ డౌన్‌లోనే ఉంటాయి. నిత్యావసర వస్తువులును అమ్మే కిరాణా దుకాణాలు, మందుల దుకాణాలు మాత్రం తెరుస్తారు.

 
సాంఘిక, మతపరమైన, రాజకీయ సమావేశాలు జరపడానికి ఎటువంటి అనుమతీ లేదు. వ్యవసాయ సంబంధ వ్యాపారాలు తెరవడానికి అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో, పాల ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బర్ తోటలు, వ్యవసాయ ఎరువులు, వ్యవసాయ పరికరాలు అమ్మే దుకాణాలు తెరవడానికి అనుమతి ఉంటుంది.

 
సామాజిక దూరం పాటించాలనే నిబంధనతో రోజు కూలీలకు పని కల్పించే కొన్ని ప్రభుత్వ సేవా రంగాల్లో కూడా పని మొదలుపెడతారు. గత వారాల్లో సరఫరా వ్యవస్థ డెబ్బ తినడంతో చాలా రకాల సేవలు, వస్తువులు రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల సరఫరా కోసం నడిచే విమానాలు, రైళ్లు, ట్రక్కులు నడవడానికి అనుమతి లభించింది. పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను అందించేందుకు బ్యాంకులు కూడా తెరుస్తారు.

 
కొత్త నిబంధనలు ఎవరిపై ప్రభావం చూపిస్తాయి?
కొత్త నిబంధనలతో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల వారిపై ప్రభావం పడుతుంది. భారత్‌లో 50 శాతం పైగా జనాభా వ్యవసాయ రంగంలో ఉన్నారు. పండిన పంటను మార్కెట్లో అమ్ముకోవలసిన సమయం ఇది. గ్రామాల నుంచి నగరాలకు పండిన పంటల ఉత్పత్తులను రవాణా చేయవలసిన అవసరం ఉంది.

 
ఏప్రిల్ 20 నుంచి కొరియర్ సేవలు కూడా పునరుద్ధరించనుండడంతో ఈ-కామర్స్ రంగం కూడా లాభపడుతుంది. వస్తువుల రవాణా మీద పెట్టిన ఆంక్షలు సడలించగానే మార్కెట్లో ఏర్పడ్డ కొన్ని వస్తువుల కొరత తీరుతుంది. ఇది ఆన్‌లైన్ ఆధారిత ఆహార పదార్థాలను అమ్మే రిటైల్ వ్యాపారస్తులకు కాస్త ఊరట నిస్తుంది.

 
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు కూడా పనుల్లోకి వెళ్ళవచ్చు. ఇది ఇంటి నుంచే పని చేస్తున్న వాళ్లకి ఆనందాన్నిచ్చే విషయం. హైవేల మీద తినుబండారాలు అమ్మే షాపులు, బళ్ళు కూడా తెరవవచ్చు. అయితే సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి. దీంతో, సరకుల రవాణా చేసే లారీ డ్రైవర్లకు హైవే మీద ఆహారం లభిస్తుంది.

 
ఈ నిబంధనలేవీ ఇప్పటికే నిర్బంధం విధించిన 'కంటైన్మెంట్ జోన్స్' ఉన్న ప్రాంతాలకి వర్తించవు. వైరస్ హాట్‌స్పాట్‌లని గుర్తించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకుని ఆ ప్రాంతాలని పూర్తిగా సీల్ చేస్తారు. ఆ ప్రాంతాలకి అంబులెన్సు, పోలీస్ సేవలని మాత్రమే అనుమతిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు