కరోనావైరస్ వ్యాక్సీన్: అమెరికాలో తొలి విడత వ్యాక్సీన్ పంపిణీకి ఏర్పాట్లు

సోమవారం, 23 నవంబరు 2020 (18:19 IST)
అమెరికాలో డిసెంబర్ 11 నాటికే మొదటి విడత వ్యాక్సీన్లు ప్రజలకు అందే అవకాశం ఉందని యూఎస్ కరోనావైరస్ వ్యాక్సీన్ ప్రోగ్రాం అధ్యక్షులు తెలిపారు.
 
"వ్యాక్సీన్ ఆమోదం పొందిన 24 గంటలలోపే అవసరమైనవారికి అందించే ఏర్పాట్లు చేస్తున్నామని" డా. మాన్సెఫ్ స్లవు సీఎన్ఎన్‌తో అన్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో ఒక కోటి 20 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రెండు లక్షల 55 వేల మరణాలు సంభవించాయి.
 
అమెరికా ఔషధ సంస్థలు ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా తయారుచేసిన వ్యాక్సీన్‌ను అత్యవసరంగా విడుదల చేసేందుకు ఆమోదం కోసం శుక్రవారం నాడు దరఖాస్తు పెట్టుకున్నాయి.
 
రెండు డోసుల్లో తీసుకోవలసిన ఈ కోవిడ్ వ్యాక్సీన్ 95% ప్రభావం చూపిస్తోందని పరీక్షల్లో తేలింది. ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల వ్యాక్సీన్ డోసులను ఉత్పత్తి చేసేందుకు ఫైజర్ ప్రణాళిక సిద్ధం చేసింది.
 
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వ్యాక్సీన్ అడ్వైజరీ కమిటీ డిసెంబర్ 10 న జరగనున్న మీటింగ్‌లో..ఈ వ్యాక్సీన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు ఆమోదం ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తుంది.
 
ఫైజర్ అమెరికాలో తన వ్యాక్సీన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసింది
 
"ఆమోదముద్ర లభించిన రెండు రోజుల తరువాత వ్యాక్సీన్ పంపిణీ జరుగుతుంద"ని డా. స్లావు సీఎన్ఎన్‌కు తెలిపారు.
 
“అమెరికాలోని ప్రతీ రాష్ట్రంలో ఉన్న జనాభాకు అనుగుణంగా వ్యాక్సీన్ పంపిణీ జరుగుతుంది. ఎవరికి ముందు వ్యాక్సీన్ అందిస్తారనే విషయం రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. అయితే, హెల్త్‌కేర్ వర్కర్లకు, వృద్ధులకు మొదట అందించాలని సిఫారసు చేస్తామని” డా. స్లావూ తెలిపారు.
 
మరో ఔషధ సంస్థ మోడెర్నా కూడా తాము తయారుచేస్తున్న వ్యాక్సీన్ 95% ప్రభావం చూపిస్తోందని ప్రకటించింది. రాబోయే వారాల్లో ఈ వ్యాక్సీన్ కూడా ఆమోదముద్ర పొందేందుకు ప్రయత్నం చేస్తోంది.
 
ఈ వ్యాక్సీన్లు మార్కెట్లోకి విడుదల అయితే వచ్చే ఏడాది మే నాటికల్లా 70% జనాభాకు వ్యాక్సీన్లు అంది, యూఎస్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని డా. స్లావు అభిప్రాయపడ్డారు.
 
"అయితే, ప్రస్తుతం ప్రజల్లో వ్యాక్సీన్ పట్ల కొంత ప్రతికూల దృక్పథం ఉంది. అది మారి, అందరూ సానుకూలంగా స్పందించి వ్యాక్సీన్‌ను తీసుకుంటారని ఆశిస్తున్నాను. కరోనా వైరస్‌ను కట్టడి చెయ్యడానికి ఇది చాలా ముఖ్యం. సాధారణ జీవితం ప్రారంభమవ్వలంటే అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సీన్ వేయించుకోవాలని" డా. స్లావూ తెలిపారు.
 
"అందరూ వ్యాక్సీన్లు తీసుకుంటే యూఎస్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ చాలా త్వరగా, వచ్చే ఏడాదికల్లా వచ్చేస్తుందని" యూఎస్‌లోని ప్రముఖ అంటువ్యాధి నిపుణులు డా. ఆంటొనీ ఫౌచి బీబీసీ భాగస్వమి సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు.
 
ఈ వ్యాక్సీన్ కంపెనీలు ఇంకా పూర్తి ట్రయల్స్ డాటా పబ్లిష్ చెయ్యాల్సి ఉంది. కానీ ట్రయల్స్‌లో తీవ్రమైన సమస్యలేవి ఎదురవ్వలేదని ఆ కంపెనీలు చెబుతున్నాయి.
 
కాలిఫోర్నియా వాసులు రాత్రి 10 గంటల తరువాత ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు
 
అయితే, ఈ వ్యాక్సీన్లు వైరస్‌నుంచీ ఎంతకాలం కాపాడుతాయి. వీటి ప్రభవం తగ్గిపోతే మళ్లీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందా అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.
 
అమెరికాలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ది యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది.
 
ఈ నేపథ్యంలో యూఎస్‌లోని వివిధ రాష్ట్రాలు వివిధ రకాల పరిమితులను అమలు చేస్తున్నాయి. యూఎస్ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కాబోయే అధ్యక్షుడు జో బిడెన్ కూడా జాతీయ స్థాయి లాక్‌డౌన్ విధించేందుకు వ్యతిరేకమని ప్రకటించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రాలే తమ సొంత విధానాలను అవలంబించాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు