కోవిడ్: 'పీఎం కేర్స్ ఫండ్'తో ఎన్ని వెంటిలేటర్లు కొన్నారు? ఏపీ మెడ్‌టెక్ జోన్ ఒక్కటి కూడా ఎందుకు సరఫరా చేయలేకపోయింది?
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (18:41 IST)
దిల్లీలోని సాకేత్‌లో ఉండే ఆలోక్ గుప్తా తన 66 ఏళ్ల తల్లికి వెంటిలేటర్ ఉన్న ఒక బెడ్ కోసం వెతుకుతున్నారు. దిల్లీ, ఫరీదాబాద్, గుర్‌గ్రామ్, నోయిడాలోని ఎన్నో ఆసుపత్రులకు వెళ్లినా ఆయనకు బెడ్ దొరకలేదు. ఆయన తల్లి ఆక్సిజన్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. "ఆక్సిజన్ లెవల్ 90 కంటే దిగువకు వచ్చినప్పటి నుంచి ఆస్పత్రుల్లో వెంటిలేటర్ బెడ్ కోసం వెతుకుతున్నా కానీ ఇప్పటివరకు దొరకలేదు. మా అమ్మకు ఐసీయూ బెడ్ చాలా అవసరం" అని అలోక్ చెప్పారు.
రెండు రోజుల కిందట ఐసీయూలో బెడ్ దొరక్క యూపీలోని అలీగఢ్‌కి చెందిన 18 ఏళ్ల నదీమ్ చనిపోయారు. అలహాబాద్‌లోని స్వరూప్ రాణి ఆస్పత్రిలో 50 ఏళ్లు పనిచేసిన 80 ఏళ్ల వైద్యుడికి ఆ ఆస్పత్రిలోనే వెంటిలేటర్ బెడ్ దొరకలేదు. దీంతో ఆయన వైద్యం అందకుండానే చనిపోయారు. ఆయన భార్య కూడా ఆ నగరంలో ప్రముఖ డాక్టర్. కానీ, భర్తను కాపాడుకోలేకపోయారు. దిల్లీ సహా దేశంలోని చాలా నగరాల్లోని ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితి భయానకంగా ఉంది. శ్వాస అందక ఎంతోమంది గిలగిలలాడుతూ ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రతి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి,
ఇదంతా మొదటే తెలుసు
గత ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉందనే విషయం స్పష్టమైంది. కరోనా పాజిటివ్ రోగుల ఊపిరితిత్తులు బలహీనంగా మారినపుడు వారికి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. అయితే 2020లో దేశంలో వెంటిలేటర్ల సంఖ్య గురించి ప్రభుత్వ గణాంకాలేవీ అందుబాటులో లేవు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం ఐసీయూ పడకల లెక్క ప్రకారం దేశంలో 18 నుంచి 20 వేల వెంటిలేటర్లు ఉండొచ్చని అంచనా.
భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో రెండు లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయి. 2020 మార్చి 27న ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్ ప్రకటన వచ్చింది. ఈ ఫండ్‌ను కోవిడ్-19 సమస్యలను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేశారు. నిజానికి పీఎం రిలీఫ్ ఫండ్ అంతకుముందు నుంచే ఉంది. కానీ, పీఎం కేర్స్ ఫండ్‌తో ఏర్పాటు చేసిన ఈ నిధికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ప్రధాని స్వయంగా కోరారు. ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పీఎం కేర్స్ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇచ్చారు. దీనికి నిధులు ఇచ్చిన వారికి 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ'(సీఎస్ఆర్) కింద పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు.
చాలా మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ సంస్థల సిబ్బంది తమ జీతాల నుంచి పీఎం కేర్స్ కోసం డొనేట్ చేశారు. అయితే ఈ ఫండ్ ద్వారా మొత్తం ఎన్ని నిధులు సేకరించారు, ఆ డబ్బు ఏం చేస్తున్నారు అనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు. ఎందుకంటే, ఈ ఫండ్‌పై ఎన్నో విమర్శలు వస్తున్నా కేంద్రం దీనిని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేలేదు. 2020 మే 18న ప్రధానమంత్రి సలహాదారు కుల్బే ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాశారు. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా 2 వేల కోట్ల రూపాయల వ్యయంతో 50 వేల 'మేడ్ ఇన్ ఇండియా' వెంటిలేటర్ల తయారీకి ఆర్డర్ ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున మార్చి చివర్లో వెంటిలేటర్లు కొనుగోలు ప్రక్రియ మొదలైంది. 2020 మార్చి 5న ఆ శాఖకు సంబంధించిన హెచ్ఎల్ఎల్.. వెంటిలేటర్ల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానించింది. వెంటిలేటర్లకు ఉండాల్సిన టెక్నికల్ ఫీచర్స్ కూడా హెచ్ఎల్ఎల్ నిర్దేశించింది. తర్వాత ఆ జాబితాలో తరచూ మార్పులుచేర్పులు చేశారు. మొత్తం 9 సార్లు దానిని సవరించారు.
చివరగా 2020 ఏప్రిల్ 18న తొమ్మిదోసారి కొన్ని కొత్త ఫీచర్లు జోడించారు. అంటే కంపెనీలకు ఇచ్చిన ఫీచర్లలో మార్పులు జరుగుతూ వెళ్లాయి. అలా వివిధ రాష్ట్రాల్లోని ఐదు కంపెనీలకు వెంటిలేటర్ల ఆర్డర్ ఇచ్చారు. ఏయే కంపెనీలకు, ఎన్ని వెంటిలేటర్ల ఆర్డర్ ఇచ్చారో సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ ఆర్టీఐ దరఖాస్తుతో వివరాలు సంపాదించారు.
* భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)కు ఈ కాంట్రాక్ట్ లభించింది. అది మైసూర్ కంపెనీ స్కాన్‌రే సాయం తీసుకుంది.
* నోయిడాలోని ఎగ్వా హెల్త్ కేర్‌కు 10 వేల వెంటిలేటర్ల ఆర్డర్ వచ్చింది. అయితే, ఆ సంస్థకు అంతకుముందు వెంటిలేటర్ల తయారీలో అనుభవం లేదు.
* ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌టెక్ జోన్ అంటే ఏఎంటీజడ్‌కు 13,500 వెంటిలేటర్ల ఆర్డర్ వచ్చింది.
* గుజరాత్ రాజ్‌కోట్‌లోని జ్యోతి సీఎన్‌సీ కంపెనీకి 5 వేల వెంటిలేటర్ల కాంట్రాక్ట్ ఇచ్చారు.
* గురుగ్రామ్ అలాయిడ్ మెడికల్ కంపెనీకి 350 మెషిన్స్ ఆర్డర్ ఇచ్చారు.
పీఎం కేర్స్ కింద ఇప్పటివరకూ ఎన్ని వెంటిలేటర్లు తయారయ్యాయో తెసులకునేందుకు ఆర్టీఐ దరఖాస్తులు చేయడంతో పాటు తయారీ సంస్థలతోనూ మాట్లాడింది బీబీసీ. బీఈఎల్ 24,332, ఎగ్వా 5 వేలు, అలాయిడ్ మెడికల్ 350, బీపీఎల్ 13 వెంటిలేటర్లు సరఫరా చేశాయని ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా 2020 సెప్టెంబర్ 7న హెచ్ఎల్ఎల్ చెప్పింది. ఆ తర్వాత వెంటిలేటర్ల సరఫరా ఆగిపోయింది. మొత్తం లక్షన్నర వెంటిలేటర్లు అవసరమైతే, ఏడాది తర్వాత దాదాపు 30 వేల వెంటిలేటర్లే వచ్చాయి.
ఎగ్వా నుంచి ఆఖరి విడత వెంటిలేటర్లు 2020 జులైలో వచ్చాయి. ఈ మొత్తం వెంటిలేటర్లకు గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 41,59,40,000 చెల్లింపులు చేశారు. అలాయిడ్ మెడికల్‌కు 350 వెంటిలేటర్ల కోసం 27 కోట్ల 16 లక్షలు చెల్లించారు. బీఈఎల్‌కు ఒక కోటీ 71 లక్షలు చెల్లించారు. ఆర్టీఐ ద్వారా అందిన సమాచారంతో ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ టెండర్లలో స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉన్నా వెంటిలేటర్ల ధరల్లో మాత్రం భారీ తేడాలు కనిపించాయి.
సాధారణంగా ఒక వెంటిలేటర్ ధర రూ.8.62 లక్షలు కాగా... ఎగ్వా తయారు చేసిన ఒక వెంటిలేటర్ ధర 1.66 లక్షలే. అంటే ధరలో ఏడెమినిది రెట్ల వ్యత్యాసం ఉంది. ఈ అంశానికి సంబంధించి బీబీసీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్‌కు కొన్ని ప్రశ్నలు పంపింది. సమాధానం రాగానే ఈ కథనాన్ని అప్ డేట్ చేస్తాం. వెంటిలేటర్ల తయారీలో ఎలాంటి అనుభవం లేని నోయిడాలోని ఎగ్వా కంపెనీ తనకు వచ్చిన 10 వేల ఆర్డర్లకు గాను 5 వేల వెంటిలేటర్లు మాత్రమే డెలివరీ చేసింది. ఆ విషయం కంపెనీయే స్వయంగా చెప్పింది.
"ఆ తర్వాత తమ నుంచి వెంటిలేటర్లు తీసుకోలేదని, కానీ, ఇప్పుడు కొన్ని వారాల కిందట మిగతా ఐదు వేల వెంటిలేటర్లు కావాలన్నారు" అని ఎగ్వా కో ఫౌండర్ దివాకర్ బీబీసీతో చెప్పారు. అయితే ఆయన దానికి సంబంధించి ఎలాంటి పత్రాలూ చూపించలేదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే ఏపీ మెడ్‌టెక్ జోన్(ఏఎంటీజడ్) తన 13,500 వెంటిలేటర్ల ఆర్డర్‌లో ఇప్పటివరకూ ఒక్క వెంటిలేటర్ కూడా కేంద్రానికి ఇవ్వలేదు. ఈ సంస్థకు 9,500 బేసిక్ వెంటిలేటర్లు, 4 వేల హై-ఎండ్ వెంటిలేటర్లు తయారీకి కాంట్రాక్ట్ ఇచ్చారు.
ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారం ప్రకారం వెంటిలేటర్ బేసిక్ మాడల్ ధర లక్షా 66 వేలు, హై-ఎండ్ మోడల్ ధర 8.56 లక్షలు ఉందని వెంకటేష్ నాయక్ బీబీసీకి చెప్పారు. ఏఎంటీజడ్ ఏప్రిల్‌లో చెన్నైలోని ట్రివిట్రాన్ హెల్త్ కేర్ అనే ఒక మెడికల్ టెక్నాలజీ కంపెనీ 6 వేల వెంటిలేటర్ల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. తమ కంపెనీకి 4 వేల బేసిక్, 2 వేల హై-ఎండ్ మోడల్స్ ఆర్డర్ వచ్చిందని, వాటిని తయారు చేశాక ఎన్నోసార్లు ట్రయల్స్ ఇచ్చామని, అవి పూర్తయ్యేసరికి కరోనా ఫస్ట్ వేవ్ తగ్గడంతో ఇక వెంటిలేటర్లు అవసరం లేదని చెప్పారని ట్రవిట్రాన్ హెల్తకేర్ కంపెనీ ఎండీ డాక్టర్ జీఎస్‌కే వేలు బీబీసీకి చెప్పారు.
"మా దగ్గర చాలా స్టాక్ పడి ఉంది. కానీ హెచ్ఎల్ఎల్ నుంచి ఒక్క పర్చేజ్ ఆర్డర్ కూడా రాలేదు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టిందని, ఇక అన్ని వెంటిలేటర్ల అవసరం లేదని హెచ్ఎల్ఎల్ నుంచి చెప్పారు. కానీ, సెకండ్ వేవ్ తర్వాత మాకు రెండు వారాల ముందే మాకు ఒక ఆర్డర్ వచ్చింది. గుజరాత్ సహా మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మేం వెయ్యి వెంటిలేటర్లు పంపించాం" అని ఆయన తెలిపారు.
కానీ, మంత్రిత్వ శాఖ తరఫున హెచ్ఎల్ఎల్ నేరుగా ట్రివిట్రాన్‌కు ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. దానికి ఏఎంటీజడ్ ద్వారా ఆ ఆర్డర్ వచ్చింది. ట్రివిట్రాన్ బేసిక్ వెంటిలేటర్ మోడల్ ధర లక్షన్నర కాగా, హై-ఎండ్ మోడల్ ధర 7 లక్షలు. అయితే ప్రభుత్వానికి హై-ఎండ్ మోడల్ కొనుగోలు చేసే ఉద్దేశం ఉన్నట్టు తమకు అనిపించడం లేదని వేలు చెప్పారు. వెంటిలేటర్ల కోసం ఈ కంపెనీకి చెల్లింపులు కూడా జరగలేదు. సెప్టెంబర్‌లో హఫ్‌పోస్ట్‌లో ప్రచురించిన ఒక రిపోర్ట్‌లో ఏఎంటీజడ్ నుంచి ట్రివిట్రాన్‌కు 10 వేల వెంటిలేటర్ల ఆర్డర్ వచ్చిందని చెప్పారు. అయితే ట్రివిట్రాన్ ఎండీ ఆ వార్తలు తోసిపుచ్చారు. బీబీసీ ఏఎంటీజడ్‌కు కూడా ఈమెయిల్ ద్వారా కొన్ని ప్రశ్నలు పంపింది. వాటికి ఇంకా సమాధానం రాలేదు.
ఏఎంటీజడ్ వెంటిలేటర్లు విఫలం
పీఎం కేర్స్ ఫండ్ ద్వారా అందిన 2 వేల కోట్ల రూపాయలకు 58,850 వెంటిలేటర్లు ఆర్డర్ చేశామని.. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్(డీజీహెచ్ఎస్) టెక్నికల్ కమిటీ క్లినికల్ ట్రయల్స్‌లో ఏఎంటీజడ్, గుజరాత్ జ్యోతి సీఎన్సీ తయారు చేసిన వెంటిలేటర్లు ఫెయిల్ అయ్యాయని, దాంతో ఆ రెండింటినీ తమ జాబితా నుంచి తొలగించామని 2020 జులై 20న ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాధానంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఆ సమాధానంలో 17 వేల వెంటిలేటర్లు ఇప్పటికే డిస్పాచ్ చేశామని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. కానీ, 2020 సెప్టెంబర్ 7న ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం ప్రకారం 13,500 వెంటిలేటర్ల పర్చేజ్ లిస్ట్‌తో ఏఎంటీజడ్ పేరును ఆరోగ్య మంత్రిత్వ శాఖ మళ్లీ వెంటిలేటర్ల తయారీదారుల జాబితాలో చేర్చిందని ఆర్టీఐ దరఖాస్తుదారు వెంకటేష్ నాయక్ చెప్పారు.
ఎగ్వా వెంటిలేటర్లపై ప్రశ్నలు
నీతీ ఆయోగ్ గొప్పగా ప్రచారం చేసిన ఎగ్వా హెల్త్ కేర్ కంపెనీకి, తయారీలో ఎలాంటి అనుభవం లేకపోయినా 10 వేల వెంటిలేటర్ల ఆర్డర్ ఇచ్చారు. దాంతో అది కార్ల తయారీ కంపెనీ మారుతీ సాయంతో వెంటిలేటర్లు తయారుచేసింది. హఫ్‌పోస్ట్ ఒక రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం కోసం ఎగ్వా తయారుచేసిన వెంటిలేటర్లను ఒక టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ 2020 మే 16న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షించింది. అవి రెస్పిరేటరీ ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయని చెప్పింది.
ఆ రిపోర్ట్ వచ్చిన 11 రోజుల తర్వాత మే 27న ఎగ్వా వెంటిలేటర్స్ పరీక్షించడానికి మరో కొత్త బృందాన్ని నియమించారు. వాటిని మళ్లీ టెస్ట్ చేశారు. మొదటి టీమ్ ఇచ్చిన సలహాలతో కంపెనీ వెంటిలేటర్స్‌ను మెరుగుపరిచిందని కొత్త టీమ్ చెప్పింది. దాని పీఈఈపీ సరిగా పనిచేస్తోందని తెలిపింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండడంతో ఆ వెంటిలేటర్లను తాము పాస్ చేస్తున్నట్లు 2020 జూన్‌లో ఇచ్చిన రిపోర్టులో ఈ కమిటీ చెప్పింది.
దుమ్ముకొట్టుకుపోతున్న వెంటిలేటర్లు
పీఎం కేర్స్ ఫండ్ కింద లభించిన వెంటిలేటర్స్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోడానికి బీబీసీ బిహర్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రులను సందర్శించింది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు ఇంకా ఇన్‌స్టాల్ కూడా చేయలేదని, కొన్ని ఆస్పత్రుల్లో వాటిని ఉపయోగించడానికి సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇవ్వలేదని మా పరిశీలనలో తెలిసింది.
వెంటిలేటర్లు ఇన్‌స్టాల్ చేసి, తగినంత స్టాఫ్ కూడా ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో.. డాక్టర్లకు ఆక్సిజన్‌కు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో, దాదాపు చాలా ఆస్పత్రుల్లో ఉన్న వెంటిలేటర్లు వినియోగం లేకుండా దుమ్ముపట్టిపోతున్నాయి. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా కోట్లు ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేయించిన ఈ విలువైన పరికరాలు వృధాగా పడి ఉన్నాయి.