పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (17:43 IST)
కొన్ని యుగాల నుంచి రకరకాల మసాలా దినుసులు ఆహారంలో భాగంగా తినడం అలవాటుగా ఉంది. ముఖ్యంగా, పసుపు, కారం లాంటి దినుసులపై ఇటీవల కాలంలో అనేక పరిశోధనలు జరిగాయి. వీటిని ఆహారంతో పాటు తీసుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. అయితే ఆ లాభాలు మీరు అనుకునేవి కాకపోవచ్చు.
కొన్ని యుగాల నుంచి మన ఆహారంలో కొన్ని రకాల మసాలా దినుసులు కలిపి తినడం అలవాటుగా ఉంది. బంగాళాదుంపల చిప్స్ మీద కారం కానీ, మిరియాల పొడి కానీ చల్లుకుని తినడం, టీలో అల్లం కలుపుకుని తాగడం, భోజనంలో మిరపకాయలు తినడం సహజంగా చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే, ఇటీవల కాలంలో కొన్ని మసాలా దినుసుల వాడకం వలన లాభాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.
హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అనారోగ్యం బారిన పడకుండా ప్రతి రోజు ఒక మిరపకాయ ఆహారంలో భాగంగా తీసుకునేవారు. ఆసియా దేశాలలో విరివిగా వాడే పసుపు ఇప్పుడు అనేక దేశాల కాఫీ షాప్లలోకి కొత్త రూపాన్ని సంతరించుకుని గోల్డెన్ లాటె అనే పేరుతో అమ్ముడవుతోంది.
పసుపు రోగ నిరోధక శక్తిని పెంచి, అనారోగ్యం బారిన పడకుండా చేస్తుందనే ప్రచారం కూడా ఇటీవల కాలంలో బాగా వైరల్ అయింది. సేయిన్ మిరియాలు, నిమ్మకాయ, మాపెల్ సిరప్, నీరు కలిపి తాగితే బరువు తగ్గుతారని 2013 లో బియోన్స్ డైట్ పేరుతో ప్రచారం పొందిన తర్వాత సేయన్ మిరియాలు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు ఎవరికి దొరకలేదు. నిజంగానే ఈ మసాలా దినుసులు ఆహారాన్ని ఆరోగ్యవంతంగా మార్చేస్తాయా? లేదా వాటి వలన ఏమైనా హాని ఉంటుందా?
ప్రాచుర్యంలో ఉన్న విధానం
వాడుకలో విరివిగా ఉన్నవి మిరపకాయలు. చాలా మంది వీటి వలన ఆరోగ్యానికి ఉండే లాభాల గురించి పరిశీలించి మంచి, చెడు కూడా ఉన్నాయని తేల్చారు. మిరపకాయలలో క్యాప్సిసిన్ అనే పదార్ధం ఉంటుంది. మిరపకాయలు తిన్నప్పుడు ఈ కాప్సిసిన్ శరీరంలో ఉండే ఉష్ణ గ్రాహకాలతో కలిసి , మెదడుకి శరీరానికి ఉష్ణం కలిగించే భావాన్ని సందేశంలా పంపిస్తాయి.
క్యాప్సిసిన్ ఆయుః ప్రమాణాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆహారంలో అస్సలు కారం తినని వారితో పోల్చి చూస్తే, మిరపకాయలతో కూడిన ఆహారాన్ని కనీసం వారానికి నాల్గు సార్లు తిన్న వారిలో మరణాల రేటు తక్కువగా ఉందని ఇటలీలో 2019 లో జరిపిన ఒక అధ్యయనం పేర్కొంది. పొగ తాగడం, మద్యం సేవించడం, ఆహారపు అలవాట్లు లాంటి అంశాలను అధ్యయనకారులు పరిశీలనలోకి తీసుకున్నారు.
అలాగే చైనాలో 5 లక్షల మంది పై జరిపిన పరిశోధనలో మిరపకాయలు తినే వారిలో మరణం ముప్పు తక్కువ అని తేలింది. వారంలో ఒక్క సారి మిరపకాయలు ఆహారం తీసుకునేవారితో పోల్చి చూస్తే, ప్రతిరోజు కారంతో కూడిన ఆహారం తీసుకునే వారిలో మరణం ముప్పు 14 శాతం తక్కువగా ఉంది. ఈ అధ్యయనం ఎక్కువ కారంతో కూడిన ఆహారం తినేవారిలో మరణాల శాతం తక్కువ ఉందని చెప్పింది.
ముఖ్యంగా, కాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులతో సంభవించే మరణాలు తక్కువని హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్లో న్యూట్రిషన్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న లూ కీ అన్నారు. అలా అని రోజూ ఎక్కువగా మిరపకాయలు తినేస్తే ఆరోగ్యాన్ని కాపాడుతుందని, శ్వాసకోశ సమస్యలని తగ్గిస్తుందని చెప్పడానికి లేదు.
చైనాలో జరిపిన అధ్యయనం ప్రతి వ్యక్తిని ఏడేళ్ల పాటు గమనించింది. ఆరోగ్యం మెరుగుపడాలని మిరపకాయలు తినేవారిలో కంటే ఆహారంలో భాగంగా ఎప్పటినుంచో తింటున్నవారిలో ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి తప్ప, ఏదో కొన్ని రోజుల్లోనో, వారాల్లోనో, నెలల్లోనో అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులేమీ తలెత్తవు.
అనారోగ్యం పాలవకుండా క్యాప్సిసిన్ పాక్షికంగా పని చేస్తూ ఉండవచ్చని లీ కీ చెప్పారు. క్యాప్సిసిన్ వలన శరీరంలో జరిగే జీవ రసాయనక్రియను, రక్తంలో కొలెస్టరాల్ స్థాయిని మెరుగుపర్చడానికి సహకరిస్తుందని చెప్పారు. శరీరం వినియోగించే శక్తిని పెంచడానికి, ఆకలి తగ్గించడానికి కూడా క్యాప్సిసిన్ పని చేస్తుందని మరి కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఊబకాయం రాకుండా ఉండటానికి , అధిక రక్త పోటు ఉన్నవారికి మిరపకాయలు తీసుకోవడం వలన లాభం ఉంటుందని ఖతార్ యూనివర్సిటీ న్యూట్రిషన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న జుమీన్ షి అన్నారు. అయితే, మిరపకాయలు తినేవారి గ్రాహక శక్తి తక్కువగా ఉన్నట్లు ఆమె పరిశోధనలో తేలింది.
దీని ప్రభావం జ్ఞాపక శక్తి మీద చూపిస్తుంది. రోజుకి 50 గ్రాముల కన్నా ఎక్కువ మిర్చి తీసుకునేవారిలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నట్లు కొంత మంది తెలిపారని ఆమె చెప్పారు. అయితే, ఇది ఎంత వరకు ఖచ్చితమో చెప్పలేమని అన్నారు.
మిరపకాయలు తినడం వలన కలిగే మంట గురించి చాలా మంది శాస్త్రవేత్తలకు ఆసక్తి ఉంది. ఈ మంట వలనే గ్రాహక శక్తి తక్కువవుతుందేమో అనే అనుమానం కూడా ఉంది. మిరపలో ఉండే ఈ లక్షణం వలన మొక్కలు తమని తాము చీడల నుంచి పురుగుల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది.
కానీ ఈ లక్షణాలు మనుషుల పై పెద్దగా ప్రభావం చూపవు. ఒక మోతాదులో ఏదైనా శరీరానికి మంచిదే, కాఫీ లో ఉండే కెఫీన్ శరీరాన్ని ఉత్తేజితం చేయడానికి తీసుకుంటే పర్వాలేదు. అదే మోతాదుకు మించి తీసుకుంటే నష్టాలు ఉంటాయని, న్యూ కాసిల్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ ప్రొఫెసర్ కిర్స్టన్ బ్రాండ్ అన్నారు. అలాగే సహజంగా మసాలా దినుసులు కలిగి ఉండే పదార్ధాలను తీసుకున్నప్పుడు కూడా కొన్ని లాభాలు ఉంటాయి. అయితే, అవి మనం తగినంత తినం.
ఉదాహరణకి చాలా మొక్కల్లో లభించే పోలీఫెనోల్స్ అనే పదార్ధం శరీరంలో నీరు చేరకుండా రక్షిస్తుంది. చాలా మసాలా దినుసుల్లో ఈ పోలీఫెనోల్స్ ఉంటాయి. అయితే, మనం ఆహారంలో అతి కొద్ది మొత్తంలో తీసుకునే వీటి వలన ఎంత ఆరోగ్యం చేకూరుతుందో చెప్పలేమని 2014 లో జరిపిన ఒక పరిశోధన పేర్కొంది.
పసుపుతో చికిత్స
మనుషుల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని చెప్పే మరో మసాలా దినుసు పసుపు. పసుపులో లభించే ఒక పదార్ధాన్ని శరీరంలో మంటని, ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని రకాల వైద్యాలలో వాడతారు. అయితే, పసుపు వలన ఉండే లాభాలను ఆధారాలతో చూపే పరిశోధనలు లేవు.
పసుపులో కాన్సర్ రాకుండా చూసే లక్షణాలు ఉన్నాయని కొన్ని పరిశోధన శాలల్లో జరిపిన పరిశోధనలు తెలిపాయి. కానీ, మానవ శరీరానికి, పరిశోధన శాలల్లో ఉండే పరిస్థితులకి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. పసుపు కొమ్ము నీటిలో కరిగే లక్షణం కలిగి ఉండదు. దీంతో పసుపులో ఉండే లాభాలను శరీరం గ్రహించకపోవచ్చు.
పాశ్చాత్య దేశాలలో పసుపుని కొన్ని రకాల వైద్యాలలో వాడటం పట్ల ఆసక్తి మధ్య యుగంలో కలిగిందని, యేల్ యూనివర్సిటీ లో హిస్టరీ ప్రొఫెసర్ పాల్ ఫ్రీడ్మాన్ చెప్పారు. ఆహారంలో సహజంగా ఉండే కొన్ని లక్షణాలను తటస్థం చేయడానికి మసాలా దినుసులు వాడతారు. కొన్ని ఆహారాలకి ఉండే సహజ లక్షణాలైన వేడి, చల్లదనం, తేమ లాంటి వాటిని తటస్థం చేయడానికి ఈ మసాలా దినుసులు అవసరం అవుతాయని ఫ్రీడ్మాన్ అన్నారు.
ఉదాహరణకి, చేపలు చల్లగా, తేమతో కూడి ఉంటాయి. మసాలా దినుసులు, పొడిగా, ఘాటుగా ఉంటాయి. ఆహారాన్ని తటస్థం చేస్తూ ఔషధంలా వాడే పద్దతి ఆయుర్వేదంలో ఉంది. ఈ విధానాన్ని భారతదేశంలో కొన్ని యుగాలుగా అవలంబిస్తున్నారు. ఇలాంటి పద్దతుల పట్ల అవగాహన లేని పాశ్చాత్య దేశాలలో ఈ పద్దతిని ఇటీవలే కొత్త తరం వైద్యంతో కలిపి వాడవచ్చనే సమాచారాన్ని పంచుకుంటున్నారని ఫ్రీడ్మాన్ చెప్పారు.
"ఆధునిక కాలంలో మసాలా దినుసుల పట్ల కొత్తగా పెంచుకున్న ఆసక్తి చూస్తుంటే మధ్య యుగంలో విధానాలకు దగ్గరగా ఉన్నట్లు అన్పిస్తుంది. 50 సంవత్సరాల క్రితం వరకు ఇలాంటి పద్ధతులన్నీ మూఢ నమ్మకాలని ఆధునిక వైద్యం కొట్టి పడేసేది". మిన్నెసోటా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న క్యాథరీన్ నెల్సన్ పసుపు లో ఉండే లక్షణాలు పట్ల ఆకర్షితురాలై వీటి మీద పరిశోధన చేయడం మొదలు పెట్టారు.
కాకపొతే, పసుపుతో ఉండే లాభాలను, ఒక సారి జీర్ణం అయిన తర్వాత శరీరం గ్రహించలేదని ఆమె అన్నారు. శరీరంలో ఉండే చిన్న ప్రేగు దీనిని గ్రహించలేదని తెలిపారు. అందువలన ఇది పెద్దగా ఉపయోగపడదని అన్నారు. పసుపులో లాభాలు ఉండకపోవచ్చు గాని, పసుపు కొమ్ములో ఉండవచ్చని చెప్పారు. అలాగే పసుపుని ఆహారంలో కలిపి వండటం వలన అందులో ఉండే సహజ లక్షణాలు నశించే గుణం ఉందని చెప్పారు.
పసుపులో లాభాలను గ్రహించడానికి దానిని ఏదైనా రసాయనాలతో కలిపి చూడాలని అన్నారు. పసుపు తినడం వలన నష్టాలు ఏమి ఉండవు కానీ దానిని మందులా తీసుకోకూడదని సలహా ఇచ్చారు. పసుపు, మిర్చి మీద జరిపిన పరిశోధనలు కేవలం వాటి వాడకం వాటి వలన కలిగే ఆరోగ్యానికి కలిగే మేలుని మాత్రమే పరిశీలించాయి. అలాగే, పరిశోధన శాలల్లో కనిపించే ఫలితాలు మానవ శరీరం లో జరగకపోవచ్చు.
2019 లో ఇటలీలో జరిపిన పరిశోధన మిర్చి తీసుకోవడం వలన మరణం ముప్పు తక్కువగా ఉంటుందనే చెప్పే అధ్యయనం కేవలం కొన్ని పరిశీలనల ఆధారంగా చేసింది. అందువలన, కేవలం మిర్చి తినడం వలన ప్రజలు ఎక్కువ కాలం జీవించారా అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేము. మిర్చిని వారు ఏ రూపంలో తీసుకున్నారో కూడా ఆధారపడి ఉంటుంది.
మెడిటరేనియన్ దేశాలలో మిర్చిని సాధారణంగా పాస్తా తో కానీ, కొన్ని రకాల కూరగాయలతో కానీ కలిపి తింటారు. కూరగాయలతో కానీ ఇతర ఆహార పదార్ధాలతో కానీ మసాలా దినుసులని కలిపి తినడం వలన లాభాలు ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అలాగే మాంసాన్ని నిల్వ ఉంచడానికి కూడా కొన్ని రకాల మసాలా దినుసులు వాడతారు.
వీటి వలన వచ్చే లాభాల కంటే ఆహారాన్ని నిల్వ చేయడానికి ఎక్కువ వాడొచ్చేమో అని మెల్లోర్ అనే పరిశోధన కారుడు చెప్పారు. ఆహారం పాడవకుండా ఉండటం వలన కూడా శరీరానికి మేలు చేస్తుందని అన్నారు. కొన్ని రకాల మసాలా దినుసులు వాడటం వలన ఆహారానికి రుచి వస్తుందని లిపి రాయ్ అనే పరిశోధకురాలు అన్నారు.
కాయగూరలతో కలిపి మిర్చి తినడం వలన ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. గోల్డెన్ లాటెలు తాగడం వలన ఎటువంటి నష్టం లేనప్పటికీ, కొన్ని రకాల మసాలాలు చల్లుకుని కాయగూరలను తినడం వలన కొన్ని లాభాలు ఉండవచ్చు. అయితే, కొన్ని రకాల అనారోగ్యాల కోసం వాటిని మందులుగా అయితే వాడకూడదు.