పాక్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ‘సొంత దేశాన్నే చూసుకోలేనివారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:56 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదివారం అమెరికాలోని హ్యూస్టన్‌లో నిర్వహించిన 'హౌడీ, మోదీ' కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యూస్టన్ ఎన్ఆర్జీ స్టేడియంకు తరలివచ్చిన భారత-అమరికా సమాజాలను ఉద్దేశించి ఇద్దరూ ప్రసంగించారు. 'హౌడీ మోదీ' అనే పదానికి సమాధానం ఇచ్చిన మోదీ భారత్‌లో అంతా బాగుందన్నారు. ఆర్టికల్ 370ని తొలగించడాన్ని చాలా పెద్ద నిర్ణయంగా చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో పేరు చెప్పకుండానే పాకిస్తాన్ గురించి ప్రస్తావించారు.
ఇటు, ఇస్లామిక్ తీవ్రవాదంతో పోరాడేందుకు భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయని ట్రంప్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగాన్ని డోనల్డ్ ట్రంప్‌పై ప్రశంసలతో ప్రారంభించారు. "మనతో చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆయన పరిచయం చేసుకోవాలని ఆసక్తి చూపరు. ఆయన గురించి ప్రపంచానికంతా తెలుసు. ఈ మహా దేశం అత్యున్నత పదవిలో ఉండడం వల్ల, ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయనకు స్వాగతం పలకడం నాకు ఒక గౌరవం" అన్నారు.
భారత్‌లో అంతా బాగుంది: మోదీ
ఆ తర్వాత మాట్లాడిన మోదీ "ఈ కార్యక్రమం పేరు హౌడీ మోదీ.. నేను ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఇస్తాను-అంతా బాగుంది" అన్నారు. 'అంతా బాగుంది' అనే మాటను ప్రధాని మిగతా భారతీయ భాషల్లో కూడా చెప్పారు. "ఈరోజు మనం మనతోనే పోటీపడుతున్నాం. మనకే సవాలు విసురుకుంటున్నాం. మనల్ని మనం మార్చుకుంటున్నాం. భారత్ ఇంతకు ముందుతో పోలిస్తే ఈరోజు వేగంగా ముందుకు వెళ్లాలనుకుంటోంది. కొంతమంది ఆ ఆలోచనను సవాలు చేస్తున్నారు. వారు ఏదీ మార్చలేమని అనుకుంటున్నారు" అన్నారు.
ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీ చాలాసేపటి వరకూ భారత్‌లో నడుస్తున్నపారిశుద్ధ్య ప్రచారం గురించి ప్రస్తావించారు. దేశాన్ని బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. ఆర్థిక సవరణలు, అవినీతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆయన చాలా మాట్లాడారు.
పేరెత్తకుండానే పాక్‌పై విమర్శలు
ప్రధాని మోదీ తన ప్రసంగం చివర్లో ఇటీవల జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 నిబంధనను తొలగించడం గురించి ప్రస్తావించారు. భారత్‌లో 70 ఏళ్ల పురాతన సవాలుకు ఫేర్‌వెల్ ఇచ్చాం అన్నారు. "భారత్ ఇటీవల 370కి కూడా వీడ్కోలు పలికింది. దానివల్ల జమ్ము-కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు భారత్‌లోని మిగతా ప్రజలకు ఉన్న అవే హక్కులు లభించాయి. అక్కడి మహిళలు, పిల్లలు, దళితుల పట్ల ఉన్న వివక్ష అంతమైంది" అన్నారు.
"మన పార్లమెంటులోని ఉభయ సభల్లో కొన్ని గంటలపాటు జరిగిన చర్చను ప్రపంచమంతా లైవ్‌లో చూసింది. భారత్‌లో మా పార్టీకి అప్పర్ హౌస్ అంటే రాజ్యసభలో మెజారిటీ లేదు. అయినా, రెండు సభలూ 370కి సంబంధించిన నిర్ణయాన్ని మూడింట రెండు వంతుల మెజారిటీతో పాస్ చేశాయి" అన్నారు.
ఆ తర్వాత ప్రధాని పేరు చెప్పకుండానే పాకిస్తాన్‌ను టార్గెట్ చేశారు. "సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్లు భారత్‌పై ద్వేషాన్ని తమ రాజకీయాలకు కేంద్రంగా చేసుకుంటున్నారు. వారు తీవ్రవాదాన్ని సమర్థిస్తారు. దానిని పెంచి పోషిస్తారు. వారు ఎవరనేది, మీకే కాదు, ప్రపంచానికంతటికీ బాగా తెలుసు" అన్నారు.
అమెరికాలో 9/11 అయినా, ముంబైలో 26/11 అయినా, ఈ దాడులకు కుట్రపన్నిన వారు ఎక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు తీవ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేవారికి వ్యతిరేకంగా న్యాయబద్ధ పోరాటానికి సమయం వచ్చింది. ఈ యుద్ధంలో అధ్యక్షుడు ట్రంప్ పూర్తి బలంతో తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచారు. ట్రంప్ మనోబలానికి ఆయనకు కూడా స్టాండింగ్ ఇద్దాం" అన్నారు.
డోనల్డ్ ట్రంప్‌ను భారత్ రావాలని ఆహ్వానించిన ప్రధాని మోదీ, "మాకు స్వాగతం పలికే అవకాశం ఇవ్వండి. అప్పుడే మన స్నేహం, మన దేశాలు పంచుకునే కలలను నిజం చేయడానికి దోహదపడుతుంది" అన్నారు. ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ చేతులు పట్టుకుని స్టేడియం చుట్టూ తిరిగారు. వచ్చినవారందరికీ అభివాదం చేశారు.
ఈ కార్యక్రమంతో డోనల్డ్ ట్రంప్, ఇంత భారీ సంఖ్యలో హాజరైన భారత-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన తొలి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అటు, ప్రధాని మోదీ అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి. ఆయన ఇంతకు ముందు 2014లో మాడిసన్ స్క్వేర్, 2015లో శాన్ జోస్‌లో భారత సమాజం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.