సిక్కింలో రాత్రికి రాత్రి 0 నుంచి 10కి చేరిన బీజేపీ బలం... ఎలా?

మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:25 IST)
సిక్కింలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ, ఇప్పుడు అది రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకుంది. ఈ క్రెడిట్ అంతా బీజేపీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జ్ రామ్‌ మాధవ్‌దే అని చాలా మంది చెబుతున్నారు. సిక్కింలో పాతికేళ్లు అధికారంలో ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్) ఎమ్మెల్యేలు 10 మంది రాత్రికిరాత్రే పార్టీ మారి బీజేపీలో చేరారు. 
 
గత ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీకి 1.62 శాతం ఓట్లే వచ్చాయి. ఈ ఎన్నికల్లో 17 స్థానాలు గెలుచుకున్న సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్‌కేఎం) ఎస్‌డీఎఫ్‌ను ఓడించింది. ఎస్‌డీఎఫ్‌లో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు పవన్ చామ్లింగ్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలే మిగిలారు. చామ్లింగ్ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతగా చరిత్ర సృష్టించారు.
 
ఈశాన్యంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని 2016లో ప్రయత్నించిన బీజేపీకి చామ్లింగ్ ప్రధాన సహచరుడుగా నిలిచారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామన్న బీజేపీతో ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ఇప్పుడు బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని, మూడింట రెండొంతులకు పైగా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలారని ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు
 
పార్టీ ఫిరాయింపుల చరిత్ర పాతదే
సిక్కిం ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారడం కొత్త కాదు. గత నాలుగేళ్లలో అక్కడ భారీగా ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఇది రెండోసారి. 2015లో ఎస్‌కేఎంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అప్పటి అధికార పార్టీ ఎస్‌డీఎఫ్‌లో చేరారు. అప్పుడు కూడా ఈ స్థాయిలో పార్టీ మారడంపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఈసారీ ఎస్‌డీఎఫ్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పూర్తిగా తిరస్కరించారు.
 
సిక్కింలో స్థానిక పార్టీలు, జాతీయ పార్టీలతో కలిసి వెళ్లడం అనాదిగా వస్తూనే ఉంది. సిక్కిం భారత్‌లో విలీనం అయినప్పుడు ఆ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కాజీ లెండుప్ దోర్జీ తన పార్టీ సిక్కిం నేషనల్ కాంగ్రెస్‌ను మొదట భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1977లో కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆయన మళ్లీ పార్టీ మారి జనతాపార్టీలోకి వెళ్లారు. 1994లో ఎస్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జాతీయ పార్టీలకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం తగ్గిపోయింది.
 
చామ్లింగ్ పార్టీ బేజారు
పవన్ కుమార్ చామ్లింగ్‌కు ముందు, సిక్కిం జనతా పరిషత్ (ఎస్‌జేపీ) 1979 నుంచి 1994 వరకూ అధికారంలో ఉంది. ఆ సమయంలో కూడా రాష్ట్రంలో చాలా ఫిరాయింపులు జరిగాయి. 1979లో ప్రజాకర్షణ ఉన్న నేత నార్ బహదూర్ భండారీ నేతృత్వంలో ఎస్‌జేపీ 32 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 16 స్థానాలు గెలుచుకుంది. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
 
అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాంతో భండారీ ఎస్‌జేపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ విలీనంతో సిక్కింలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. దాంతో, ఫిరాయింపులు, విలీనం ద్వారా వారి సభ్యుల సంఖ్య 26కు చేర్చారు. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు మూడు పార్టీలు మారి ప్రభుత్వంలో భాగమయ్యారు.
 
2014 తర్వాత బీజేపీ దేశంలో అత్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించింది. దాంతో, ఎస్‌డీఎఫ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారనే చర్చ చాలా ముందు నుంచే ఉంది. ఈ ఏడాది మే 14న ఎస్‌కేఎం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ చర్చ మరింత జోరందుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు