నేపాల్: పోఖరా విమానాశ్రయానికి భారత్ విమానాలు నడపదు... ఎందుకు?

మంగళవారం, 17 జనవరి 2023 (19:29 IST)
నేపాల్‌లో కొత్తగా నిర్మించిన పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఆదివారం యతి ఎయిరలైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 70 మృతదేహాలను వెలికితీశారు. ఈ విమానంలో నలుగురు సిబ్బందితో సహా 72 మంది ప్రయాణిస్తున్నారు. రాజధాని కాఠ్‌మాండూ నుంచి పోఖరాకు 27 నిమిషాల పాటు ప్రయాణించే ఈ విమానం ప్రమాదానికి గురైంది.

 
పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి కొద్ది క్షణాల ముందు ఈ విమానం క్రాష్ అయింది. పోఖరా విమానాశ్రయాన్ని రెండు వారాల క్రితమే ప్రారంభించారు. నేపాల్ రాజధాని నగరం కాఠ్‌మాండూకి పశ్చిమాన 200 కి.మీల దూరంలో పోఖరా నగరం ఉంది. నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వత్ర శ్రేణులకి ఈ నగరాన్ని గేట్‌వేగా పిలుస్తారు.

 
ఎందుకు ఈ విమానాశ్రయం?
1958 నుంచి పోఖరాలో విమానాశ్రయం ఉంది. కానీ, నేపాల్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ నగరాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావించి కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాల్సి వచ్చింది. 2016లో పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాది జనవరి 1నే ఈ విమానాశ్రయాన్ని నేపాల్ ప్రారంభించింది. పోఖరా విమానాశ్రయం నుంచి నేపాల్‌లో పలు ప్రాంతాలకు దేశీయ విమానాలు ఎగురుతున్నాయి. అంతర్జాతీయ అనుసంధానాన్ని పెంచడమే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయ లక్ష్యం. అయితే, ఇప్పటి వరకు పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక్క అంతర్జాతీయ విమానం కూడా ఎగరలేదు.

 
చైనా సహకారం
చైనా సహకారంతో నేపాల్ కొత్తగా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసింది. దీంతో భారత్ దీనిపై కాస్త ఆందోళనగా ఉంది. 22 బిలియన్ నేపాలీ రూపాయల ఖర్చుతో చైనీస్ కంపెనీ సీఏఎంసీ ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చైనా ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. విమానాశ్రయం నిర్మాణానికి చైనా నుంచి నేపాల్ గ్రాంట్‌ను కూడా పొందింది. గంటకు 600 మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించొచ్చు. ‘‘ఒకేసారి మూడు అంతర్జాతీయ విమానాలను, నాలుగు చిన్న, 8 దేశీయ విమానాలను హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని ఈ విమానాశ్రయం కలిగి ఉంది. కానీ, అసలు సామర్థ్యం అంతకంటే ఎక్కువగా ఉంటుంది.’’ అని ఈ విమానాశ్రయం ప్రారంభానికి ముందు బీబీసీతో మాట్లాడిన ప్రాజెక్టు హెడ్ వినేష్ మున్కర్మి అన్నారు.

 
ఈ విమానాశ్రయంలో 2,500 మీటర్ల పొడవు కలిగిన ఒకే ఒక్క రన్‌వే ఉంది. బోయింగ్ 737-700, ఎయిర్‌బస్ ఏ320, బోయింగ్ 757-200 వంటి పెద్ద విమానాలు కూడా ఈ రన్‌వేపై ల్యాండ్ కావొచ్చు. 24 గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు, ఈ విమానాశ్రయానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పారాగ్లైడింగ్ ఏరియా కూడా ఉంది. పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇరుకైన లోయల మధ్యలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పెద్ద విమానాలను కార్యకలాపాలు నిర్వహించడంపై నిపుణులు అనుమానాలు సైతం వ్యక్తం చేశారు. పోఖరా లోయలో విమానాలు టేకాఫ్ కావడమైనా లేదా ల్యాండ్ కావడమైనా తూర్పు దిశగానే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెడల్పైన విమానాల కంటే, గరిష్టంగా 180 సీట్ల సామర్థ్యం కలిగిన విమానాలు మాత్రమే ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలవుతుంది.

 
కాంక్రీట్ రన్‌వే
పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాంక్రీటుతో నిర్మించారు. నేపాల్‌లో ఏర్పాటు చేసిన తొలి కాంక్రీట్ రన్‌వే కూడా ఇదే. ‘‘కాంక్రీట్ రన్‌వే ఎందుకు నిర్మించామంటే దీన్ని తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయొచ్చు. ఈ లోయలో వర్షాలు కూడా ఎక్కువగా పడుతుంటాయి. దీంతో, కాంక్రీట్ రన్‌వే అయితే ఎక్కువ మన్నిక ఉంటుంది ’’ అని ప్రాజెక్ట్ హెడ్ వినేష్ చెప్పారు. ఈ విమానాశ్రయం నుంచి విమానాల కార్యకలాపాలు సాగించేందుకు, ఎయిర్‌పోర్ట్‌కి తూర్పు దిశగా ఉన్న రితేపాని కొండను తొలిచారు. చెట్లను నరికారు. ఇలా నరకడంపై పర్యావరణపరమైన ఆందోళనలు కూడా నెలకొన్నాయి.

 
భారత్ నుంచి విమానాలు నడపలేదు
నేపాల్ ‘బుద్ధ ఎయిర్’ ఎయిర్‌లైన్ ఈ విమానాశ్రయం నుంచి భారత్‌లోని వారణాసికి, దిల్లీకి, డెహ్రడూన్‌కి అంతర్జాతీయ విమానాలను నడపాలనుకుంది. తొలుత వారణాసి నుంచి, ఆ తర్వాత దిల్లీ, డెహ్రడూన్ నుంచి విమానాలను నడపాలని భావించింది. కానీ భారత్ నుంచి బుద్ధ ఎయిర్‌కి ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. జనవరి 1 నుంచి తన ఛార్టెడ్ ఫ్లయిట్స్‌ను వారణాసికి ప్రారంభించాలని కూడా బుద్ధ ఎయిర్ భావించింది. కానీ, దీనికి కూడా భారత్ నుంచి ఎలాంటి అనుమతి దక్కలేదు. పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం విజయవంతం కావాలని భారత్ కోరుకోవడం లేదని నేపాల్ మీడియాలో నాడు వార్తలు వచ్చాయి. పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా పెట్టుబడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విమానాశ్రయ వ్యూహ్యాత్మక ప్రాధాన్యతను భారత్ కూడా అర్థం చేసుకుంది.

 
సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు
పోఖరా పర్యాటక రంగం అభివృద్ధికి పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ముఖ్యమైనది. కానీ, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన రెండు వారాల్లోనే అతిపెద్ద విమాన ప్రమాదం ఇక్కడ జరగడంతో, ఈ విమానాశ్రయం సెక్యూరిటీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే నేపాల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రమాదం జరగలేదని పేర్కొంది. పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా భారత్, చైనాల నుంచి పర్యాటకులను ఆకర్షించాలని నేపాల్ కోరుకుంటోంది. కానీ, ఆర్థిక పరంగా ఈ విమానాశ్రయం విజయంపై ఇప్పటికే పలు ప్రశ్నలు తలెత్తాయి. రుణాల మీద వడ్డీని తిరిగి చెల్లించేందుకు ఈ విమానాశ్రయానికి వార్షికంగా 2.5 బిలియన్ నేపాలీ రూపాయలు మాత్రమే కావాల్సి ఉంది.

 
ఈ విమానాశ్రయం నుంచి చైనాకు నేరుగా పలు విమానాలు కార్యకలాపాలు సాగించడంపై కూడా అనుమానాలు ఉన్నాయి. దీంతో, ఈ విమానాశ్రయం నుంచి భారత్ విమానాలు ఎగిరేందుకు అనుమతిస్తుందా?లేదా? అన్నది చర్చనీయాంశమైంది. భారత్‌కు విమానాలు నడిపేందుకు యతి గ్రూప్‌కు చెందిన హిమాలయన్ ఎయిర్‌లైన్‌కు కూడా భారత్ అనుమతి ఇవ్వలేదు. ఈ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు ప్రయాణ మార్గం కూడా అంత తేలిగ్గా లేకపోవడం మరొక కారణం. హిమాలయన్ పర్వత శ్రేణుల్లో ఈ విమాన మార్గం చాలా కష్టం. నేపాల్‌లోని సిద్ధార్థనగర్‌లో ఉన్న గౌతమ్ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎగిరేందుకు అంతర్జాతీయ విమానసంస్థలు ఆసక్తి చూపకపోవడం కూడా ఒక కారణంగా నిలుస్తుంది. ఈ కారణంతోనే, ఈ విమానాశ్రయం ఆర్థికంగా విజయం సాధించనుందా అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు