మహా కుంభమేళా మొదలుకానున్న ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సుమారు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజంతా పొగమంచు కురుస్తూనే ఉంటోంది. మధ్యాహ్నమైనా సూర్యుడి జాడ కనిపించని పరిస్థితి. అయినప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో రావడం కనిపిస్తోంది. త్రివేణి సంగమాన్ని దర్శించుకుని స్నానాలు చేస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా జరిగే ప్రదేశానికి వెళ్లే దారుల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. త్రివేణి సంగమం ఘాట్, హనుమాన్ ఆలయ కారిడార్, సరస్వతి ఘాట్, అరైల్ ఘాట్ మార్గాల్లో ఆంక్షలు కనిపిస్తున్నాయి.
40 కోట్ల మంది వస్తారని అంచనా
కుంభమేళాకు భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా 123 దేశాల నుంచి ఈసారి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. చివరిసారిగా 2013లో ఇక్కడ జరిగిన కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా కేశవ్ ప్రసాద్ మౌర్య నెల రోజుల కిందటే ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి మీడియా సమావేశాలు పెట్టి కుంభమేళాకు భక్తులు రావాలంటూ ప్రచారం చేశారు. ''కుంభమేళా నిర్వహణకు గతంలో రూ. 4,700 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు ముందుగా అనుకున్న దాని ప్రకారం సుమారు రూ. 6,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కేంద్రం కూడా సహకారం అందిస్తోంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు. ఇప్పటికే సాధువులు కుంభమేళా ప్రాంతానికి చేరుకుని అఖాడాలలో ఉంటున్నారు.
కుంభమేళా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
కుంభమేళా అనేది 12 ఏళ్లకోసారి జరుగుతుంది. చివరిసారిగా 2013లో జరిగిన కుంభమేళా తర్వాత 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. ఇది ఆరేళ్లకోసారి జరిగే మేళా. ఈసారి జనవరి 13న పుష్య మాస పౌర్ణమి రోజు నుంచి కుంభమేళా ప్రారంభమై 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. ఈ 45 రోజులలో ఆరు రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర (షాహి) స్నానాలు చేసేందుకు లక్షలాది భక్తులు వస్తారని అంచనా. సాధారణ భక్తులతోపాటు వీఐపీలు, నాగ సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు(నెల రోజుల దీక్ష పాటించేవారు), పీఠాధిపతులు, మఠాధిపతులు దీనికి హాజరవుతారు. కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు జరుగుతుందో తెలుగు పురోహితుడు యడవెల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ బీబీసీకి వివరించారు. ఆయన గత 12ఏళ్లుగా ప్రయాగ్‌రాజ్‌లో పౌరోహిత్యం చేస్తున్నారు. నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించడంపై పురాణాల్లో భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయని ఆయన చెప్పారు.
''సామ, అథర్వణ వేదాలలో చెప్పిన ప్రకారం.. దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేస్తే అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని మొదట జయంతుడు అనే కాకి తన నోట కరచుకుని భూమి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు అమృత కలశంలోని నాలుగు చుక్కలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో పడ్డాయని, అందుకే ఈ ప్రదేశాలకు అంత విశిష్టత ఉందని చెబుతుంటారు'' అని ప్రవీణ్ శర్మ వివరించారు. దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో అమృత కలశం నుంచి నాలుగు చుక్కలు రాలి నాలుగు ప్రదేశాల్లో పడ్డాయని మరో కథనం కూడా ప్రచారంలో ఉందని ఆయన చెప్పారు. మథుర నుంచి వచ్చిన పురోహితుడు ధనుంజయ్ దాస్ కూడా ఇలాంటి కథనమే వ్యవహారంలో ఉన్నట్లు చెప్పారు. అయితే, ఆయన... అమృత కలశాన్ని నోట కరచుకుని వెళ్లింది కాకి కాదు, అది గరుడపక్షి అని తెలిపారు.
12 ఏళ్లకోసారే ఎందుకు?
కుంభమేళాను 12 ఏళ్లకోసారే ఎందుకు నిర్వహిస్తారో చంద్రశేఖర ప్రవీణ్ శర్మ వివరించారు. ''మనకు రోజు అంటే 24 గంటలు. అదే దేవతలకు రోజు అంటే సంవత్సర కాలానికి సమానం. ఆ పక్షి భూమి చుట్టూ 12 రోజుల పాటు తిరిగిందని పురాణాల్లో ఉంది. అందుకే 12 సంవత్సరాలకోసారి జరుపుకోవాలనేది ఆచారంగా వస్తోంది'' అన్నారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోనే కుంభమేళా జరుగుతుంది. సరస్వతి అంతర్వాహినిగా ప్రహహిస్తుందని పండితులు చెబుతున్నారు.
కుంభమేళా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఘాట్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడకు చేరుకోవాలంటే దాదాపు మూణ్నాలుగు కిలోమీటర్లు వెళ్లాలి.
త్రివేణి సంగమ ప్రదేశంలో స్నానం చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి వీలుగా 'ఫ్లోటింగ్ చేంజింగ్ రూమ్స్'ను ఏర్పాటు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ''సాధారణ భక్తులతోపాటు వీఐపీల కోసం 12 జెట్టీలపై దుస్తులు మార్చుకునే గదులు నిర్మిస్తున్నాం. భక్తులు జెట్టీలపైకి చేరుకుని మెట్ల మార్గంలో నదిలోకి దిగి స్నానాలు చేసి పైకి వచ్చి దుస్తులు మార్చుకోవచ్చు'' అని వీటిని నిర్మిస్తున్న దాస్ అండ్ కుమార్ కంపెనీ భాగస్వామి యశ్ అగర్వాల్ బీబీసీకి చెప్పారు. ఇవి కాకుండా సంగమం ఒడ్డున తాత్కాలికంగా దుస్తులు మార్చుకునే గదులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పటికీ కుంభమేళా ప్రాంతంలో నదిలో చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోంది. గత కుంభమేళాకు 22 ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మించగా.. ఈసారి 30 వంతెనలు నిర్మిస్తున్నారు. ఇందుకు 3,308 పాంటూన్లు వినియోగిస్తున్నట్లు మేళా అధికారులు చెబుతున్నారు. వీటిపై మనుషులు కాలినడకన వెళ్లడమే కాకుండా 5 టన్నుల బరువున్న వాహనాలు కూడా ప్రయాణించే వీలుంది. వాహనాలు ఇసుకలో కూరుకుపోకుండా 2.69 లక్షల ఇనుప చట్రాలు, మొత్తం 488 కిలోమీటర్ల మేర దారులు నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇందులో కొన్ని దారులను నదీగర్భంలోనే చదును చేసి వేశారు. వాహనాలు కూరుకుపోకుండా ఉండేందుకు 2,69,000 ఐరన్ షీట్ల (చెకర్డ్ ప్లేట్లు)ను దారుల పొడవునా పరిచారు. నదిలో భూమిని చదును చేసి ఇసుక బస్తాలు వేసే పనులు జరుగుతున్నాయి. జేసీబీలు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూ మట్టిని ఎత్తి పోస్తూ చదును చేస్తున్నాయి.
టెంట్ సిటీలో టెంట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.
కుంభమేళా కోసం త్రివేణి సంగమం చుట్టుపక్కల 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మేళా అధికారులు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ప్రకారమే భూ కేటాయింపులు చేశామని కుంభమేళా అదనపు అధికారి వివేక్ చతుర్వేది బీబీసీకి చెప్పారు. ''నాలుగు వేల హెక్టార్ల భూమిని చదును చేసి.. అఖాడాలు, దండివాడ, అచారవాడ, శంకరాచార్య, మహామండలేశ్వర్లతోపాటు వివిధ సంస్థలకు ఉచితంగా కేటాయించాం. అక్కడ ప్రభుత్వం తరఫున టెంట్లు, నీటి కనెక్షన్, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించాం'' అని చెప్పారాయన. 1850 హెక్టార్లలో పార్కింగ్ వసతి కల్పించినట్లుగా వివేక్ చతుర్వేది బీబీసీకి చెప్పారు.
టెంటులో ఉండాలంటే రోజుకు రూ.1.10 లక్షలు
2019లో జరిగిన అర్ధ కుంభమేళా కోసం 80 వేల టెంట్లు వేయగా.. ఈసారి 1.60 లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. టెంట్ సిటీ పేరుతో భక్తులు ఉండేందుకు వీలుగా తాత్కాలిక టెంట్లు నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖతో పాటు ఐఆర్‌సీటీసీ సహా 11 ప్రైవేటు సంస్థలు టెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. డార్మిటరీ, డబుల్ బెడ్ రూం విల్లా, సింగిల్ బెడ్ రూం, మహారాజా కాటేజీ తదితర పేర్లతో బుకింగ్‌కు అవకాశం కల్పిస్తోంది టూరిజం శాఖ. వీటిల్లో బెడ్, అటాచ్డ్ బాత్ రూం, సోఫా లేదా కుర్చీ, భోజన వసతి కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అఖాడాల వద్ద ఏర్పాటు చేస్తున్న టెంట్లలో కొన్ని సంప్రదాయ పద్ధతిలో గడ్డితో నిర్మిస్తున్నారు. ఇక్కడ రోజుకు రూ.1,500 నుంచి మొదలుకుని రూ.1.10 లక్షల వరకు అద్దెతో టెంట్లు అందుబాటులో ఉన్నాయి. డోమ్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రదేశంలో రోజుకు రూ.1.10 లక్షల అద్దె చెల్లించి ఉండే టెంట్లు నిర్మిస్తున్నారు.
గంగా నదిలో స్వచ్ఛత కష్టమే!
కుంభమేళా ప్రారంభానికి ముందుగానే యమున, గంగా నదిలో చెత్త, వ్యర్థాలు కనిపిస్తున్నాయి. భక్తులు పారవేసిన పూలు, ఇతర పూజా వ్యర్థాలు త్రివేణి సంగమం ఘాట్ వద్ద నదిలో కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు నది వద్ద ఉంటూ శుభ్ర పరుస్తూ కనిపించారు. చెత్తాచెదారం నదిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివేక్ చతుర్వేది చెప్పారు. నది స్వచ్ఛతకు సంబంధించి ఎన్జీటీ సూచనలకు తగ్గట్టుగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ్య మెరుగుదలకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు.
''ఈసారి కుంభమేళాను దివ్య-భవ్య-డిజిటల్ కుంభమేళాగా చెబుతున్నాం. 1.50 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణతో పాటు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకుంటాం. 11 భాషల్లో అందుబాటులో ఉండే చాట్ బాట్ అందుబాటులోకి తీసుకువస్తున్నాం'' అని మౌర్య వివరించారు.
అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా
కుంభమేళా బందోబస్తులో 50 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారని కుంభమేళా అదనపు అధికారి వివేక్ చతుర్వేది బీబీసీకి చెప్పారు. ''2700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఇవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీటితో భక్తుల కదలికలు, మేళా ప్రదేశాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం'' అని చెప్పారు. వంద మీటర్ల లోతుకు వెళ్లగల అండర్ వాటర్ డ్రోన్లతోనూ నిఘా పెట్టినట్లుగా మేళా అధికారులు చెబుతున్నారు. పాంటూన్ బ్రిడ్జిల వద్ద పోలీసుల గస్తీ ఎక్కువగా ఉంది. ఇవన్నీ వన్-వే వంతెనలు కావడంతో పోలీసులు ఒకవైపు నుంచే వాహనదారులను అనుమతిస్తున్నారు.
గత ఏడాది కాలంలో సంగమానికి వెళ్లేదారిలో రోడ్లు వెడల్పు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రహదారులు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుంభమేళా సమయంలో సమస్య మరింత పెరగవచ్చని ప్రయాగ్‌రాజ్ వాసులు చెబుతున్నారు. ''మొత్తం 5 నుంచి 6 వేల ప్రజా రవాణా బస్సులు ఉంటాయి. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. మొత్తం 67 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నాం'' అని వివేక్ చతుర్వేది బీబీసీతో చెప్పారు.