పాలస్తీనాకు మద్దతు ఇచ్చేందుకు అరబ్ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?

బిబిసి

శుక్రవారం, 8 నవంబరు 2024 (12:30 IST)
‘అరబ్ దేశాలు ఎక్కడ? అరబ్ దేశాలు ఎక్కడ?’ ఇజ్రాయెల్ దాడులతో నిరాశ్రయులైన గాజా పౌరులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నను గాజా ప్రజలు చాలాకాలంగా అడుగుతుండడమే కాదు.. పొరుగున ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను ఎందుకు రక్షించలేకపోతున్నాయని వారు ఆశ్చర్యపోతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో అందరి కళ్లు పశ్చిమాసియాపై పడ్డాయి. ఈ దాడికి ధీటుగా ఇజ్రాయెల్ ఎంత బలంగా దాడులకు దిగుతుంది? అనే అంశంతో పాటు ఈ ఘటనపై అరబ్ దేశాల్లోని ప్రజలు, ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనే ప్రశ్నలూ ఉత్పన్నమయ్యాయి.
 
అయితే, ఈరోజు వరకు కూడా అరబ్ దేశాలు ఎలా స్పందిస్తాయనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. గాజాపై బాంబు దాడులతో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 42,500 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆ దేశ ఆరోగ్య శాఖ చెబుతోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపడంపై అరబ్ దేశాలలో ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు పాలస్తీనియన్లకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు. “ప్రస్తుతానికైతే అరబ్ దేశాల స్పందన చాలా నిరాశకు గురి చేస్తోంది” అని ప్రొఫెసర్ వలీద్ ఖాదియా బీబీసీతో చెప్పారు. వలీద్ కైరోలోని అమెరికా యూనివర్సిటీలో పొలిటిల్ సైన్స్ విభాగంలో పని చేస్తున్నారు.
 
“ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొస్తున్న ఖతర్, ఈజిప్ట్ వంటి దేశాలు మినహా వేరే దేశాలేవీ పాలస్తీనాకు మద్దతుగా నిలబడటంలేదు” అని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్‌పై ఆర్థిక, ఇతర ఆంక్షలు విధిస్తూ.. ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకునేందుకు ఏ అరబ్ దేశం కూడా సాహసం చేయదు అని ప్రొఫెసర్ వలీద్ అన్నారు. కానీ, ఈ ప్రాంతంలో పాలస్తీనా సమస్య ప్రాధాన్యం ఎందుకు కోల్పోతోంది? అంటే ప్రస్తుతం పశ్చిమాసియాలోని పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం.
 
అరబ్ ప్రజలు ఏమనుకుంటున్నారు?
అరబ్ దేశాల చరిత్రను పరిశీలిస్తే అరబ్బులు అంతా తమను తాము ఒక్కటిగా భావిస్తారు. ఒకే భాష, ఒకే మతం ప్రాతిపదికన ఐక్యంగా ఉంటారు. కానీ, ఈ ప్రాంతంలో యూరోపియన్ వలసవాద ప్రభావం నుంచి ఉద్భవించిన కొన్ని భయాలు ఉన్నాయి. ఈ దేశాల ప్రయోజనాలు కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. మరోవైపు... పాలస్తీనా, అరబ్ దేశాల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఏం లేవు.
 
ముఖ్యంగా ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించిన సమయంలో పెద్దసంఖ్యలో శరణార్థులను అరబ్ దేశాలు స్వాగతించడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. లెబనాన్ అంతర్యుద్ధం, పాలస్తీనా మిలిటెంట్లు-జోర్డాన్ రాచరికం మధ్య వివాదాలతో ఈ ప్రాంతం అట్టుడుకుతూనే ఉంది. అనేక దశాబ్దాలుగా అరబ్ దేశాలు ఐక్యంగా ఉండటానికి పాలస్తీనా సమస్య కూడా ఒక కారణం.
 
“ఒకప్పటి వలసవాద శక్తులకు కొనసాగింపుగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ను చూడొచ్చు. పశ్చిమాసియా నుంచి ఐరోపా దేశాలు వెళ్లిపోయినప్పటికీ.... అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ఆకాంక్షలు నేరవేర్చే ఒక ఏజెంట్‌లా ఇజ్రాయెల్ మిగిపోయింది” అని ప్రొఫెసర్ తైమూర్ కర్ముత్ బీబీసీతో చెప్పారు.
ఈయన దోహా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్రాడ్యుయేట్ స్టడీస్‌లో పబ్లిక్ పాలసీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధం చేయడం వల్ల ఆయా దేశాల ప్రయోజనాలతో పాటు పాలస్తీనియన్లను కాపాడినట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
 
కానీ, ఆ యుద్ధాలన్నీ గతానికి సంబంధించినవి. దశాబ్దాల క్రితమే ఈజిప్ట్, జోర్డాన్‌లు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లు కూడా ఆ దేశంతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలయ్యే ముందు వరకు కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి సౌదీ అరేబియా గట్టిగానే ప్రయత్నాలు చేసింది.
 
“అనేక దశాబ్దాల నుంచి ఇటీవల నెలకొన్న ఘర్షణల వరకు చూస్తే తమ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే అరబ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పాలస్తీనియన్లపై సానుభూతి వ్యక్తం చేస్తూ, మద్దతుగా ఉన్నామని ఆయా దేశాలు చెబుతున్నప్పటికీ, వారి సొంత ప్రయోజనాల ముందు ఈ సెంటిమెంట్స్ నిజం కావని తెలుసుకోవాలి” అని డోవ్ వాక్స్‌మన్ తెలిపారు. ఈయన యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సెంటర్ ఫర్ ఇజ్రాయెల్ స్టడీస్ డైరెక్టర్.
 
“ఇజ్రాయెల్‌పై అరబ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు” అని ఇల్హామ్ ఫఖ్రూ అన్నారు. ఈయన చాథమ్‌హౌస్‌లో పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రోగ్రామ్‌కు చెందిన పరిశోధకుడు. “గాజాలో నిరాశ్రయులైన పాలస్తీనియన్లపై అరబ్ దేశ ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పాలస్తీనియన్లకు మద్దతుగా తమ ప్రభుత్వాలు ఏదైనా చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు తెంచుకోవాలని లేదా కనీసం తమ దేశాల్లోని దౌత్యవేత్తలను బహిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని ఆయన అన్నారు. పాలస్తీనా ప్రజలను అరబ్ ప్రభుత్వాలు చాలా కాలమే వదిలేశాయని ఇమాద్ హరిబ్ చెప్పారు. ఆయన వాషింగ్టన్ డి.సి. లోని అరబ్ సెంటర్ థింక్ ట్యాంక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్.
 
'అరబ్ స్ప్రింగ్'తో మారిపోయిన సమీకరణాలు
2010లో వచ్చిన 'అరబ్ స్ప్రింగ్'తో పరిస్థితులు మారిపోయాయి. కానీ, ఆ తిరుగుబాటుతో ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొంది. ఇప్పటికీ యెమెన్, సిరియా, ఇరాక్ దేశాలు అంతర్యుద్ధంతో సతమతమవుతున్నాయి. బలమైన రాజకీయ సిద్ధాంతాలు గల సిరియా, ఇరాక్‌‌లు ఒకప్పుడు అమెరికాకు సవాల్ విసిరాయి. ఇప్పుడు ఆ దేశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
 
లిబియా కూడా ప్రభావితం చేసే స్థాయిలో లేదు. సూడాన్‌లో అంతర్యుద్ధం, ఈజిప్ట్‌లో ఆర్థిక అస్థిరతలు నెలకొన్నాయి. “ఈ సంక్షోభ స్థితిలో పాలస్తీనియన్లపై అరబ్ ప్రజలు సానుభూతి తెలియజేస్తున్నప్పటికీ, సాయం చేయలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే, వారే స్వయంగా నియంతృత్వ పాలనలో జీవిస్తున్నారు” అని తైమూర్ చెప్పారు. 'అరబ్ స్ప్రింగ్' తరువాత రోడ్లపై నిరసనలు చేయడంపై ఆయా దేశాలు ఆంక్షలు విధించాయి.
 
పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేయడానికి ఈ రాచరికపు ప్రభుత్వాలు ఒకప్పుడు అనుమతిచ్చేవి. కానీ, ప్రస్తుతం ఆ నిరసనలు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని భయపడుతున్నాయి. ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా, సిరియా, బహ్రెయిన్, మొరాకో తదితర దేశాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ హక్కుల కోసం, ప్రజాస్వామ ప్రభుత్వ పాలన కోసం డిమాండ్లు చేస్తున్నారు. “అరబ్ స్ప్రింగ్ వంటి భారీ తిరుగుబాటు ఇక్కడ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఆయా దేశాల ప్రాధాన్యాలను మార్చేసింది. అనేక పాత ప్రభుత్వాలు కూలిపోయాయి, మిగతావాళ్లు కూడా తమకు ఇదే పరిస్థితి తలెత్తవచ్చని భయపడుతున్నారు. దీంతో రక్షణ కోసం పక్క చూపులు చూస్తున్నారు.ఈ ప్రాంతంలో తమను తాము కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ సాయం చేస్తుందని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు” అని తైమూర్ వెల్లడించారు.
 
అరబ్ స్ప్రింగ్ తరువాత కొన్నాళ్లకు బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. దీనికి మధ్యవర్తిగా అమెరికా వ్యవహరించింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసెస్ ప్రోగ్రాంను ఉపయోగించి గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు మొరాకో, ది అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలను ఇరకాటంలోకి నెట్టాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 2017లో ఈ ప్రోగ్రామ్‌ను సౌదీ అరేబియా కొనుగోలు చేసింది. అయితే, తరువాతి సంవత్సరం ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కాన్సులేట్‌లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య తరువాత ఆ సాఫ్ట్‌వేర్‌ యాక్సెస్‌ను కట్ చేయాల్సి వచ్చింది.
 
కానీ, యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి తిరిగి ఆ సాఫ్ట్‌వేర్‌ను పొందారు. జాతీయ ప్రయోజనాలతో పాటు ఇంకొక అంశం కూడా పాలస్తీనా సమస్య నుంచి అరబ్ దేశాలు దూరంగా ఉండేలా చేస్తోంది. అది.. ఆయా దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగిపోవడం.
 
ఇరాన్ పాత్రపై ఆందోళనలు
‘ఇరాన్‌తో హమాస్, హిజ్బుల్లాలు సంబంధాలు ఏర్పరుచుకోవడంతో ఆ సంస్థలపై అరబ్ దేశాలు అనుమానంగా ఉన్నాయి. ఎందుకంటే, గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ కంటే ఎక్కువ ముప్పు ఇరాన్‌తోనే.ఈ ప్రాంతంలో మతపరంగా చిచ్చు పెట్టేందుకు ఈ ఘర్షణలను ఇరాన్ ఓ సాధనంగా వాడుకుంటుంది. అంతేకానీ, పాలస్తీనాకు మంచి చేయడానికి కాదన్న అమెరికా, ఇజ్రాయెల్ ప్రచారాన్ని అరబ్ దేశాలు నమ్ముతున్నాయి’ అని తైమూర్ అన్నారు.
 
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పత్రికలు అరబ్ అంతటా ఈ వెర్షన్‌ను ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. “ఉదాహరణకు చూసుకుంటే సౌదీ మీడియా ఆందోళన పాలస్తీనా గురించి కాదు, ఈ ప్రాంతంలో ఇరాన్ ఆధిపత్యం గురించి” అని ప్రొఫెసర్ వలీద్ చెప్పారు. “ప్రస్తుతం హమాస్‌కు అన్ని రకాలుగా ఇరాన్ సాయం చేస్తోంది. కానీ, ఈ గ్రూప్ ఏర్పడిన మొదట్లో అనేక అరబ్ దేశాలతో మంచి సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం, ఇజ్రాయెల్‌తో పోరాటం చేసేందుకు హమాస్‌కు ఆయుధాలు ఇవ్వడానికి అరబ్ దేశాలు నిరాకరిస్తున్నాయి” అని తైమూర్ అన్నారు.
 
ఇరాన్ సహకారంతో పాలస్తీనాకు మద్దతుగా నిలవాలనుకుంటున్న హిజ్బుల్లా వంటి గ్రూపులకు కూడా ఇదే వర్తిస్తుంది. “ఇరాన్ తమకు మద్దతిస్తుందా లేదా అన్నది అరబ్ ప్రజలు పెద్దగా పట్టించుకోరు. నా అభిప్రాయం ప్రకారం కొన్ని అరబ్ ఉద్యమ సంస్థలు పాలస్తీనాకు మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో హిజ్బుల్లా, హూతీలతో పాటు యెమెన్, ఇరాక్‌లలోని కొన్ని షియా గ్రూప్స్ ఉన్నాయి” అని ప్రొఫెసర్ వలీద్ చెప్పారు.
 
మారుతున్న యువతరం ఆలోచనలు
భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు.. అరబ్ దేశాల సంక్షోభాలను పక్కన పెడితే పాలస్తీనా సమస్య కూడా కాలంతో పాటు మరిచిపోతున్నారు. ఒకప్పుడు పశ్చిమాసియా దేశాలను కొట్టుకునేలా ప్రేరేపించిన అరబ్ జాతీయవాదం వంటి భావజాలాలు చరిత్రలో కలిసిపోయాయి. “ ఈ ప్రాంతంలోని చాలా మంది యువత పాలస్తీనా పట్ల సానుభూతి చూపిస్తున్నారు. కానీ, ఈ పరిస్థితికి గల కారణాలు ఏంటో వాళ్లకు తెలియదు. ఎందుకంటే వాళ్ల పాఠ్యపుస్తకాల్లో దీని గురించి రాయలేదు కదా! మారుతున్న ప్రపంచీకరణతో సమాజం, అస్తిత్వాలను చూసే కోణం కూడా మారుతుంది” అని తైమూర్ తెలిపారు.
 
కొత్త నాయకుల రాకతో ఈ తరహా మార్పులు కనిపిస్తున్నాయి. “ఉదాహరణకు గల్ఫ్ దేశాలను చూస్తే, అక్కడంతా కొత్త తరం నాయకులే ఉన్నారు. పశ్చిమ దేశాలలో చదువుకున్న సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాలస్తీనాను ఓ సమస్యగా చూడట్లేదు” అని తైమూర్ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు