కరోనా‌వైరస్‌: భారత్‌‌లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?

శనివారం, 30 మే 2020 (14:09 IST)
పైకి చూడటానికి పరిస్థితి మరీ అంత చెడ్డగా కనిపించడం లేదు. జనవరి చివరన తొలి కోవిడ్‌-19 కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో 150,000 పైగా పాజిటివ్‌ కేసులు బైటపడ్డాయి. వారిలో 4000 మందికి పైగా ప్రజలు వైరస్‌ బారిన పడి చనిపోయారు.

 
మే 22 తేదీ నాటికి, ఇండియాలో పాజిటివిటీ రేటు సుమారు 4%గా ఉంది. ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణాలు 3%గా ఉన్నయి. ఇక ఇన్ఫెక్షన్‌ డబ్లింగ్‌ రేటు అంటే కరోనా కేసులు పాజిటివ్‌ కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం 13 రోజులుగా నమోదయింది. ఇన్‌ఫెక్షన్‌ నుంచి రికవరీ రేటు అంటే కోలుకునే రోగుల శాతం 40%గా రికార్డయింది. కోవిడ్‌-19 మహమ్మారి బారినపడి బాగా దెబ్బతిన్న దేశాలతో పోలిస్తే ఈ గణాంకాలు చాలా తక్కువ.

 
ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే ఇండియాలో కూడా ఇన్‌ఫెక్షన్‌ కోసం హాట్‌స్పాట్‌లు, క్లస్టర్లుగా విభజన జరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన వాటిలో 80% కేసులు ఐదు రాష్ట్రాల నుంచే నమోదయ్యాయి. అవి మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లు. అందులోనూ 60 % కేసులు ఐదు నగరాలలోనే అంటే ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్‌ లాంటి నగరాల నుంచే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా చనిపోయిన వారిలో సగం మంది 60 ఏళ్లకు పైబడ్డ వారే. వృద్ధాప్యంలో ఉన్నవారే ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావానికి లోనవుతారని ప్రపంచవ్యాప్తంగా వెల్లడవుతున్న గణాంకాలు కూడా చెబుతున్నాయి.

 
రెండు నెలలకు పైగా సాగిన లాక్‌డౌన్‌ కారణంగా 37,000 నుంచి 78,000 మంది ప్రాణాలను రక్షించినట్లయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హార్వర్డ్‌ డేటా సైన్స్‌ రివ్యూ విడుదల చేసిన నివేదిక కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఎనిమిది వారాల లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 20 లక్షల కేసులను, 3% మరణాల రేటును తగ్గించగలిగారు. అంటే 60,000 మంది ప్రాణాలను రక్షించినట్లు ఆ నివేదిక అంచనా వేసింది.

 
''ఇన్‌ఫెక్షన్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగాం. అందుకే ధైర్యంగా మిగిలిన ప్రాంతాలను ఓపెన్‌ చేయగలిగాం. ఇది ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది'' అని మెడికల్ ఎమర్జెన్సీ ప్లాన్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న వి.కె.పాల్‌ అన్నారు. అయితే ఇప్పుడీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇండియా అత్యధిక కేసులు నమోదైన టాప్‌-10 దేశాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. కొత్తగా కేసులో ఎక్కువగా నమోదవుతున్న దేశాలలో టాప్‌-5లో నిలిచింది. దేశంలో ఇన్‌ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి.

 
ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతున్న సమయంలో అంటే మార్చి 25 నాటికి 536 కేసులు మాత్రమే ఉన్నాయి. టెస్టులు జరుగుతున్న కొద్దీ వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ నాటికి టెస్టులు రెట్టింపుకాగా, పాజిటివ్‌ కేసులు నాలుగింతలయ్యాయి. టెస్టుల సంఖ్య పెరుగుతుండటం వల్లే పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోందని వ్యాధి నిపుణులు అంటున్నారు. గత వారం రోజులలో భారత్‌లో 1,00,000 టెస్టులు జరిగాయి.

 
పరీక్షలు నిర్వహించే నిబంధనలు కూడా మారాయి. పాజిటివ్‌ వ్యక్తులతో సంబంధం ఉండి, వ్యాధి లక్షణాలున్నవారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే తలసరిగా చూస్తే ప్రపంచంలో అతి తక్కువ టెస్టులు జరుగుతున్న దేశం భారత్‌. ప్రతి పది లక్షల మందిలో 2,198 మందికి మాత్రమే టెస్టులు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ మొదలై, మార్చి చివరికి వచ్చేసరికి వలస కూలీల సమస్య మొదలైంది. వారంతా ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి నగరాలను వదిలి ఇంటిబాట పట్టారు. కాలి నడకన కొందరు, రైళ్లెక్కి కొందరు ప్రయాణాలు మొదలుపెట్టారు. గత మూడు వారాలలో దాదాపు 40 లక్షల మంది వలస కూలీలు రైళ్ల ద్వారా ఆరుకు పైగా రాష్ట్రాలలో ఉన్న తమ గ్రామాలకు పయనమైనట్లు అంచనా.

 
పట్టణాల నుంచి గ్రామాలకు ఈ వైరస్‌ పాకింది అనడానికి ఇదే రుజువున్నవిషయం వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ నెల ఆరంభంలోనే లాక్‌డౌన్‌ నిబంధనలు కాస్త సడలించడంతో నగరాలలో ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నా, మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం అవి ఎక్కువగా యువతరంలోనే కనిపించడం ఒకటి. అందులోనూ రోగ లక్షణాలున్న కేసులే కావడం గమనించాల్సిన విషయం. నీతి ఆయోగ్‌ సీఈవో మాటల్లో చెప్పాలంటే ''మరణాల రేటును తగ్గించడం, రికవరీ రేటును పెంచడం'' అన్నదే ప్రధానమైన అంశం.

 
కానీ ఇన్‌ఫెక్షన్‌ రేటు ఇలాగే పెరిగిపోతే కష్టమంటున్నారు నిపుణులు. ''రాబోయే రోజుల్లో పరిస్థితులు చేయిదాటిపోతాయి'' అని ప్రముఖ వైరాలజిస్టు నాతో అన్నారు. ఢిల్లీ, ముంబయి నగరాలలో కేసులు ఇప్పటికే వేగంగా పెరుగుతున్నాయని కొందరు డాక్టర్లు నాతో చెప్పారు. అత్యవసర కేసులతో పాటు, కోవిడ్‌-19 చికిత్సల కోసం ఆసుపత్రులతో బెడ్‌ల కొరత ఏర్పడుతోందని వారు వెల్లడించారు. జులైలో ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుందంటున్నారు.

 
ఈ సందర్భంలో ఆసుపత్రులో కోలుకుంటున్నరోగుల కోసం ఆక్సిజన్‌ లాంటి సౌకర్యాలు లేకపోయినా, చికిత్సలో ఆలస్యం జరిగినా, అత్యవసర చికిత్స అందించలేక పోయినా నివారించగలిగిన మరణాలు పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ''ఇప్పుడు ఇదొక పెద్ద సమస్య కాబోతోంది. ఒక అత్యవసర సేవా విభాగంలో ఒక ఆక్సిజన్‌ లైన్‌, ఒక వెంటిలేటర్‌, డాక్టర్లు, నర్సులు ఉండాలి. వారంతా చాలా ఒత్తిడిలో ఉంటారు'' అని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్‌-19 వార్డును మేనేజ్‌ చేస్తున్న డాక్టర్‌ రవి దోషి నాతో అన్నారు.

 
ఇప్పుడు ఆయన ఆధ్వరంలో ఉన్న 50 పడకల ఐసీయూ, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్న రోగులతో పూర్తిగా నిండిపోయింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో డాక్టర్లకు ఇబ్బందిగా మారింది. ''చాలామంది అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు బయటకు వెళుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం'' అన్నారు దోషి. ''ఆఫీసులో ఒక్కరు తుమ్మినా, చీదినా 10-15మంది సహోద్యోగులు భయపడిపోతారు. వారు ఆసుపత్రికి వచ్చి తమకు టెస్ట్‌ చేయమని డిమాండ్‌ చేస్తారు. ఇలా ఒత్తిడి పెరిగిపోతుంది'' ఆయన అన్నారు.

 
ఈ మహమ్మారికి సంబంధించి సరైనా డేటా లేకపోవడం లేదా అందుబాటులో ఉన్న డేటా అస్పష్టంగా ఉండటం వల్ల అయోమయం ఏర్పడుతోంది. దీనివల్ల కింది స్థాయిలో ప్రతిస్పందించడానికి, వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వ్యాధి వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండటంతో, లాక్‌డౌన్‌ విధించడం లేదంటే తొలగించడం లాంటి ఒకే తరహా వ్యూహాలు పని చేయవు. మహారాష్ట్రలో ప్రతి 100 టెస్టులలో పాజిటివ్‌ కేసుల సంఖ్య జాతీయ సగటుకన్నా మూడు రెట్లు అధికంగా ఉంది.

 
''ఈ వైరస్‌ ఒకే తీరులో వ్యాపించడం లేదు. ఇండియా ఇంకా అలలుగా వ్యాధి వ్యాప్తిని చూడబోతోంది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని వైరాలజిస్టు ఒకరు నాతో చెప్పారు. డేటాలో అస్పష్టత ఉందంటే అనుమానాలు పెరుగుతున్నట్లే ఏ రాష్ట్రం పట్టించుకోని కేసులు 3,000 వరకు ఉన్నాయి. ఎందుకంటే వీరిలో చాలామంది వైరస్‌ పీడితులు తాము నివాసం లేని ప్రాంతంలో మహమ్మారి బారిన పడ్డారు. (ఇవన్నీ ఇండియాలోని తొమ్మిది రాష్ట్రాలలో నమోదైన కేసులు). వీరిలో ఎంత మంది వ్యాధి నుంచి బైటపడ్డారో, ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ తెలియదు.

 
అంతేకాదు.. ‘‘ఇప్పుడున్న డేటాతో ఎక్కడెక్కడ వ్యాధి ఏ స్థాయిలో ఉందో చూసి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అంచనా వేయడం సాధ్యం కాదు. అసలు లక్షణాలు లేకుండా వ్యాధివ్యాప్తికి కారణమవుతున్నవారిని గుర్తించే మార్గమే లేదు. ప్రతి 100 కోవిడ్‌-19 కేసుల్లో 80 మంది ఎలాంటి లక్షణాలు లేనివాళ్లో, లేదంటే కొద్దిపాటి లక్షణాలున్నవారో కనిపిస్తారు" అని సీనియర్‌ ప్రభుత్వ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.

 
ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉన్నమాట వాస్తవమే కావచ్చు. ''వ్యాధి లక్షణాలు లేని రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ వ్యాధి వ్యాప్తి గుర్తింపు కష్టమవుతుంది" అని స్టాటిస్టిక్స్‌ ప్రొఫెసర్‌ అటను బిశ్వాస్‌ అంటున్నారు. ఇలా డేటా అందుబాటులో లేకపోతే ఇండియా ఏమీ చేయలేదు. వ్యాధివ్యాప్తి రెట్టింపు, వ్యాధి పునరుత్పత్తి లేదా R-0 (ఆర్‌నాట్‌) అంచనాలకు కూడా కొన్ని పరిమితులున్నాయి. R-0 లేదా R విలువ అంటే వ్యాధివ్యాప్తి చెందే సామర్ధ్యానికి ఇచ్చే రేటింగ్‌.

 
ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనావైరస్‌’కు పునరుత్పత్తి రేటు సుమారు 3 దాకా ఉంది. కానీ ప్రస్తుతం అందుతున్నఅంచనాలు వాటికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ''మహమ్మారి వ్యాప్తి మొదలైన కొన్నాళ్ల తర్వాత ఈ అంచనాలు సరిగ్గానే ఉన్నాయి. కొన్ని కేసుల్లోనే అనుకున్నంత స్థాయిలో లేవు. వైద్య సదుపాయాలను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజుల ప్రణాళికలకు సరిపడా ముందస్తు అంచనాలు అవసరం ఉంటుంది. ఒకటి రెండు గణాంకాలతో కాకుండా సమగ్రమైన డేటా అవసరం'' అని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌లో బయోస్టాటిస్టిక్స్‌ అండ్‌ ఎపిడెమాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న భ్రమర్ ముఖర్జీ నాతో అన్నారు.

 
ప్రతిరోజూ నమోదవుతున్న పాజిటివ్‌ కేసులను లెక్కించడం కూడా "ఇన్ఫెక్షన్‌ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోడానికి పనికి వచ్చే అంశం కాదు'' అంటారు కొందరు. దీనికన్నా ప్రామాణీకరణ కోసం ప్రతి రోజూ జరుగుతున్న టెస్టులు, నమోదవుతున్న కేసులను పరిశీలించడం మంచి ఆప్షన్‌'' అని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌ కె.శ్రీకాంత్‌రెడ్డి నాతో అన్నారు. అలాగే, దేశ జనాభాతో పోలిస్తే ప్రతి రోజు ఎన్ని కోవిడ్‌-19 మరణాలు నమోదవుతున్నాయి, పది లక్షల మందిలో మరణాలెన్ని అన్నగణాంకాలను పరిశీలించడం వల్ల మరణాల రేటు మీద స్పష్టత వస్తుంది.

 
సరైన డేటా లేకపోవడం వల్ల భవిష్యత్తులో వ్యాధివ్యాప్తి తీవ్రత ఎలా ఉంటుందో అంచనా వేయటానికి ఇండియా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. ‘‘కనిపించని మరణాలు’’ భారీ సంఖ్యలో ఉన్నాయని చెప్పటానికి ఆధారాలేమీ లేకపోయినా.. ఎన్ని మరణాలు నమోదు కావటం లేదనే దాని మీద కూడా స్పష్టత ఉన్నట్లు కనిపించటం లేదు. కోవిడ్‌-19 మరణాలను అంచనా వేయడానికి తాము గత కొన్నేళ్లుగా ఈ సమయంలో న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా లాంటి వ్యాధుల కారణంగా సంభవించిన మరణాల సంఖ్యలను కూడా పరిశీలించాలనుకుంటున్నామని ఎపిడెమాలజిస్టులు చెబుతున్నారు.

 
అలాగే వివిధ వర్గాలకు చెందిన ప్రజల్లో ఇన్ఫెక్షన్‌ ఎలా వ్యాప్తి చెందుతోంది, మరణాలు ఎలా ఉన్నాయన్నది కూడా పరిశీలించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఒక ప్రత్యేక సమాజంలో వ్యాధిని కట్టడి చేయడానికి అవకాశం కలుగుతుంది. (ఉదాహరణకు లూసియానాలో ఆఫ్రికన్‌ అమెరికన్‌లలో కోవిడ్‌-19 మరణాలు 70% ఉన్నాయి. కానీ వారి జనాభా మాత్రం 33 శాతమే ఉంది.) టెస్టులకు అవకాశాలు ఇంకా తక్కువగానే ఉండటం వల్ల వ్యాధి వ్యాప్తి ఎలా ఉందో తెలుసుకోనేందుకు ఇండియా ఇబ్బందులు పడుతోందని ఎపిడెమాలజిస్టులు అంటున్నారు.

 
''రాబోయే కొద్ది వారాల్లో దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ వ్యాధివ్యాప్తి తీవ్రతను అంచనా వేయడానికి సమగ్రమైన పద్ధతి అవసరం'' అని డాక్టర్‌ ముఖర్జీ అన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి, లేనివారికి మరిన్ని టెస్టులు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఇండియాలో ఇప్పుడు అత్యవసరమని ఎపిడెమాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఐసోలేషన్‌, క్వారంటైన్‌లు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు.

 
కాంటాక్ట్ నెట్‌వర్క్‌ను బట్టి కూడా టెస్టులు అవసరం ఉంది. ముందు వరుసలో పనిచేస్తున్న వారు, సరఫరాలు అందిస్తున్నవారు, అత్యవసర సేవకులు ఇలా వివిధ వర్గాల ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే వ్యక్తులకు టెస్టులు చేయడంవల్ల వ్యాధి వేగంగా వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. ''వైరస్‌ నిత్యం మనతోనే ఉండబోతోంది. కాబట్టి మనం రిస్క్‌ను ఎలా మేనజ్‌ చేయాలో నేర్చుకోవాలి'' అని డాక్టర్‌ ముఖర్జీ అన్నారు.

 
ఎంతమంది నిజంగా వ్యాధిబారిన పడుతున్నారో తెలియకుండా వ్యాధిని అరికట్టడానికి ప్రయత్నించడం అంటే కళ్లకు గంతలు కట్టుకుని గాల్లోకి ఎగరడమే అంటున్నారు ఎపిడెమాలజిస్టులు. పరిస్థితులు ఇలాగే ఉంటే, వైరస్‌తో పోరాటం, దెబ్బతిన్న దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడం ఇండియాకు కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు