రామ్‌చరణ్ తదుపరి జేమ్స్‌బాండ్ అవుతారా? హాలీవుడ్ రైటర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో హంగామా

శుక్రవారం, 29 జులై 2022 (15:41 IST)
జేమ్స్‌బాండ్ పాత్రకు తెలుగు సినీ నటుడు రామ్‌చరణ్ చక్కగా సరిపోతారని మార్వెల్ 'ల్యూక్ కేజ్' టెలివిజన్ సిరీస్ సృష్టికర్త చియో హోదరి కోకర్ అన్నారు. గత ఏడాది వచ్చిన 'నో టైమ్ టు డై' చిత్రం తరువాత జేమ్స్‌బాండ్ పాత్ర నుంచి రిటైర్ అవుతున్నట్లు డేనియల్ క్రెయిగ్ ప్రకటించారు. దాంతో, తదుపరి జేమ్స్‌బాండ్ ఎవరన్న చర్చ మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ నటన చూసిన తరువాత 007 పాత్రకు అతను బాగా సూట్ అవుతారని కోకర్ ట్వీట్ చేశారు.

 
ఆయన తన ట్వీట్‌లో జేమ్స్‌బాండ్ పాత్రకు పోటీ పడదగిన నటుల జాబితాను ఇచ్చారు. వారిలో రామ్‌చరణ్ కూడా ఉన్నారు. తదుపరి బాండ్ ఎవరంటూ ఇలా కొన్ని పేర్లు ట్వీట్ చేసిన కోకర్ ఆ తరువాత మరో ట్వీట్ చేశారు. "బాండ్ పాత్రకు పోటీలో ఇడ్రిస్ ఎల్బా ఉన్నారని అందరికీ తెలిసిందే. కానీ, 'గ్యాంగ్స్ ఆఫ్ లండన్'లో నటించిన సోపె డిరిసు, 'ద ఆఫర్' నటుడు మాథ్యూ జి, 'స్నోఫాల్' సిరీస్‌తో ఆకట్టుకున్న డామ్సన్ ఇడ్రిస్, 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని రామ్ జేమ్స్‌బాండ్‌ సూట్ వేసుకుని 'వాల్థర్ పిపికె' పిస్టల్‌తో కెమేరా ముందు యాక్షన్ చేయడానికి బాగా సూట్ అవుతారని నాకనిపిస్తోంది" అని తన రెండో ట్వీట్‌లో కాస్త వివరంగా రాశారు.

 
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' సినిమాపై 'డాక్టర్ స్ట్రేంజ్' స్క్రీన్ రైటర్ రాబర్ట్ కార్గిల్, మార్వెల్ కామిక్స్ 'కెప్టెన్ అమెరికా అండ్ కాంగ్' రచయిత జాక్సన్ లాంజింగ్ గతంలో ప్రశంసలు కురిపించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ పాత్రలను తీసుకుని కల్పిత స్వతంత్ర పోరాటగాథను రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని తెరకెక్కించారు. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ఆర్ఆర్ఆర్'కు రూ. 1,200 కోట్లు కలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

 
హాలీవుడ్‌ రచయిత, టీవీ నిర్మాత అయిన చియో హోదరి కోకర్ 'ల్యూక్ కేజ్' సిరీసి‌కు ముందు 'ఎన్‌సిఐఎస్: లాస్ ఏంజెలిస్, ఆల్మోస్ట్ హ్యూమన్ టీవీ చిత్రాల రచయితగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆయన రామ్‌చరణ్ మీద చేసిన ట్వీట్ శరవేగంగా వైరల్ అయిపోయింది. రామ్‌చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో దీనిపై పండగ చేసుకున్నారు. కొంతమంది ఆయనను 'కింగ్ ఆఫ్ టాలీవుడ్' అని అభివర్ణించారు. రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు, ఆయన గత చిత్రాల్లోని స్టిల్స్ షేర్ చేశారు. కొందరైతే చరణ్‌ను బాండ్‌గా చూపిస్తూ ఫ్యాన్-పోస్టర్స్ తయారు చేసి షేర్ చేశారు. నో టైమ్ టు డై సినిమా పోస్టర్ మీద క్రెయిగ్‌కు బదులుగా రామ్‌చరణ్‌ను చూపిస్తూ చేసిన గ్రాఫికల్ పోస్టర్ వైరలైపోయింది.

 
జేమ్స్‌బాండ్‌గా తన 16 ఏళ్ల కెరియర్‌కు ముగింపు పలుకుతున్నానని డేనియల్ క్రెయిగ్ గత ఏడాది ప్రకటించారు. 'నో టైమ్ టు డై' క్రెయిగ్ నటించిన చివరి బాండ్ మూవీ. దాంతో, కొత్త బాండ్ ఎవరనే అన్వేషణ మొదలైంది. ఈ ఏడాదిలోనే క్రెయిగ్ వారసుడు ఎవరన్నది తేలిపోతుందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. "జేమ్స్‌బాండ్ అంటే రెడ్ కార్పెట్ మీద సూట్ వేసుకుని స్టైలిష్‌గా నడుస్తూ, రిస్ట్ వాచీలకు మాడలింగ్ చేసే వ్యక్తి మాత్రమే కాదు. ఆయన ప్రపంచ సినిమాకే రాయబారి. ప్రపంచ స్థాయిలో జరిగే వేల కోట్ల వ్యాపారానికి ఒక ముఖచిత్రం" అని 'క్యాచింగ్ బులెట్స్: మెమాయిర్స్ ఆప్ ఎ బాండ్ ఫ్యాన్' పుస్తక రచయిత మార్క్ ఓ'కానెల్ గతంలో బీబీసీతో అన్నారు.

 
"అయితే, బాండ్ రంగు ఏదైనా కావచ్చు. కానీ, బాండ్ అంటే మగవాడు. మహిళ కాదు. మహిళను బలమైన పాత్రలో చూపించవచ్చు. కానీ, పురుషుల క్యారెక్టర్లలో మహిళను చూపించడం నాకు ఇష్టం లేదు" అని జేమ్స్‌బాండ్ చిత్ర నిర్మాత బార్బరా బ్రకోలి 2020లో అన్నారు. ఈ పాత్రకు మొదట్ టామ్ హార్డీ పేరు కూడా వినిపించింది. వెనమ్, డన్‌కర్క్ వంటి చిత్రాలతో హార్డీ మంచి గుర్తింపు సంపాదించారు. అయితే, ఆయన వయసు 45 ఏళ్ళు కావడంతో డేనియల్ క్రెయిగ్ లాగా పదిహేనేళ్లకు పైగా బాండ్ పాత్రలో కొనసాగగలరా అన్న ప్రశ్న వినిపించింది. ఇప్పుడు చియో హోదరి కోకర్ ప్రస్తావించిన ఇడ్రిస్ ఎల్బాకు కూడా వయసే సమస్య. 'ది వైర్' చిత్రంలో స్ట్రింజర్ బెల్‌గా ఆయన చూపిన అభినయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. కానీ, ఆయన వయసు ఇప్పుడు 50 ఏళ్ళు.

 

Damn! That escalated quickly. Everyone knows Idris from, well, everything, but to get inside my thinking, watch Sope in "Gangs Of London," Matthew G in "The Offer", Damson in "Snowfall" and Ram in "RRR". They all deserve a shot at a Savile Row suit and a Walther PPK. https://t.co/8ZGV4UFd9P

— Cheo Hodari Coker (@cheo_coker) July 27, 2022
రామ్‌చరణ్ కనుక ఈ పాత్రకు ఎంపికైతే ఆయన ఏడవ జేమ్స్‌బాండ్‌ అవుతారు. అంతేకాదు, అంతటి పాపులర్ స్పై పాత్రకు ఎంపికైన తొలి భారతీయ నటుడిగా రికార్డ్ సృష్టిస్తారు. షాన్ కానరీ, జార్జ్ లేజెన్బీ, రాజర్ మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డానియెల్ క్రెయిగ్‌ల తరువాత ఆ అవకాశం రామ్‌చరణ్‌కు దక్కుతుందా అన్నది వేచి చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆర్‌సి-15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు