నూతన దంపతుల స్వర్గధామం "పట్నీటాప్"

నవ దంపతులకు బెస్ట్ హనీమూన్ స్పాట్‌లలో చెప్పుకోదగ్గది "పట్నీటాప్ హిల్ స్టేషన్". ప్రకృతి రమణీయతకు అద్దంపడుతూ, ఎన్నో ప్రత్యేకాంశాలను తనలో దాచుకున్న ఈ పర్యాటక ప్రాంతం... భారతదేశం సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో నెలకొని ఉంది. ప్రకృతి అందాల నిలయమైన ఈ ప్రదేశం గురించిన వివరాలను తెలుసుకుందామా..?

పట్నీటాప్ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలంటే... జమ్మూ దాకా విమానంలో ప్రయాణించవచ్చు. అదే రైలు ప్రయాణం అయితే... దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి జమ్మూ వరకు రైళ్లు ఉన్నాయి. జమ్మూనుంచి పట్నీటాప్‌కు వెళ్లాలంటే.. ట్యాక్సీలు, బస్సులు ఉంటాయి. ట్యాక్సీలకయితే, పదిహేను వందల నుంచి 18 వందల దాకా ప్రయాణ ఛార్జీలు ఉంటాయి. ట్యాక్సీ ప్రయాణం మూడు గంటలు కాగా, బస్సు ప్రయాణం ఐదు గంటల సమయం పడుతుంది.

పట్నీటాప్‌ హిల్‌స్టేషన్‌కు ఏ కాలంలోనయినా వెళ్లవచ్చు. అయితే మే నుంచి జూన్ అలాగే సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్యకాలంలో అయితే ఆ ప్రాంతం చాలా బాగుంటుంది. మంచుతో ఆడుకుందామని అనుకునేవారు మాత్రం డిసెంబర్‌ నుంచి మార్చి నెలల్లోపు వెళ్తే మంచిది.

వసతికి సంబంధించి చూసినట్లయిచే... జమ్మూ, కాశ్మీర్‌ పర్యాటక విభాగం ఆధ్వర్యంలో అనేక టూరిస్ట్ బంగ్లాలు, కాటేజీలు ఉన్నాయి. డ్రాయింగ్‌, డైనింగ్‌ రూములు, అన్ని సౌకర్యాలతో కిచెన్‌, ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌లతో సహా ఇవి ఉంటాయి. వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ముందుగానే బంగ్లాని రిజర్వు చేయించుకోవాల్సి ఉంటుంది.

చలికాలం వచ్చిందంటే చాలు... పట్నీటాప్ హిల్‌ స్టేషన్‌లో సాహసాలు చేసేందుకు ఇష్టపడేవారితోనూ... కొత్తగా పెళ్లయినవారితోనూ కళకళలాడుతూ ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలలో స్కైయింగ్ క్యాంపులు, వేసవిలో ట్రెక్కింగ్ క్యాంపులతో ఈ ప్రాంతమంతా చాలా హడావిడిగా ఉంటుంది. ఇటీవలనే ఈ పట్నీటాప్‌లో పారాగ్లయిడింగ్ ప్రారంభమయ్యింది. త్వరలోనే పారాసెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్‌లను కూడా పర్యాటకశాఖ ప్రవేశపెట్టనుంది.

ఇదిలా ఉంటే... దేవాలయాల నగరమైన జమ్మూలోని ఆకర్షణల విషయానికి వస్తే... అక్కడి రాజప్రసాదాలు, కోటలు, అందమైన అడవులతో పాటు జమ్మూవాసులు ఎంతో భక్తిగా కొలుచుకునే బహుమాత ఆలయం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే, పీర్‌బుధాన్ అలీ షా దర్గాను కూడా జమ్మూ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

అలాగే త్రికూట కొండలపై నెలకొన్న వైష్ణోదేవి... తవినది ఎడమ ఒడ్డున కొండమీద ఉంటే కోటలోని బహుఫోర్ట్ ఆలయం, కొండ శిఖరాలనే కాకుండా కొండ కింద ఉండే బుద్ధ అమర్‌నాథ్ ఆలయం, జమ్మూకు పశ్చిమంగా 32 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రేమకథకు నిలయాలైన అక్నూర్, సోహ్ని, మహీవాల్‌లు... కోన్ ఆకారంలో ఉండే పచ్చటి మైదాన ప్రాంతం సన్సార్, కిష్టర్ మైదానం, ముబారక్ మండి పాలెస్, రఘునాథ్ ఆలయం, శుధ్‌ మహదేవ్‌ పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాలను వీక్షించవచ్చు.

శివరాత్రి పండగ సమయంలో జమ్మూ వెళ్లినట్లయితే... ఎక్కడ చూసినా ఉత్సవాలు కనిపిస్తాయి. స్థానిక చేతివృత్తులు, వంటలకు సంబంధించి మూడు రోజుల పాటు జరిగే "మన్సార్‌ ఫుడ్‌ అండ్‌ క్రాఫ్ట్" మేళాలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎందరో పాల్గొంటారు. వసంతం ఆగమనాన్ని సూచిస్తూ "లోహ్రి ఉత్సవం" జరుగుతుంది. ఈ ఉత్సవం నాడు మొత్తం జమ్మూ అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఏడాది వైశాఖ మాసం మొదటి రోజున వైశాఖి పూర్ణిమను జమ్మూ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

వెబ్దునియా పై చదవండి