పక్షి ప్రేమికులను ఆకట్టుకొనే భరత్‌పూర్ సంరక్షణ కేంద్రం

మంగళవారం, 4 అక్టోబరు 2011 (19:03 IST)
సృష్టిలో ప్రకృతి ఎంత అందమైనదో ఆ ప్రకృతిలోని చెట్లూ, కొండలు, లోయలు, పక్షులు, జంతువులు అన్నీ ప్రత్యేకమైనవే. అయితే మనకు తెలిసిన జంతువులు ఎన్ని? పక్షులు ఎన్ని? చెట్లు ఎన్ని? వివిధ రకాల పక్షులను చూడాలని భావించే వారు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పక్షుల సంరక్షణా కేంద్రానికి వెళ్లాల్సిందే.

ఈ పక్షుల సంరక్షణా కేంద్రంలో కనీసం 300లకు పైగా విహంగ జాతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పెయింటెడ్ స్టార్క్స్, స్పూన్ బిల్స్, ఎజ్‌రెట్స్, కార్మరాన్ట్స్, తెల్లటి ఇబీస్, జకానస్‌, హారియర్స్, ఫిషింగ్ ఈగిల్స్, పైడ్ కింగ్‌ఫిషర్ తదితరాలు. ఇరాన్, భారత్‌లలో చలికాలంలో మాత్రమే సైబేరియన్ కొంగ పక్షి కనిపిస్తుంది.

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్ని కాలాలలోనూ ఈ పక్షుల సంరక్షణా కేంద్రం తెరచి ఉంటుంది. శాంతి కుటీర్ వరకు అంటే 1.7 కి.మీ వరకు లోపలికి వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఉంది. ఇక్కడ్నుంచీ కాలినడక లేదా రిక్షాలలో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ప్రవహించే గంభీర్, బంగంగా నదులు ఏర్పరిచిన పల్లం కారణంగా ఆ ప్రాంతంలో వర్షాకాలంలో నీరు పేరుకుని పక్షులకు తాగునీరుగా ఉపయోగపడుతుంటూంది.

పూర్వకాలంలో భరత్‌పూర్ మహారాజు ఈ ప్రాంతంలో వేటకు వచ్చేవాడట. ఆ కాలంలో బ్రిటీషు వారికి కూడా ఈ ప్రాంతం చక్కని వేటాడే ప్రదేశంగా ఉండేది. ఆ తర్వాతి రోజుల్లో వేటను నిషేధించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో తిరిగి చెట్లను నాటే ఆచారం ప్రారంభమైంది. అయితే కొన్ని పక్షి జాతులు మాత్రం అంతరించిపోతున్నాయి.

వెబ్దునియా పై చదవండి