కనుమరుగైన "బంగారు బల్లి" ఇక్కడే ఉందట..!!

FILE
"అదివో అల్లదివో హరివాసము.. పదివేలు శేషుల పడగలమయము" అంటూ బాల అన్నమయ్య ఎనిమిది సంవత్సరాల వయస్సులో తొలిసారిగా తిరుమల కొండలను సందర్శించినప్పుడు.. ఆ బంగారు శిఖరాల సౌందర్యానికి ముగ్ధుడై, పరవశుడై ఆనంద తాండవం చేస్తూ పాడుకున్నాడట. తిరుమల గిరుల సౌందర్యాన్ని చూసిన ఎవరయినా అప్రయత్నంగా రాగాలను అందుకోవాల్సిందే మరి..! ఎన్నో ప్రసిద్ధ దైవ క్షేత్రాలను, జలపాతాలను, పవిత్ర తీర్థాలను తనలో ఇముడ్చుకున్న సహజసిద్ధమైన ఈ ఉద్యానవనంలో వన్యప్రాణులను రక్షించేందుకుగానూ ఆ దేవదేవుడి పేరుతో రూపుదిద్దుకున్నదే "శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు".

కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు అడవుల్లో 354 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించి ఉన్న తూర్పు కనుమలు, శేషాచల పర్వతాలలో... శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు సహజ సిద్ధంగా ఏర్పడింది. బ్రిటీషువారి కాలంలో తొలిసారిగా రూపొందిన అటవీ చట్టం ప్రకారం అటవీ సంరక్షణ జరిగినా.. జంతువుల వేట యధేచ్చగా కొనసాగినట్లు తెలుస్తోంది. ఆ తరువాత 1985వ సంవత్సరంలో అడవులను, వన్యప్రాణులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రం మొత్తంమీదా 20 అభయారణ్యాలు, 4 జాతీయ పార్కులను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఏర్పాటైనదే శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు.
FILE


పెంచిన చెట్లతో, బంధించిన జంతువులతో కాకుండా సహజసిద్ధంగా పెరిగిన చెట్లతో కూడిన అడవులు, ఆ అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే వివిధ రకాల జంతువులతో సహజ సిద్ధంగా రూపుదిద్దుకోవడమే ఈ పార్కు ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇందులో పదిహేను వందల రకాలైన.. ఎర్రచందన, తంబజాలం, మోజి, నల్లకరక, పెర్రీత, తెల్లకరక్కాయ లాంటి అరుదైన వృక్ష జాతులు.. 12 వందల రకాల పక్షి జాతులు ఉన్నాయి.

ప్రఖ్యాతిగాంచిన దైవక్షేత్రాలు, జలపాతాలు సైతం ఈ పార్కు పరిధిలోనే ఉన్నాయి. తలకోన, గుండాల కోన, గుంజన జలపాతం, కపిల తీర్థం.. లాంటి 350 పవిత్ర తీర్థాలు కూడా ఈ పార్కు కిందికే వస్తాయి. వీటిలో ముఖ్యంగా తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, సీతమ్మ తీర్థాలు ప్రధానమైనవి కాగా.. ప్రపంచంలో సంపన్నుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం కూడా ఈ జాతీయపార్కు పరిధిలోకే వస్తుంది.

అలాగే.. ప్రపంచంలో ఎక్కడా కనిపించనటువంటి, 120 సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని చెప్పబడుతున్న "బంగారు బల్లి" ఈ జాతీయ పార్కులోని శేషాచలం అడవుల్లో ఉన్నట్లు చెబుతుంటారు. ఇంకా అరుదైన దేవాంగ పిల్లి, మూషిక జింక, పెద్దపులి, చిరుతపులి, తోడేలు, రేచుకుక్కలు, ఎలుగుబంట్లు, క్రూరపంది, ఆలువ, అడవిపంది, గడ్డిజింక, కొండ గొర్రె, దుప్పి, కణితి తదితర జంతువులు ఈ జాతీయ పార్కులో స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి.

FILE
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేటగాళ్ళు "జిమ్ కార్బెట్, కెన్నత్ అండర్సన్"లు ఈ శేషాచలం అడవుల్లో పులులను వేటాడినట్లు చరిత్ర చెబుతోంది. దీనికి నిదర్శనంగా ఈ పార్కులోని "చేమలోయ"లో రేచుకుక్కలు పెద్దపులిని వెంబడించి.. వేటాడి, చీల్చి చెండాడి చంపినట్లు అండర్సన్ తన రచనల్లో పేర్కొన్నాడు.

అంతేగాకుండా.. మామండూరు, గుండాలకోన, గంధం చెక్కలకోన, తరువుకోన, కలవేటికోన, పులిబోనుమావి.. ప్రాంతాల విశిష్టతను గురించి కూడా ఆయన తన రచనల్లో వెల్లడించారు. అలాగే అనకొండ పామును పోలిన పెద్ద కొండ చిలువ ఈ అడవుల్లో ఉందని చెబుతుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం దాకా పైన పేర్కొన్నవన్నీ తిరుమలకు కాలినడకన వెళ్లేవారికి దర్శనమిచ్చేవట..!

ఇక ముఖ్యంగా... ఈ జాతీయ పార్కు పరిధిలోగల "గుంజన జలపాతం" తప్పకుండా చెప్పుకోవాల్సిందే. 260 అడుగుల ఎత్తుండే ఈ జలపాతం హొయల్ని చూసినవారికి ఆనందానికి అవధులే లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల జలపాతాల్లో ఎత్తైన జలపాతంగా కూడా పేరు సంపాదించిన ఈ జలపాతం వద్ద.. 36 తలలతో ఉండే ఈత చెట్టు ఓ ప్రత్యేక ఆకర్షణ.

భారతదేశంలో అంతరించిపోయిన "చీటా".. శ్రీ వేంకటేశ్వరా పార్కు పరిధిలోగల బాలపల్లె అడవుల్లో 1952వ సంవత్సరంలో చివరిసారిగా కనిపించినట్లు స్థానికుల కథనం. బ్రిటీషువారి కాలంలో అటవీ చట్టం అమలులో ఉన్నప్పటికీ వారు జంతువుల వద్ద నిలబడి ఫొటోలు తీసుకునేవారట. ఈ బాల పల్లె అడవుల్లో 1952 ప్రాంతంలో ఉన్న ఈ చీటాలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పరిగేత్తేవనీ.. ఇంకా వేగంగా పరిగెత్తే కృష్ణజింకను సైతం వేటాడే సత్తా ఈ చీటాలకు ఉండేదని అటవీ అధికారులు చెబుతుంటారు.

ఎలా వెళ్లాలంటే.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణం నుంచి పది కిలోమీటర్లమేర రోడ్డు ప్రయాణం చేసినట్లయితే శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కును చేరుకోవచ్చు. దీనికి సమీప విమానాశ్రయం తిరుపతి, లేదా రేణిగుంట. వసతి సౌకర్యాల విషయానికి వస్తే.. తిరుపతి, రాజంపేట, తలకోన, భాకరాపేటలలో అటవీశాఖ వారి విశ్రాంతి గృహాలలో బస చేయవచ్చు. సంవత్సరంలో ఏ నెలలో అయినా సరే ఈ పార్కును సందర్శించవచ్చు.

వెబ్దునియా పై చదవండి