కొబ్బరినీళ్లు మొటిమలను దూరం చేస్తాయి. అందుకే వేసవిలో రాత్రి నిద్రించేందుకు ముందు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి.. మొటిమలున్న చర్మంపై రాస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇలా రోజూ చేయడం వల్ల మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. కొబ్బరినీళ్లను ముఖమంతా రాస్తూ ఉంటే మురికి కూడా పోతుంది. సాధారణ నీటి కంటే కొబ్బరినీళ్లలో ముఖం కడిగితే తాజాదనం లభిస్తుంది.
చెంచా గంధం పొడి, అరచెంచా పసుపూ, తగినన్ని కొబ్బరినీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరాక కడిగేస్తే చక్కటి రంగు వస్తుంది. ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ట్యాన్‌ను తొలగించుకోవాలంటే.. రెండు చెంచాల కొబ్బరి నీళ్లలో చెంచా ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మీద పేరుకుపోయిన నలుపుదనం, నల్లమచ్చలు తగ్గిపోతాయి.
అలాగే సమపాళ్లలో కొబ్బరినీళ్లు, కీరదోస రసం, పచ్చిపాలు కలపాలి. దీన్ని ముఖానికి రాసి పది నిమిషాలపాటు వలయాకారంగా రుద్దుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.