తమిళపాకంలో తెలుగు తీపి... తమిళనాట తెలుగు సాహిత్య వ్యాస సంకలనం

శనివారం, 5 జనవరి 2013 (21:05 IST)
WD

తెలుగు వాళ్ళకు ఇష్టమైన పిండివంట అరిశె రుచిగా ఉండాలంటే పాకం కుదరాలి. పాకం కుదరడం, వంట చేసే చేతిపై ఆధారపడి ఉంటుంది. రచికరమైన అరిశెలను మళ్ళీ మళ్ళీ తింటాము. సాహిత్యం కూడా వంటలాంటిదే. వంట కుదిరితేనే రుచిగా ఉంటుంది. రుచికరమైన వంటను వడ్డించి తినమంటే, మనం తృప్తిగా తింటాం. ఆనందిస్తాం. అనుభూతిస్తాం. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటాం. తమిళనాడు తెలుగు సాహిత్యం సాహిత్య వ్యాస సంకలనం చదివాక రుచికరమైన అరిశెలు తిన్నంత అనుభూతి కలిగింది. తృప్తిగా భోంచేసినంత ఆనందం కలిగింది.

ఆ తృప్తి, అనుభూతికి ప్రధాన కారకులైన సంకలనంలోని వ్యాస రచయితలను, ఆణిముత్యాల్లాంటి వ్యాసాల్ని అందమైన పూలదండగా మార్చి, తెలుగుభారతి గళసీమలో అలంకరించిన సంపాదకులను, ప్రచురణ కర్తలైన జనని సాంస్కృతిక సమితి సారథులను తప్పక అభినందించాలి. ముఖ్యంగా గుడిమెట్ల చెన్నయ్య, ఉప్పలధడియం వెంకటేశ్వర గార్లను.
చెప్పగవలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు కుంకుంమపైపై
గుప్పిన క్రియ, విరిపోట్లము
విప్పిన గతి, ఘమ్మనం కవిత్వము సభలన్ - అన్న రఘునాథ నాయకుని పద్యం ఈ సంచిక విషయంలో సార్థకమవుతుంది. సంచిక తెరవగానే విరిపొట్లంలా సాహిత్య వాసనలు గుప్పుమన్నాయి. పుటలు తిప్పతుంటే పరిమళించే అక్షరాలు మనల్ని పలుకరిస్తాయి. అత్మీయంగా ఆలింగనం చేసుకుని, మనల్ని వ్యాసాల ప్రాంగణంలోకి ఆహ్వానిస్తాయి.

తెలుగులో సాహిత్య వ్యాస సంకలనాలు డజన్లకొద్దీ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రామాణికమైనవిగా పాఠకులకు, పరిశోధకులకు ఉపయోగపడుతున్నాయి. అలాంటి ప్రామాణిక వ్యాస సంకలనాల కోవకు చేరదగిన ఉత్తమ సంకలనం తమిళనాడు తెలుగు సాహిత్యం.

చెన్నైలో తెలుగు సాహిత్య వికాసం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం గత రెండు దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తోన్న సంస్థ జనని. జనని తన లక్ష్యసాధనలో ఎన్నో మైలురాళ్లను దాటింది. విజయం సాధించింది. మాతృభాషాభివృద్ధికి నడుంకట్టింది. తెలుగు పండుగలను నిర్వహిస్తూ మన సాంస్కృతీ సంప్రదాయాలను కొత్త తరానికి చాటి చెబుతోంది. అలాంటి జనని 20 ఏళ్ళ ప్రస్థానానికి అక్షర సాక్ష్యం ఈ విలువైన సంకలనం.

సంకలనంలో మొత్తం 19 వ్యాసాలున్నాయి. భాష, సాహిత్య రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులతో పాటు, వర్థమాన రచయితలు, పరిశోధక విద్యార్థులు వ్యాసాలను రాశారు. విషయ ప్రాధాన్యత దృష్ట్యా దేనికదే విలక్షణమైన వ్యాసం. ఇప్పటివరకు మనం చదవని విలువైన వ్యాసాలు కూడా ఉన్నాయి. అందులో కనుమరుగవుతున్న తెలుగు సంపద శీర్షికతో గొల్లపూడి మారుతీరావు గారు రాసిన వ్యాసానికి అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే. మారుతీరావు గారు ఈ తరానికి సినిమా నటులుగానే తెలుసు. నాటక రచయితగా కొద్దిమందికే తెలుసు, కానీ మనకు తెలియని మారుతీరావుగారు ఈ వ్యాసంలో హృదయవాదిగా, రససిద్ధులుగా కనిపిస్తారు. వారు సాహిత్యస్రష్ట మాత్రమే కాదు, సంగీత ప్రియులన్న విషయం ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది.

తమిళనాట సంగీత కచేరీల గురించి, వాగ్గేయకారుల గురించి రాస్తూ, అదో ప్రపంచం, అదో తన్మయత్వం అని అంటారు. ఏ విషయాన్నైనా అనుభూతి ప్రధానంగా చెప్పడం మారుతీరావుగారి ప్రత్యేకత. తమిళనాట తెలుగు వాగ్గేయకారుల గురించి రాస్తూ, అదో ప్రపంచం అదో తన్మయత్వం అని అంటారు. తమిళులు అపర త్యాగరాజుగా భావించే పాపనాశం శివన్ గురించి ప్రస్తావించి, తమిళుల సంగీతాభిమానాన్ని కొనియాడారు. ఎందరో తమిళులు తెలుగులో అద్భుత కీర్తనలు రాయడానికి మన త్యాగరాజు, శ్యామశాస్త్రి వంటివారు కారణమంటారు. తమిళనాడులో గంపలకెత్తుకుని, గాదెలకు పోయవలసిన సంకీర్తనా సంపదను పరిరక్షించుకోవలసిన బాధ్యత తెలుగువారిమీద, తెలుగు విశ్వవిద్యాలయాలు వంటి సంస్థల మీద వుందన్న గొల్లపూడివారి సూచన విస్మరించరానిది.

WD

డాక్టర్ యల్.బి.శంకరరావుగారు ఆచార్యులుగా, సాహిత్యవేత్తగా సుప్రసిద్ధులు. దక్షిణాంధ్ర యుగలక్షణాలు గురించి వారు రాసిన వ్యాసం ఎంతో విలువైనది. దక్షిణాంధ్రయుగంలో నాయకరాజుల పాలనను స్వర్ణయుగంగా పేర్కొన్న శంకరరావుగారు, ఆ యుగంలోని ప్రక్రియా వైవిధ్యాన్ని, సాహితీ విలక్షణాన్ని సోదాహరణంగా వివరించారు. అక్కాచెల్లెళ్ళలాగా తమిళ తెలుగు భాషలు కలిసి, సహజీవనం సాగించిన తీరును పుల్లూరి ఉమగారు తమిళ సంస్థానాలలో తెలుగు కవులు వ్యాసంలో చక్కగా విశదీకరించారు.

తమిళ పదకర్తలు తెలుగులో సృష్టించిన పద సాహిత్యాన్ని వివరిస్తూ యన్.గురుమూర్తి గారు రాసిన తెలుగు పద సాహిత్యం- తమిళుల సేవ వ్యాసం వివరణాత్మకంగాను, విశ్లేషణాత్మకంగాను ఉంది. భారతదేశంలో డాక్టరేట్ పొందిన తొలి సంగీత విద్వాంసుడు ముత్తయ్యభాగవతార్ అనే ఈ విషయం ఈ వ్యాసం వల్లనే లోకానికి తెలుస్తోంది. 'పంతము సేయరాదు పామరుడైన నాపై' అనే కీర్తన ముత్తయ్యభాగవతార్ దేనన్న విషయం చాలామందికి తెలియదు. గురుమూర్తిగారు ఇలా కొత్త సంగతులను ఈ వ్యాసంలో పేర్కొన్నారు. డాక్టర్ విస్తాలి శంకరావుగారు మద్రాసు యూనివర్శిటిలో అధ్యాపకులు. మంచి అభిరుచి వున్న రచయిత. వారి వ్యాసం దక్షిణాంధ్ర యుగం- యక్షగానాలు. తంజావూరు నాయకరాజులు యక్షగాన వికాసానికి చేసిన కృషిని చక్కగా వివరించారు.

మందలపు నటరాజ్ గారి 'దక్షిణాంధ్ర యుగం-కవయిత్రులు". ఉప్పలధడియం సత్యనారాయణరాజుగారి 'త్యాగయ్య జీవితం-వ్యక్తిత్వం'. యం.డి గౌస్ భాషాగారి 'తమిళనాడులో తెలుగు సంఘాలు'. యం.యతిరాజులుగారి తమిళనాడులో తెలుగు జానపద సాహిత్యం వంటి వ్యాసాలు చక్కని సమాచారాన్ని భవిష్య తరాలకు అందిస్తున్నాయనడంలో సందేహం లేదు.

గ్రామీణ సంస్కృతి, స్వచ్ఛమైన వారి జీవనానికి అద్దం పట్టే తమిళ, తెలుగు జానపద గేయాల్లోని సాహిత్యపు విలువలను గురించి, సంస్కృతిని గురించి డాక్టర్ నిర్మలాపళనివేలు రాసిన వ్యాసం పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతికి జీవన నాళిక జానపద గీతి అన్న ఆరుద్ర గారి మాట ఈ వ్యాసంలో చక్కగా ప్రతిబింబించింది.

ఇక ఈ వ్యాస సంకలనం సంపాదకులు డా|| ఉప్పలధడియం వెంకటేశ్వరగారు వృత్తిరీత్యా సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా, ప్రవృత్తి రీత్యా తెలుగులో మంచి కవి. హృద్యమైన పద్యాన్ని ఎంత చక్కగా రాయగలరో, ఆలోచనాత్మకమైన వచన కవిత్వాన్ని అంతే చక్కగా రాయగల రచయిత. తమిళనాడు తెలుగు సాహిత్యం సంకలనం వెంకటేశ్వరగారి సాహితీదృష్టికి, విషయ అవగాహనకు అద్దంపడుతుంది. సంపాదక బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించిన డాక్టర్ ఉప్పలధడియం వారు 'దక్షిణాత్యుల తెలుగు సొగసులు అనే సొగసైన వ్యాసాన్ని రాశారు. తిమిళనాడులోని తెలుగువారి నిత్య వ్యవహారంలో కన్పించే అచ్చ తెలుగు మాటలు సొగసులను ఈ వ్యాసంలో ఆరబోశారు. అరుదైన మాటలకు అర్థాలను ఇవ్వడం వలన పాఠకులు విషయావగాహనకు ఎంతో దోహదపరిచాయి.

గత రెండు దశాబ్దాలుగా సాంఘిక సాంస్కృతిక సేవలలో మమేకమౌతోన్న 'జనని' సంస్థ అనుభవజ్ఞులైన భాషా సాహిత్యవేత్తలచే విలువైన వ్యాసలను రాయించి, 'తమిళనాడు తెలుగు సాహిత్యం' అనే ఉత్తమ సంకలనాన్ని అందించింది. నిస్సందేహంగా ఇదో రెఫరెన్స్ బుక్. అన్ని గ్రంథాలయాలలో ఉండదగిన ఉత్తమ గ్రంథం. అందరూ దాచుకోవాలసిన విలువైన సంచిక.

సంకలన రెండవ భాగంలో తమిళనాడులో ముఖ్యంగా చెన్నైతో అనుబంధమున్న 259 మంది కవులు రచయితల వివరాలను సంక్షిప్తంగా ఇవ్వడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అయితే 17 మంది పరిచయాలు ఫోటోలు లేకుండా ముద్రించడం లోపంగానే ఉంది. ఎంత ప్రయత్నించినా లభ్యంగాని ఫోటోలను ముద్రించలేదంటే సరిపెట్టుకోవచ్చు. ఆరుద్ర, ఆలూరి బైరాగి, అనిశెట్టి, ఆత్రేయ, కొడవటిగంటి, జాషువా, జగ్గయ్య, బి.యస్.ఆర్.కృష్ణ, భానుమతి, ఆర్వీయం సుందరం, దేవులపల్లి, శ్రీ శ్రీ వంటి సుపరిచితుల ఫోటోలనైనా ముద్రించి ఉన్నట్లయితే, సంకలనానికి సంపూర్ణత సిద్ధించేది. ముందుతరాలవారికి గుండెగుర్తులుగా ఉండేవి. అలాగే సంపాదకులు ఆయా వ్యాసాల్లో పునరావృతుల్ని పరిహరిస్తే బాగుండేది. ఆయా రచయితల వ్యాసాల్లో ఉదాహరణకు ఒకేవిధంగా ఉండటం వలన పాఠకులకు కాస్తంత ఇబ్బంది కలగవచ్చు.

ఈ సంకలనం ద్వారా 'తెలుగు సేవా భాస్కరుడు ' పేరిశెట్ల భాస్కరుడు, హోసూరులో 'తెలుగు తేజం' కె.యస్.కోదండరామయ్య, చెన్నైలో సాధువరదరాజు పంతులు వంటి మహనీయులను స్మరించుకునే అవకాశం కలిగింది. ఈ సంచికలోని ప్రతి వ్యాసం ఓ సాహితీ విపంచిక. సంగీత ప్రమోదిక. భవిష్యత్తు సంకలనాలకు ప్రయోగదీపిక. 'దేశభాషలందు తెలుగు లెస్స' అనే మకుటంతో అందమైన, ఆకర్షణీయమైన తెలుగు తల్లి రంగులు ముఖచిత్రంతో వెలువడిన ఈ అపురూప సంచిక 182 పుటల అందమైన అద్దంలో కనిపించే తెలుగు సాహిత్యపుకొండ. సంచిక రూపకల్పనలో సహకరించిన "జనని" ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్యగారితో పాటు, ఇతర సలహామండలి సభ్యుల కృషి అక్షరాలా సఫలీకృతమైంది.
- డాక్టర్ బీరం సుందరరావు

తమిళనాడు తెలుగు సాహిత్యం (సాహిత్య వ్యాస సంకలనం )
సంపాదకులు : డాక్టర్ ఉప్పల ధడియం వేంకటేశ్వర
ప్రచురణ : జనని (సాంఘిక సాంస్కృతిక సమతి),
ప్రతులకు : జనని, 13/ 53, రెండవ వీధి, వాసుకీనగర్, కొడుంగైయూర్, చెన్నై
దూరవాణి : 044-25541572
వెల : 200/-

వెబ్దునియా పై చదవండి