దాస్ కాపిటల్ కామిక్ వెర్షన్ విడుదల

మంగళవారం, 18 నవంబరు 2008 (17:22 IST)
పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కారల్ మార్క్స్ రాసిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక విశ్లేషణ గ్రంధం దాస్ కాపిటిల్‌ను కామిక్ రూపంలో జపాన్‌లో త్వరలో విడుదల చేయనున్నారు. ఈ ఉద్గ్రంధంలో మార్క్స్ వ్యక్తీకరించిన అత్యంత సంక్లిష్టమైన అర్థశాస్త్ర భావనలను అతి సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా మాంగా అనే దేశీయ హాస్య రూపంలో మలిచి పుస్తకాన్ని రూపొందించారు.

టోక్యోకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ ఈస్ట్ ప్రెస్ దాస్ కాపిటల్ కామిక్ వెర్షన్‌ను డిసెంబర్ 5న ప్రచురించనుంది. హాస్యరూపంలో కారల్ మార్క్స్ పుస్తకం ప్రచురణకు రావడం అనేది జపాన్‌లో వామపక్ష సాహిత్యానికి పెరుగుతున్న ఆదరణను సూచిస్తోందని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ మాంద్యంలోకి కూరుకు పోనున్న తరుణంలో జపాన్‌లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం అమాంతంగా పెరగటం, పెట్టుబడిదారీ వ్యతిరేక సాహిత్యం ప్రజాదరణను పొందటం అనేది సహజసిద్ధమేనని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.

జపాన్‌లో మాంగా అనేది ఒక కళారూపం. జపాన్ ప్రధాని టారో అసోతో సహా పలువురు ప్రముఖులు ఈ మాంగా కళారూపం అంటే చెవికోసుకుంటారు.

వెబ్దునియా పై చదవండి