ఫ్రెంచ్ రచయిత గుస్టావ్‌కు సాహిత్యంలో నోబెల్ అవార్డు
గురువారం, 9 అక్టోబరు 2008 (19:10 IST)
సుప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత జీన్-మేరీ గుస్టావ్ లె క్లెజియోకు సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. 1. 4 మిలయన్ డాలర్ల విలువైన ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని 2008 సంవత్సరానికి గాను గుస్టావ్‌కు బహుకరించిన స్వీడిష్ అకాడెమీ ఆయన రాసిన సాహసోపేత నవలలు, వ్యాసాలు, బాల సాహిత్యం పట్ల ప్రశంసల వర్షం కురిపించింది.
ఈ అవార్డుతో 2000 సంవత్సరం తర్వాత ఓ ప్రెంచ్ రచయిత సాహిత్యంలో మొదటిసారి నోబెల్ బహుమతిని కైవసం చేసుకున్నట్లయింది. చైనాలో పుట్టి ఫ్రాన్స్‌లో ఆశ్రయం తీసుకుని ఫ్రెంచ్ పౌరుడిగా స్థిరపడిన గావో జింజియాన్ 2000 సంవత్సరంలో ఫాన్స్ తరపున నోబెల్ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు 1985లో ఫ్రెంచి జాతీయుడైన రచయిత క్లాడ్ సైమన్ సాహిత్యంలో నోబెల్ అవార్డు కైవసం చేసుకున్నారు.
కాగా, లే క్లెజియోకు సాహిత్యంలో నోబెల్ అవార్డు ప్రకటించిన స్వీడెన్ అకాడెమీ ఆయన రచనల్లోని నవ్యత్వాన్ని, కవితా సాహసికత్వాన్ని, నాగరికతకు ముందూ తర్వాతా మానవత్వ అన్వేషణా స్ఫూర్తిని కొనియాడింది.
1940లో చైనాలో జన్మించిన లె క్లెజియో తొలి నవల లె 1963లో ప్రచురించబడింది. అస్తిత్వవాద ధోరణితో స్పూర్తి నొందిన లె రోజువారీ జనం పలికే వాడుక భాషకు పట్టం కట్టి వాటిద్వారా సామాజిక వాస్తవికత శక్తిని పట్టి చూపేవారని అకాడెమీ పేర్కొంది.
ఆ తర్వాత లె బాలల ప్రపంచాన్ని అన్వేషించే వైపుగా మళ్లారు. అలాగే తన స్వంత కుటుంబ చరిత్రను కూడా వెతుక్కోవడంపై దృష్టి సారించారు. మంచి కుటుంబంలో పెరిగిన లె క్లెజియో తన కుటుంబంతో పాటు చిన్న వయసులోనే నైజీరియా వెళ్లాడు. అక్కడ గడిపిన నెలరోజుల్లో తొలి రచనలు చేశారు.
స్పీడిష్ అకాడెమీకి చెందిన హోర్సో ఎంగాధీ నోబెల్ బహుమతి గ్రహీత గురించి మాట్లాడుతూ తన రచనలు వైవిధ్యపూరితంగా ఉంటాయని చెప్పారు. అయితే అతడు ప్రపంచ పౌరుడిగా, పర్యాటకుడిగా, సంచారజీవిగా బహుముఖ అనుభవం గడించి తన రచనాశైలిని సుసంపన్నం చేసుకున్నారని ప్రశంసించారు.
అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు తప్ప ఈ నాటికీ కొనసాగుతున్న తక్కిన నోబెల్ అవార్డులను 19వ శతాబ్దిలో డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం స్థాపించారు. నోబెల్ అభిమతం ప్రకారం ఈ అవార్డులను 1901 నుంచి ప్రకటిస్తున్నారు. కాగా అర్థశాస్త్రానికి నోబెల్ అవార్డును మాత్రం 1968లో స్వీడెన్ సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపించింది.