తెలుగు సినిమాల చరిత్ర గురించి ఇంతవరకు ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా మళ్లీ కొత్త పుస్తకాలలో మన తెలుగు సినిమాల గురించి మరింత కొత్త సమాచారం వస్తూనే ఉంది. తెలుగు టాకీ వెలుగు నీడలు గురించి తాజాగా పాత్రికేయుడు పిఎస్ రావు అందించిన సమాచారం ఆసక్తికరంగా రూపొందింది. తెలుగు సినిమా ప్రస్థానంలో పౌరాణిక, చారిత్రక, సామాజిక ఇతివృత్తాలతో కూడిన మూడు దశలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
తెలుగు సినీరంగంలో 1931 నుంచి 2006 వరకు చోటు చేసుకున్న ఎన్నో మార్పులను ఈ పుస్తకం వివరిస్తోంది. 1950-70 మధ్య కాలంలో తెలుగు చలన చిత్ర క్షేత్రంలో పురస్కారాల పంట పండింది. మరోవైపు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో సైతం తెలుగు చిత్రాలు తమ ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చాయి.
తెలుగులో చారిత్రక, పౌరాణికాల ప్రాబల్యం 1931-40 కాలంలో కొట్టొచ్చినట్లు కనిపించగా 1941-51 మధ్య కాలంలో వచ్చిన స్వర్గ సీమ చిత్రం ఓ కొత్త వరవడిని దిద్దింది. మల్లీశ్వరి, మాయాబజార్, నర్తనశాల, శ్రీ సీతారామ కళ్యాణం, దేవదాసు వంటి మేటి చిత్రాలు దీనివెనుకే వరుసగా వచ్చాయి.
1951-60ల కాలంలో తెలుగులో సాంఘిక చిత్రాలు ఊపందుకున్నాయి. ఎంతో మంది ప్రతిభా వంతులైన నటీనటులుఈ కాలంలోనే వెలుగు చూశారు. ఇలాంటి మరెన్నో విశేషాలతో పాటు 1931 నుంచి 2006 దాకా విడుదలైన తెలుగు చిత్రాల విశేషాలు సవివరంగా రచయిత పిఎస్ రావు అందించారు.
అలనాటి తెలుగు సినిమాల వెలుగు నీడలను పరిశీలించాలనుకునే వారు తప్పక చదవాల్సిన పుస్తకంగా ఇది రూపొందింది. పేజీలు. 66, వెల రూ.50. ప్రతులకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్