"మహాత్ముడి రచన"లను ఎవరైనా ముద్రించవచ్చు

సోమవారం, 5 జనవరి 2009 (19:41 IST)
జాతిపిత మహాత్మాగాంధీ రచనలను ఇకమీదట ఎవరైనా ముద్రించుకోవచ్చు. గాంధీజీ రచనలపై నవజీవన్ ట్రస్టుకు ఉన్న కాపీరైట్ హక్కు జనవరి 1, 2009తో ముగిసిపోవడం వల్ల, ముద్రణాకర్తలు ఎవరైనా సరే ఆయన రచనలను ముద్రించుకునే హక్కులు కలిగి ఉంటారు.

ఈ విషయమై నవజీవన్ ట్రస్టు ఛైర్మన్ జితేంద్ర దేశాయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... జనవరి ఒకటవ తేదీ, 2009 నుంచి మహాత్ముడు రచించిన పుస్తకాలను ముద్రణాకర్తలు ఎవరైనా తిరిగి ముద్రించుకోవచ్చునని తెలిపారు. దీనికోసం గాంధీజీ నెలకొల్పిన "నవజీవన్ ముద్రాలయ" ట్రస్టును కూడా సంప్రదించాల్సిన అవసరం లేదని, రాయల్టీ చెల్లించాల్సిన పని లేదని చెప్పారు.

ఇదిలా ఉంటే... గాంధీజీ కేవలం అయిదు పుస్తకాలను మాత్రమే రాశారు. అయితే వివిధ అంశాలపై నవజీవన్, యంగ్ ఇండియా, హరిజన్ ముద్రణా సంస్థల ద్వారా ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు. వీటితో దాదాపు 100కు పైగా పుస్తకాలుగా రూపొందాయని జితేంద్ర ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా, భారత కాపీరైట్ చట్టం ప్రకారం రచయిత మరణించిన 60 సంవత్సరాలదాకా... అతడి రచనలకు కాపీరైట్ వర్తిస్తుంది. దీంతో మహాత్ముడు మరణించి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తవడంతో ఆయన రచనలకు ఉన్న కాపీరైట్ హక్కు ముగిసింది.

వెబ్దునియా పై చదవండి