ఈనెల 16, 17 తేదీల్లో ఇండో-అమెరికా ఆర్థిక సదస్సు!

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 16, 17 తేదీల్లో ఇండో అమెరికా ఆర్థిక సదస్సు జరుగనుంది. ఇండో-అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఇరు దేశాలకు చెందిన సుమారు 300 మంది ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.

రెండు దేశాలమధ్య కొనసాగించాల్సిన ఆర్థిక సహకారంపై సదస్సులో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ సదస్సులో సాధారణంగా ప్రస్తావనకు వచ్చే వర్తక, వాణజ్య అంశాలతో పాటు ఆర్థికమాద్యం నేపపథ్యంలో అనుసరించాల్సిన కొత్త వ్యూహాలు చర్చించే అవకాశం వుందని సదస్సు ఛైర్మన్‌ లలిత్‌ బాసిన్‌ మంగళవారం తెలిపారు.

సదస్సులో సేవారంగంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా భారత్‌ అందించే సేవలపై దృష్టి సారించడం జరుగుతుందని బాసిన్‌ తెలిపారు. భారత్‌, అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సహకారం ప్రపంచ అభివృద్ధికి దోహదం చేస్తుందని బాసిన్‌ పేర్కొన్నారు.

ఈ సదస్సులో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, యుఎస్‌ రాయబార కార్యాలయం డిప్యూటీ ఛీఫ్‌ స్టీవెన్‌ జెవైట్‌, నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అరవింద్‌ జాదవ్‌ తదితరులు పాల్గొంటారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి