ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది: ఒబామా హామీ

ఆదివారం, 8 మార్చి 2009 (16:12 IST)
ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా హామీ ఇచ్చారు. ఆర్థిక పరిపుష్టికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని.. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన హితవు పలికారు. ఈ ఏడాదిలో వేగవంతమైన ఆర్థిక రికవరీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ, భవిష్యత్ గురించి ప్రజలు ఆందోళనకు గురి అవతున్నారని తాము భావించట్లేదు అన్నారు. అమెరికా ఆర్థిక విధానాల పట్ల వారికి విశ్వాసం ఉండగలదన్నారు. ఆర్థిక సంక్షోభానికి ముగింపు మరెంతో దూరంలో లేదని సూచించారు.

ఆర్థిక మాంద్యం నుండి బయటపడేందుకు మరో 750 బిలియన్ డాలర్లను వెచ్చించాలని తాము అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే... విఫలమవుతున్న ఆర్థిక సంస్థల కోసం 700 బిలియన్ డాలర్లను విడుదల చేశామన్న విషయాన్ని గుర్తు చేశారు.

పన్ను కోడ్‌ను తిరగరాయడం, ఆరోగ్య రంగాన్ని విస్తరించడం, వాతావరణ మార్పుపై దృష్టి సారించడం తదితర ఉన్నత లక్ష్యాలపై తాము ముందుకెళుతున్నామన్నారు. తాము త్వరలో స్వేచ్ఛా మార్కెట్ విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి