ఎయిర్ ఇండియాకు దెబ్బమీద దెబ్బ!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా దేశీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకూడా ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది.

ఇదిలావుండగా ఏకంగా బస్సులు, రైళ్ళలో మాదిరి విమానంలోకూడా ఓవర్‌‌లోడ్‌తో ప్రయాణీకులను వారివారి గమ్య స్థానాలకు చేరవేస్తుందని ఫిర్యాదులు అందడంతో ఆ సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓవర్‌లోడ్‌ పదం మనం తరచూ వింటూ ఉంటాం. ముఖ్యంగా పండుగ పూట బస్సెక్కాంటే ఎంత కష్టమో చాలా మందికి తెలుసు. ఒక్కోసారి బస్సులో నిలబడి ప్రయాణం చేస్తాం... మరీ అర్జంటైతే బస్సు డ్రైవర్‌ పక్కన కూడా కూర్చుంటాం. ఆర్టీసీ బస్సు కదా.. అని సర్దుకు పోయి ప్రాయాణం కానిచ్చేస్తాం. కాని.. అదే పరిస్థితి విమానంలో ఎదురైతే.... ఇపుడు ఎయిర్‌ ఇండియా పరిస్థితి ఇలాగే ఉంది.

ఎయిర్‌ ఇండియా నష్టాల్లో ఉందని.. జీతం కూడా సకాలంలో ఇవ్వలేనని అంటోంది. మరి ఇలాంటి సంస్థ లాభాల కోసం ఏమైనా చేయొచ్చేమోగాని... ఓవర్‌ లోడ్‌ వేయొచ్చా.. అదీ భద్రతా కారణాలు లెక్కచేయకుండా చేయొచ్చా.

ఎయిర్‌ ఇండియా సంస్థపై ఇలాంటి తరహాలోనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. కక్కుర్తి పడి అదనపు టిక్కెట్లు ఇచ్చింది. మే 5వ తేదీన ముంబై విమనాశ్రాయంలో ఎయిర్‌బస్‌ విమానం తలుపు దెబ్బతింది. విమానానికి తగిలించిన నిచ్చెన తీయకుండానే విమానం బయలుదేరడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. విమానంలో కెపాసిటీకి మించి ప్రయాణీకులు ఉన్నట్లు తేలింది. పైగా ఒక ప్రయాణీకుడు ఏకంగా విమానం పైలెట్‌ సీట్లో కూర్చున్నాడు. మరో ఇద్దరు విమాన సిబ్బంది కూర్చునే సీట్లలో ప్రయాణం చేస్తున్నారు.

టికెట్ల జారీలోనూ, ఆ తరువాత ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అదనంగా ప్రయాణీకులను ఎలా అనుమతించారని డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది. టికెట్లు ఇచ్చే మొత్తం వ్యవస్థ కంప్యూటర్ల ద్వారా జరుగుతున్నా, బోర్డింగ్‌ పాసులు ఇవ్వడంపట్ల డీజీఏసీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.

దీంతో ఎయిర్‌ ఇండియాపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా అక్రమ ప్రయాణీకులు విమానం ఎక్కడం, భద్రతా చర్యలను ఉల్లఘించినట్లే అవుతుంది. అంటే ఒకవేళ విమానానికి ఎలాంటి ప్రమాదం జరిగినా, అదనంగానున్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాద బీమా రాదన్నమాట.

వెబ్దునియా పై చదవండి