ఐపీఎల్‌లో భాగస్వామ్యం కానందుకు సంతోషంగా ఉందిః మిట్టల్

సోమవారం, 10 మే 2010 (17:08 IST)
తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ఆటలో భాగస్వామిని కానందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆసియాలో అత్యంత ధనికుడు, ఉక్కు దిగ్గజం, ఆర్సెలార్ మిట్టల్ సీఈఓ లక్ష్మీ నివాస్ మిట్టల్ న్యూ ఢిల్లీలో తెలిపారు.

ఐపీఎల్ టి20 ఆటపై ఇటీవల తలెత్తిన వివాదం గురించి ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అత్యంత విలువైన నాలుగు బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 18,000 కోట్ల)విలువ కలిగిన ఐపీఎల్ ఆటలో తాను భాగస్వామిని కానందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ఐపీఎల్ ఆటకు సంబంధించిన ఓ క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేస్తానన్ని వార్తలు రావడం అంతా అభూత కల్పనలేనని ఆయన స్పష్టం చేశారు.

ఐపీఎల్‌లో భాగస్వామ్యం కావాలనుకుంటే దానికి చాలా సమయం వెచ్చించాలి, ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆయన అన్నారు. అయినప్పటికీ తనకు అంతటి సమయం, క్రికెట్‌పై అంతటి ఆసక్తి లేదని ఆయన అన్నారు. తనకు ఎలాంటి ఐపీఎల్ ఆటల్లోను పాల్గొనాలనే కోరిక ఏ మాత్రం లేదని లక్ష్మీ మిట్టల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి