గృహరుణాలు పొందేవారికి శుభవార్త: ప్రణబ్

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (14:18 IST)
దేశంలో గృహరుణాలు పొందేవారికి ఒకశాతం వడ్డీలో రాయితీనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దేశంలో గృహనిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలు బ్యాంకుల ద్వారా తీసుకునే గృహరుణాలపై ఒకశాతం వడ్డీని రాయితీగా ప్రకటించారు. దీనికిగాను గృహనిర్మాణ రంగానికి రూ. 700 కోట్ల(రూ. 7 బిలియన్లు) సహాయనిధిని వచ్చే ఆర్థిక సంవత్సరం(2010-11) బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు.

గృహ రుణాల నిమిత్తం బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలలో రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మేరకు తీసుకునే రుణాలకు ఒక శాతం వడ్డీని సబ్సిడీగా గత సంవత్సరం ఆర్థిక సహాయనిధి క్రింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఆయన సభలో ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి