ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ కసరత్తులు: ప్రణబ్‌ ముఖర్జీ

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్‌బీఐ తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఈ గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ జరిపే మధ్యంతర ద్రవ్యవిధాన సమీక్షలో ద్రవ్యోల్బణానికి ప్రముఖ పాత్ర ఉంటుందని నిపుణులు ఆశిస్తున్నారు.

ఆగస్టు నెలలో కొత్త టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 8.5శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. ద్రవ్యోల్బణం తగ్గుముఖంలో ఉన్నప్పటికి, కేంద్ర బ్యాంకు కీలక వడ్డీరేట్లపై కఠినంగా వ్యవహరించ వచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

దేశ ఆర్థిక పరిస్థితులను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందని, తాము కూడా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రణబ్‌ తెలిపారు. ఇది వరకూ ఎప్పడు లేని విధంగా ఆర్‌బీఐ చరిత్రలో మొట్టమొదటిసారిగా మధ్యంతర ద్రవ్య త్రైమాసిక సమీక్ష గురువారం జరుగనుంది.

ఆర్‌బీఐ గత జూలైలో జరిగిన త్రైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో, రివర్స్‌ రేట్లను 0.25 శాతానికి, 0.50 శాతానికి పెంచడంతో రెపో రేటు 5.75 శాతం, రివర్స్‌ రెపో రేటు 4.50 శాతంగా నిలిచింది. కాగా.. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో 6 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జీడిపి), ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8.8 శాతానికి పెరిగింది. అలాగే పారిశ్రామికోత్పత్తి కూడా గతేడాది జూలైలో 7.2 శాతం ఉండగా, ఈ సంవత్సరం అదే సమయానికి 13.8 శాతంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి