' బుల్లెట్ ' ధర పెంచనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్

మంగళవారం, 2 ఫిబ్రవరి 2010 (14:11 IST)
మోటారు వాహనాల నిర్మాణంలో రారాజైన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ బుల్లెట్ వాహనం కొత్త మోడల్ ధరను పెంచనుంది.

బుల్లెట్ మోటారు వాహనాన్ని తయారు చేసే తమ సంస్థ రానున్న రోజుల్లో కొత్త మోడల్ బుల్లెట్ వాహనం బీఎస్-3కి అనుగుణంగా ఉంటుందని, దీంతో ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన కార్యనిర్వహణాధికారి సిద్ధార్థ్ లాల్ మంగళవారం మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కొత్తగా తయారు చేసే మోటారు వాహనాల ముడి సరుకుల ధరలు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదన్నారు. కొత్తగా తయారు చేసే ఇంజను సామర్థ్యం ఉన్నతంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఐషర్ మోటార్స్ కంపెనీకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ వద్ద ప్రస్తుతం ఐదు మోడళ్ళున్నాయి. క్లాసిక్, క్లాసిక్ 500 సిసి, థండర్‌బర్డ్, మైచిస్మో, ఇలెక్ట్రా వాహనాలు. మరో ఐదు నెలల కాలంలో క్లాసిక్ 500 మోడల్ వాహనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థకు నాలుగు వేల వాహనాల ఆర్డర్లు వచ్చాయన్నారు. మరో రెండు వేల వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయనున్నామని ఆయన వెల్లడించారు. కాగా నిరుడు నవంబరు నెలలో క్లాసిక్ 500ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసామని, ఇప్పటి వరుక ఈ రకానికి చెందిన వెయ్యి వాహనాలను అమ్మినట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్స్ షో రూం ధర లక్ష రూపాయలుగా ఉంది. మరి రానున్న రోజుల్లో ఎంతమేరకు ధరలను పెంచనుందో ఆయన స్పష్టం చేయకపోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి