మలేషియాలోని స్వామి నిత్యానంద ఆశ్రమం మూసివేత

మంగళవారం, 9 మార్చి 2010 (18:09 IST)
ఆధ్యాత్మిక గురువు స్వామి పరమహంస నిత్యానందకు చెందిన మలేషియాలోని ఆధ్యాత్మిక ఆశ్రమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆశ్రమ ప్రతినిధి తెలిపారు. .

భారతదేశంలో నివసిస్తున్న ఆధ్యాత్మిక గురువైన స్వామి పరమహంస నిత్యానంద స్వామికి మలేషియాలో ఆధ్యాత్మిక ఆశ్రమం ఉంది. ఇందులో ఆయన ఆధ్యాత్మిక ప్రబోధనలు ఇస్తుంటారు. ఇటీవల ఆయన రాసలీలలు బయటకు పొక్కడంతో కౌలాలంపూర్‌లోనున్న ఆయన ఆశ్రమ కార్యక్రమాలను స్థానిక హిందూ సంఘం సూచన మేరకు నిలిపివేసినట్లు ఆశ్రమ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.

దక్షిణ భారతదేశంలోని పలు టీవీ ఛానెళ్ళలో నిత్యానంద స్వామి, ప్రముఖ తమిళ నటీమణితో జరిపిన రాసలీలలు కథనాలుగా ప్రసారం కావడంతో మలేషియాలోనున్న ఆయన ఆశ్రమ కార్యక్రమాలు నిలిపివేసామని ఆశ్రమ నిర్వాహకులు మంగళవారం తెలిపారు. మలేషియాలోని తమన్ దేసా గోంబాక్ ప్రాంతంలో రెండు సంవత్సరాల క్రితం నిత్యానంద స్వామి ప్రబోధనలకు ఆకర్షితులై ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆశ్రమ ప్రతినిధి తెలిపారు. స్వామి తరచూ తమ ఆశ్రమంలో ఆధ్యాత్మిక ప్రబోధనలు చేస్తుంటారని, దీంతో పలువురు అతని ప్రబోధనలకు ఆకర్షితులై ఆయనకు భక్తులుగా మారారని స్థానిక వార్తాపత్రిక స్టార్ న్యూస్ పేపర్ ప్రకటించింది.

ఇదిలావుండగా నిత్యానంద స్వామి రాసలీలలు పలు టీవీ ఛానెళ్ళలో ప్రసారం కావడంతోపాటు ఆయన వ్యక్తిగత డ్రైవర్ అందించిన పలు సీడీలను ఆధారంగా చేసుకుని నిత్యానందపై రేప్, మోసం క్రింద చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి