సెయిల్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకొంటాం: చిదంబరం

గురువారం, 8 ఏప్రియల్ 2010 (16:36 IST)
దేశీయ ఉక్కు ఉత్పత్తి రంగంలో అగ్రగామిగానున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్ఏఐఎల్) సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వం 20 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం గురువారం న్యూ ఢిల్లీలో వెల్లడించారు.

కేంద్ర క్యాబినెట్ ఈ రోజు ఆర్థిక వ్యవహారాలపై చర్చించేందుకు సమావేశమైంది. ఈ సందర్భంగా క్యాబినెట్ నిర్ణయించిన విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. తమ ప్రభుత్వం సెయిల్‌ సంస్థ నుంచి రూ. 16,000 కోట్లను ఉపసంహరించుకుంటుందన్నారు. ఈ ఉపసంహరణలో భాగంగా పెట్టుబడులను రెండు విడతలుగా తీసుకుంటామని ఆయన తెలిపారు. దీని ప్రకారం తొలుత రూ. 8,000 కోట్లను ఉపసంహరించుకుంటామన్నారు.

ఇదిలావుండగా ప్రస్తుతం సెయిల్‌లో ప్రభుత్వ పెట్టుబడులు 85.82 శాతం ఉన్నాయి. ప్రభుత్వం ఇరవై శాతం సొమ్మును ఉపసంహరించుకుంటే ప్రభుత్వ వాటా 69 శాతానికి చేరుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి